J.SURENDER KUMAR,
వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధుల నియంత్రణ, చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రంగారెడ్డి జిల్లా ఇన్ ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. వైద్యులు, సహాయక సిబ్బంది సెలవులు తీసుకోకుండా హెల్త్ సెంటర్లు, హాస్పిటళ్లలో రోజంతా అందుబాటులో ఉండేలా చూడాలని ఆయన సూచించారు.
ఇటీవల కురుస్తున్న వర్షాలకు దోమలు విజృంబించి ప్రతి ఇంట్లో ఒకరు జ్వరం పాలయ్యారని శ్రీధర్ బాబు చెప్పారు. మంగళవారం బంజారాహిల్స్ మినిష్టర్స్ క్వార్టర్స్ లో ఆయన జిల్లా ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అంబులెన్సులు సిద్ధంగా ఉంచాలని, సంచార వైద్యశాలలు ప్రతి గ్రామానికి వెళ్లేలా చూడాలని శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు.
పిహెచ్ సిలు, సబ్ సెంటర్లు, జిల్లా ఆసుపత్రుల్లో మందుల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వ్యాధిగ్రస్తుల వివరాలు సేకరించి దగ్గర్లోని హాస్పిటల్స్ కు తరలించేలా వైద్యాధికారులతో సమన్వయం కొనసాగించాలని సూచించారు.
పసి పిల్లలు, గర్బిణిలు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని చెప్పారు. డెంగ్యూ, చికెన్ గున్యాలకు కారణమయ్యే దోమల నియంత్రణకు యాంటీ లార్వల్ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని అన్నారు. ఫాగింగ్ చేయించాలని ఆదేశించారు. సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక్, డిప్యూటీ కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి, శేరిలింగంపల్లి, ఎల్ బి నగర్ డిప్యూటి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.