👉 రెండు విడతలలో 1.32 లక్షల క్వింటాల వడ్లు కొనుగోలు
👉 తరుగు పేరిట అదనంగా తూకం వేసిన 13 వేల క్వింటాళ్ల దోపిడీ !
👉 రైతాంగం నష్టపోయింది ₹ 2.72 కోట్ల రూపాయలు !
👉 అదనపు తూకం పై ప్రశ్నించిన రైతుపై కేసులు !
J.SURENDER KUMAR,
రైతులు తమ రక్తం ను చెమట గా మార్చి రాత్రి, పగలు, ఎండ, వానలో కష్టపడి పండించిన వడ్లు కొనుగోలు చేసిన ధర్మపురి సింగిల్ విండో యంత్రాంగం రైతులను దగా చేసిందనే ఆరోపణలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాలు, తప్ప, తరుగు పేరిట క్వింటాల్ కు అదనంగా దాదాపు 10 కిలోల చొప్పున కొనుగోలు కేంద్ర నిర్వాహకులు రైతుల వద్ద 13 వేల,225 వందల 68 కిలోలతూకం వేసుకున్నారు.
క్వింటాలకు @2060/ ధర చొప్పున ₹ 2,72,44,752/- ( రెండు కోట్ల డబై రెండు లక్షల, నలుబది నాలుగు వేల ఏడు వందల యాబై రెండు రూపాయలు) రైతాంగం నష్టపోయారు.
తరుగు పేరిట, అదనపు తూకం పై ప్రశ్నించిన రైతును వేధింపులకు గురి చేయడంతో పాటు పోలీస్ కేసులు నమోదు చేసి మిగతా రైతులను భయభ్రాంతులకు గురి చేశారు.
రైతులను భయభ్రాంతులకు గురిచేసింది ఎవరో ? తెలిసిన నాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో భయం భయంగా వారు జీవనం కొనసాగించారు. తరుగు పేరిట అదనపు తూకం వడ్ల రూపాయలు ఎవరు స్వాహా చేశారో ? ఏ పర్సంటేజ్ లో పంచుకున్నారో ? కొందరు రైస్ మిల్ యజమానులకు, సింగిల్ విండో యంత్రాంగానికి మాత్రమే తెలుసు అని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దీనికి తోడు ధర్మపురి సింగిల్ విండోలో నిధులు ₹ 1,24,30,688 ( కోటి ఇరువది నాలుగు లక్షల ముప్పది వేల ఆరువందల ఏనుబై యెనిమిది ) గోల్మాల్ అంశంపై ప్రభుత్వ విచారణలో లేఖ సంఖ్య 2251/2024-C. తేదీ 25-9-2024 ద్వారా నిర్ధారించారు. విధులు నిర్వహించే కీలక ఉద్యోగిని కూడా ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
👉వివరాలు ఇలా ఉన్నాయి..
2022 -2023 సంవత్సరములు రెండు విడుతల 1,32,256-80 ( లక్ష ముప్పది రెండు వేల రెండు వందల యేబై ఆరు క్వింటాల్ 80 కిలోలు వడ్లు) ధర్మపురి సింగిల్ విండో కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి రైతుల ఖాతాలోకి ₹ 27,24,47,524/-. ( 27 కోట్ల 24 లక్షల 47 వేల 524) జమ చేశారు.
బుగ్గారం, చిన్నాపూర్, సిరివంచ కోట, సిరికొండ, కమలాపూర్, నేరెళ్ల, మద్దునూర్ కొనుగోలు కేంద్రాలలో 94632-80 (తొంబై నాలుగు వేల ఆరువందల ముప్పది రెండు క్వింటాళ్ల 80 కిలోలు ) కొనుగోలు చేశారు. రెండో విడత బుగ్గారం, చిన్నాపూర్, మద్దునూర్, సిరికొండ, కమలాపూర్, నేరెళ్ల కొనుగోలు కేంద్రాలలో 37624 (ముప్పది యేడు వేల ఆరువందల ఇరువది నాలుగ) క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.
👉వడ్లు అదనపు తూకం కు నిదర్శనం ప్రశ్నించిన రైతు పై కేసులు !
ధర్మపురి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన సట్టంశెట్టి రాజన్న అనే రైతు తన వరి ధాన్యాన్ని అమ్మకం కోసం ధర్మపురి సింగిల్ విండో ద్వారా కమలాపూర్ లోని PPC ID 3533 కొనుగోలు కేంద్రానికి తెచ్చాడు. తరుగు పేరిట ధాన్యం కొనుగోలు నిర్వాహకులు బస్తా ఒక్కంటికి 4 నుంచి 5 కిలోలు అధిక తూకం వేయడాన్ని రైతు రాజన్న వారిని ప్రశ్నించాడు.

దీంతో మమ్మల్ని ప్రశ్నించే వాడివా ? అంటూ కొనుగోలు నిర్వాహకులు రాజన్న వరి ధాన్యాన్ని దాదాపు 40 రోజులుగా కొనుగోలు చేయక ఇబ్బందులకు గురి చేశారు. విసిగి వేసారి రైతు కొనుగోలు కేంద్రంలోని తన వరి ధాన్యాన్ని ట్రాక్టర్ లో తెచ్చి అప్పటి మంత్రి కొప్పుల ఈశ్వర్ ( ధర్మపురిలోని ) క్యాంపు కార్యాలయ గేటు ముందు 2023 జూన్ 3న పోసి నిరసన తెలిపాడు.
