👉 ధాన్యం తరుగు పై ప్రశ్నించినందుకు…
👉 సంవత్సర కాలంగా రైతుకు చేరని ధాన్యం !
J.SURENDER KUMAR,
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తాలు, తప్ప పేరిట తరుగు తీయడం ఏమిటి ? అని ప్రశ్నించిన రైతు, రైతు కొడుకు పై పోలీస్ లు కేసులు నమోదు చేసి సంవత్సర కాలంగా రైతు కుటుంబాన్ని పరేషాన్ చేస్తున్నారు. నిరసన తెలిపిన రైతు ధాన్యాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించి 15 నెలలు పూర్తి కావస్తున్న రైతుకు పోలీసులు ధాన్యం తిరిగి ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్న ఉదాంతం ఇది.
👉వివరాలు ఇలా ఉన్నాయి…
ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టంశెట్టి రాజన్న అనే రైతు తన వరి ధాన్యాన్ని అమ్మకం కోసం ధర్మపురి సింగిల్ విండో ద్వారా కమలాపూర్ లోని కొనుగోలు కేంద్రానికి తరలించాడు. తరుగు పేరిట ధాన్యం కొనుగోలు నిర్వాహకులు బస్తా ఒక్కంటికి 4 నుంచి 5 కిలోలు అధిక తూకం వేయడాన్ని రైతు రాజన్న వారిని ప్రశ్నించాడు.
కొనుగోలు కేంద్రంలో ఉన్న రాజన్న వరి ధాన్యాన్ని నిర్వాహకులు దాదాపు 40 రోజులుగా కొనుగోలు చేయక ఇబ్బందులకు గురి చేశారు. విసిగి వేసారి రైతు కొనుగోలు కేంద్రంలోని తన వరి ధాన్యాన్ని ట్రాక్టర్ లో తెచ్చి అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ( ధర్మపురిలోని ) క్యాంపు కార్యాలయ గేటు ముందు 2023 జూన్ 3న పోసి నిరసన తెలిపాడు.
ధర్మపురి పోలీస్ రంగ ప్రవేశం చేసి మంత్రి క్యాంపు గేటు ముందు వరి ధాన్యాన్ని దాదాపు 15 క్వింటాళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించి రైతు రాజన్నను అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు స్వాధీనపరుచుకున్న వరి ధాన్యం కోసం రైతు, పోలీస్ స్టేషన్, అధికారుల చుట్టూ సంవత్సర కాలంగా తిరుగుతున్న రైతు తాను పండించిన ధాన్యాన్ని ఇంటికి తెచ్చుకోలేక, మార్కెట్ లో అమ్ముకోలేక సంవత్సర కాలంగా అష్ట కష్టాలు పడుతున్నాడు.
👉రైతుతో పాటు కొడుకుపై కేసులు!
పోలీసులు స్వాదినపరుచుకొని స్టేషన్ కు తరలించిన తన వరి ధాన్యాన్ని ఇప్పించాల్సిందిగా రైతు జగిత్యాల జిల్లా ఎస్పీకి, మానవ హక్కుల సంఘానికి 2023 జూలై 12, 13 తేదీలలో ఫిర్యాదు చేశాడు.

దీంతో అప్పటి ధర్మపురి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న రైతు రాజన్నకు 41 నోటీసు జారీ చేస్తూ. Cr.No.152/2023,U/Sec.341IPC కింద కేసు రిజిస్టర్ అయినట్టు నోటీసులో పేర్కొన్నరు. ( కానిస్టేబుల్ ఫిర్యాదు అని పేర్కొన్నారు)
👉మరో నోటీసులో రైతు ఆయన కొడుకు పై ..

రైతు రాజన్న కు, ఆయన కొడుకు శివకుమార్ పై (24) కు పోలీసులు జారీ చేసిన మరో 41 నోటీసులలో Cr.No.155/2023, U/Sec.500, 505(ii),506 IPC కింద కేసు రిజిస్టర్ అయినట్టు నోటీసులో పేర్కొన్నారు ఇద్దరి నోటీసులలో ( శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు అని పేర్కొన్నారు)
ఇది ఇలా ఉండగా 2023 జూన్ 3న రైతు ధాన్యంతో నిరసన తెలిపితే, అదేరోజు పోలీసులు ధాన్యాన్ని స్వాధీన పరుచుకుని స్టేషన్ కు తరలించారు. మూడు నెలల తరువాత 2023 సెప్టెంబర్ 13న మీపై కేసులు నమోదైనట్టు పోలీసులు 41 నోటీసు ఇవ్వడం తో ప్రశ్నించే గొంతుకులను పరేషాన్ చేస్తామనే సంకేతాలు రైతాంగానికి పరోక్షంగా జారీ చేసినట్టు చర్చ. దీనికి తోడు ఆరుగాల కష్టపడి పండించిన పంటను పోలీసులు రైతుకు అప్పగించకుండా వేధిస్తూ ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడంలో ఆంతర్యం అందరూ తెలిసిన విషయమే.
ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, జోక్యం చేసుకోని, రైతు ఆయన కొడుకు పై నమోదైన కేసులు మాఫీ చేయించి పోలీసుల స్వాధీనంలో ఉన్న ధాన్యం రైతు కు ఇప్పించి న్యాయం చేయాలని రైతాంగం ముక్తకంఠంగా కోరుతున్నారు.