రాష్ట్రంలోని ఐటీఐలు ‘అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా ‘ మార్పు !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్స్‌గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్‌ను అప్‌గ్రేడ్ చేయాలని చెప్పారు.


డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం కార్మిక ఉపాధి కల్పన శాఖ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఇండస్ట్రీకి అవసరమైన రీతిలో ఏటీసీల్లో సిలబస్ మార్పునకు ఉన్నతస్థాయి కమిటీని నియమించి నిపుణుల సలహాలు, సూచనలతో పాటు స్కిల్ యూనివర్సిటీ సహకారం తీసుకోవాలని అన్నారు.


పాలిటెక్నిక్ కాలేజీల్లో కొత్త ఏటీసీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఐటీఐలు లేని అసెంబ్లీ నియోజకవర్గాలను గుర్తించి నివేదిక సమర్పించాలని అన్నారు.
రాష్ట్రంలో కనీసంగా వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఐటీఐ / ఏటీసీలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వృత్తి నైపుణ్యం అందించే ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి తెచ్చేలా విధివిధానాలను రూపొందించాలని చెప్పారు.