ధర్మపురి పోలీస్ రంగ ప్రవేశం చేసి మంత్రి క్యాంపు గేటు ముందు వరి ధాన్యాన్ని దాదాపు 15 క్వింటాళ్ల పోలీస్ స్టేషన్ కు తరలించి రైతు రాజన్నను అదుపులోకి తీసుకున్నారు.
👉శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు !

రైతు రాజన్న ఆయన కొడుకు శివకుమార్ (24) కు పోలీసులు జారీ చేసిన 41 నోటీసులలో Cr.No.155 / 2023, U / Sec.500, 505 (ii), 506 IPC కింద కేసు రిజిస్టర్ అయినట్టు నోటీసులో పేర్కొన్నారు ఇద్దరి నోటీసులలో ( శ్రీకాంత్ రెడ్డి ఫిర్యాదు అని పోలీస్ పేర్కొన్నారు)
👉 ఏఆర్ కానిస్టేబుల్ నవీన్ ఫిర్యాదుతో రైతుపై మరో కేసు నమోదు !
ధర్మపురి పోలీసులు 2023 సెప్టెంబర్ 9న రైతు రాజన్నకు 41 నోటీసు జారీ చేస్తూ. Cr.No.152 / 2023,U / Sec.341 IPC కింద కేసు రిజిస్టర్ అయినట్టు నోటీసులో పేర్కొన్నరు. ( రాచమల్ల నవీన్ ఏఆర్ కానిస్టేబుల్ No .1227.ఫిర్యాదు అని పేర్కొన్నారు)
👉రైతు ఫిర్యాదు..
రైతు రాజన్న తనకు న్యాయం చేయాల్సిందిగా జగిత్యాల జిల్లా ఎస్పీకి, మానవ హక్కుల సంఘానికి 2023 జూలై 12, 13 తేదీలలో ఫిర్యాదు చేశాడు.
👉 రాయికల్ సింగిల్ విండో లాభాలలో రైతులకు వాటా !
జగిత్యాల జిల్లాలోని రాయికల్ సింగిల్ విండో వార్షిక లాభాలలో 10% రైతుల మూలధనం ( షేర్ క్యాపిటల్ ) ఆధారంగా గత కొన్ని సంవత్సరాలుగా రైతుల ఖాతాలలో జమ చేస్తున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం దాదాపు ₹ 1-53 కోట్ల లాభాలు వచ్చాయని, సర్వసభ్య సమావేశంలో అధికారులు స్పష్టం చేశారు. రేపో, మాపో రైతుల ఖాతాల లో 10 శాతం జమ కానున్నాయి.
👉చొప్పదండి సింగిల్ కు జాతీయ అవార్డు !
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అందిస్తున్న సేవలకు జాతీయస్థాయిలో ఉత్తమ సింగల్ విండో గా అవార్డు కైవసం చేసుకుంది.
ఇఫ్కో ద్వారా అందుతున్న రుణాలు, డ్రోన్ సేవలు, ఎకరాకు అదనంగా ₹ 20 వేల రుణ సదుపాయం , సభ్యులు చనిపోతే ₹ 15 వేల దహన సంస్కా రాల సాయం రైతు సంక్షేమ చర్యల పట్ల అవార్డు వచ్చింది. సింగిల్ విండో యంత్రాంగం పనితీరు అధ్యయనానికి ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పచ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందిన డీసీసీబీ అధికారుల బృందం మంగళవారం జిల్లాకు వచ్చారు.
చొప్పదండి, రాయికల్ సింగిల్ విండోలు రైతుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తీరు, చొప్పదండికి జాతీయ స్థాయిలో అవార్డు రావడం, గత కొన్ని సంవత్సరాలుగా రాయికల్ సింగిల్ విండో లాభాలలో కొనసాగుతుండగా, ధర్మపురి సింగిల్ విండోలో కోట్లాది రూపాయల నిధులు గోల్మాల్, అదనపు వడ్ల తూకంతో రైతాంగం ను పట్టపగలు నిలువు దోపిడీ చేస్తున్న పట్టించుకునే వారే లేరు అనే ఆరోపణలు, విమర్శలు అధికార యంత్రాంగంపై వినిపిస్తున్నాయి.
👉 న్యాయం చేయాలి !
కొనుగోలు కేంద్ర నిర్వాహకులు, రైస్ మిల్లర్లు, సింగిల్ విండో యంత్రాంగం, కుముక్కై తమ వడ్లను అదనపు తూకం పేరిట దోపిడి చేసిన విచారణ జరిపి న్యాయం చేయాలని రైతాంగం కోరుతున్నారు. దాదాపు 13 వేల క్వింటాల వడ్ల సొమ్మును రైస్ మిల్లర్లు 4 శాతం, సింగిల్ విండో యంత్రాంగానికి, 2 శాతం సొమ్ము తమ వాటాగా రైస్ మిల్లర్లకు, సంబంధిత అధికారులకు, కీలక ప్రజాప్రతినిధులకు 4 శాతం పంపిణీ చేయడంతో నాటి బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏసీబీ అధికారులతో విచారణ చేపట్టి న్యాయం చేయాలని వారు ముక్త కంఠంతో కోరుతున్నారు.