👉గల్ఫ్ మృతుడిగా పరిగణించి ₹ 5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని వినతి !
J.SURENDER KUMAR,
దుబాయిలో క్యాన్సర్ వ్యాధి బారినపడి ఇండియాలో చిత్స పొందుతూ మృతి చెందిన ఎరవేణి విజయ్ ను ‘గల్ఫ్ మృతుడు’ గా పరిగణించి ₹.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని అతని సోదరుడు అజయ్ శుక్రవారం హైదరాబాద్ ప్రజాభవన్ లో ‘ప్రవాసీ ప్రజావాణి’ లో వినతిపత్రం సమర్పించాడు. ఆయన వెంట టీపీసీసీ ఎన్నారై సెల్ చైర్మన్ అంబాసిడర్ డా. బిఎం వినోద్ కుమార్, కాంగ్రేస్ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి ఉన్నారు.
పెద్దపల్లి జిల్లా పెద్ద కల్వల గ్రామస్తుడు, గీత కార్మిక కుటుంబానికి చెందిన 27 ఏళ్ళ విజయ్ బతుకు దెరువు కోసం మార్చిలో దుబాయికి వెళ్లి మే నెలలో క్యాన్సర్ బారిన పడ్డాడు. మెరుగైన చికిత్స కోసం 24 జూలైన ఇండియాకు తిరిగి వచ్చాడు. క్యాన్సర్ వ్యాధికి చికిత్స పొందుతూ 17 ఆగస్ట్ న మృతి చెందాడు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణా రావు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ క్రిష్ణ చొరవ తీసుకొని తమ కుటుంబాన్ని ఆదుకోవాలని మృతుని సోదరుడు అజయ్ విజ్ఞప్తి చేశారు. దుబాయికి వెళ్ళడానికి చేసిన అప్పు, క్యాన్సర్ చికిత్సకు చేసిన అప్పు తీర్చలేని పరిస్థితి ఉన్నదని ఆయన వాపోయారు. మృతుడికి తల్లి, తండ్రి, సోదరుడు, సోదరి ఉన్నారు.