ప్రభుత్వ ఉద్యోగులకు డి ఏ చెల్లించడానికి మంత్రివర్గం ఆమోదం !

J.SURENDER KUMAR,

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డీఏ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శనివారం సుధీర్ఘంగా జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు నిర్ణయాలు తీసుకుంది.


మంత్రివర్గ నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వివరించారు.

👉రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దీపావళి పండుగ సందర్భంగా ఒక డీఏను విడుదల చేయాలని మంత్రివర్గం తీర్మానించింది.


👉హైదరాబాద్‌లో మెట్రో రైలు రెండో దశ విస్తరణకు సంబంధించిన డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదించింది.


👉నాగోల్ – శంషాబాద్, రాయదుర్గం – కోకాపేట్, ఎంజీబీఎస్ – చాంద్రాయణగుట్ట, మియాపూర్ – పటాన్ చెరు, ఎల్ బీ నగర్ – హయత్ నగర్ మొత్తం 76.4 కిలోమీటర్ల మేరకు విస్తరణ చేపట్టాలని మంత్రిమండలి నిర్ణయించింది.


👉కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్య విధానంలో చేపట్టే మెట్రో రైలు రెండో దశ ప్రాజెక్టు కోసం రూ. 24,269 కోట్లతో ప్రతిపాదనలతో సిద్ధం చేసిన డీపీఆర్‌ను కేంద్రానికి నివేదించాలి.


👉జీవో 317 కు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం సిఫారసుల మేరకు ఉద్యోగుల మెడికల్, స్పౌజ్, మ్యూచువల్ బదిలీలకు ఆమోదం.


👉జీవో 46 కు సంబంధించి కీలకమైన స్థానికత అంశం రాష్ట్రపతి పరిధిలో ఉన్నందున న్యాయ సలహా తీసుకుని శాసనసభలో చర్చించిన తర్వాత నిర్ణయం.


👉రాష్ట్రంలో నవంబర్ 30 వరకు కుల, ఆర్థిక, సామాజిక గణన సర్వే పూర్తి చేయాలి. ఇందుకోసం 80 వేల మంది ఎన్యుమరేటర్లను నియమించి నవంబర్ 4 నుంచి 19 వరకు రాష్ట్రమంతా ఇంటింటి సర్వే చేపడుతారు.


👉రాష్ట్రంలో పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ పరిధిలో చేపట్టాల్సిన రోడ్ల నిర్మాణానికి దాదాపు రూ. 25 నుంచి 28 వేల కోట్లు అవసరమని అంచనా వేయగా పీపీపీ విధానంలో పూర్తి చేయడానికి తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలి.


👉ఉస్మానియా ఆస్పత్రి కొత్త భవన నిర్మాణానికి గోషా మహల్ లో పోలీసు శాఖ పరిధిలోని స్థలాన్ని వైద్య శాఖకు బదిలీ.


👉ములుగులో ప్రతిపాదిత గిరిజన విశ్వవిద్యాలయానికి 211 ఎకరాల స్థలం కేటాయింపు.


👉గచ్చీబౌలీ స్టేడియాన్ని ప్రతిపాదిత యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీకి బదలాయింపు.


👉మధిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఏటీసీల ఏర్పాటు, కావలసిన పోస్టుల మంజూరు.


👉దీపావళి కానుకగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇళ్ల మంజూరు.


👉రాష్ట్రంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో స్టోరేజీ కెపాసిటీ తగ్గిపోతున్న కారణంగా వాటిల్లో స్టిల్ట్ తొలగించాలని నిర్ణయం. పైలట్ ప్రాజెక్టుగా మొదట కడెం ప్రాజెక్టులో స్టిల్ట్ తొలగింపు.


👉గత ప్రభుత్వ హయాంలో రైస్ మిల్లర్ల వద్ద పేరుకుపోయిన దాదాపు రూ. 20 వేల కోట్ల విలువైన ధాన్యం క్లియరెన్స్ కు సంబంధించి సబ్ కమిటీ సమర్పించిన నివేదికకు ఆమోదం.


👉రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన కోర్టుల్లో ఉద్యోగాల భర్తీకి ఆమోదం. తీసుకున్న నిర్ణయాలను మంత్రులు వెల్లడించారు
.