దసరా కు ధర్మపురి వీధుల్లో పోటెత్తిన భక్తజనం !

👉జంబి గద్దె వద్ద గాలిలోకి మూడు రౌండ్ల కాల్పులు !


J.SURENDER KUMAR,


విజయదశమి పర్వదిన సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి పురవీధులలో శనివారం భక్తజనం పోటెత్తారు. నంది చౌక్, గాంధీ చౌక్, బస్టాండ్ ప్రాంగణం, హనుమాన్ చౌక్, అంబేద్కర్ చౌక్ భక్త జనంతో పోటెత్తింది. దీంతోపాటు శ్రీ దుర్గా దేవి అమ్మవారి నిమజ్జనం ఇదే రోజు కావడంతో భవాని దీక్ష భక్తుల ఊరేగింపు తో ధర్మపురి క్షేత్రం కిక్కిరిసిపోయింది.

శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి ఉత్సవమూర్తుల పల్లకి సేవ కిలోమీటర్ దూరంలో గల జమ్మి చెట్టు గద్దె వేదిక వరకు మంగళ వాయిద్యాలు వేదమంత్రాలతో భారీగా భక్తజనం వెంట రాగా తరలి వెళ్లారు.


జమ్మి చెట్టు వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సనాతన ఆచార సాంప్రదాయం ప్రకారం పోలీస్ అధికారులు అధికారికంగా విజయ సూచికగా 303 తుపాకితో గాలిలోకి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు.

భక్తజనం స్వామివారి సేవ పల్లకి వెంట పరుగులు తీశారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ , మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, ఆలయ కార్య నిర్వహణ అధికారికి సంకటాల శ్రీనివాస్ తదితరులు ఉత్సవంలో పాల్గొన్నారు.