స్కిల్ యూనివర్సిటీ దేశానికి ఆదర్శం కావాలి సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.


యూనివర్సిటీ బోర్డుతో పాటు రాష్ట్రంలోని వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, కంపెనీల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సచివాలయంలో గురువారం సమావేశమయ్యారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క , పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు యూనివర్సిటీ బోర్డు చైర్మన్, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో-చైర్మన్ శ్రీని రాజు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..


యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం ₹100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్కిల్ యూనివర్సిటీకి రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు, ప్రముఖ కంపెనీలు భాగస్వామ్యం కావాలని కోరారు.


👉రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలు స్కిల్ యూనివర్సిటీ లో భాగస్వామ్యం పంచుకోవాలని, యూనివర్సిటీ పూర్తి స్థాయి నిర్వహణకు కార్పస్ ఫండ్ ఏర్పాటుకు ముందుకు రావాలని కోరారు. యూనివర్సిటీలో భవనాల నిర్మాణానికి ముందుకు వచ్చిన కంపెనీలు లేదా దాతల పేర్లను ఆ భవనాలకు పెట్టాలని అధికారులకు సూచించారు.


👉స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఆలోచన, ఆశయాలతో పాటు పలు కీలక అంశాలను మంత్రి శ్రీధర్ బాబు సమావేశంలో వివరించారు. యూనివర్సిటీలో కోర్సులు ఈ ఏడాది నుంచే ప్రారంభించాలని యూనివర్సిటీ బోర్డు నిర్ణయించింది. దసరా పండుగ తర్వాత అక్టోబర్ నెలలో కోర్సులను ప్రారంభించనున్నట్లు సూచన ప్రాయంగా వెల్లడించింది.


👉తెలంగాణ నుంచి నైపుణ్యం కలిగిన యువతను ప్రపంచానికి అందించాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన గొప్పదని యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డు ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా ప్రశంసించారు.


👉మంచి విజన్ ఉన్న సమర్థ నాయకుడు రేవంత్ రెడ్డి ఆని కొనియాడారు. అందుకే యూనివర్సిటీ బోర్డు చైర్మన్ గా ఉండాలని కోరగానే అంగీకరించానని ఆనంద్ మహీంద్రా చెప్పారు.


👉సాధారణంగా ప్రభుత్వాలు సబ్సిడీలు, ఆకర్షణీయ పథకాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తాయని, కానీ యువతను నిపుణులుగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆలోచించిన తీరులోనే దార్శనికత ఉందన్నారు.

👉అతిపెద్ద యూఎస్ కాన్సులేట్ తెలంగాణలోనే ఉందని, ఎక్కువ మంది ఇక్కడి నుంచే అమెరికాకు వెళుతున్నారని గుర్తుచేశారు.


👉ఇకనుంచి ప్రపంచానికి నైపుణ్యమున్న యువతను అందించే గమ్యస్థానంగా తెలంగాణ నిలబడుతుందని అనడంలో సందేహం లేదన్నారు. ముఖ్యమంత్రి ఆశయం నెరవేరాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు.