తిరుపతి లడ్డు అంశం సుప్రీం లో మన దేవుళ్ల నైవేద్యాలు ప్రసాదాలు .?

👉సీఎం గారు స్పందించండి..


J.SURENDER KUMAR,


తిరుపతి లడ్డు ప్రసాదల తయారీలో కల్తీ నెయ్యి వివాదం సుప్రీంకోర్టు జోక్యంతో విచారణ  కొనసాగుతున్న విషయం తెలిసిందే.  మన రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలలో దేవుళ్లకు, నైవేద్యలు, భక్తులకు ప్రసాదాల నాసిరకం సరుకులు వాడకం అంశంపై ప్రభుత్వం ముందస్తుగా తనఖిలు, నిఘా చర్యలు ఎక్కడ ? అనే చర్చ జరుగుతున్నది.


👉రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు స్పందించాలి అంటే… 


ప్రచార మాధ్యమాల్లో తిరుపతి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారు అనే అంశం ప్రచార మాధ్యమాల్లో రావడంతోనే  తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్ర ప్రభుత్వాలు వారి ఆలయాల్లో నైవేద్యాలకు, భక్తులకు పంపిణీ చేస్తున్న ప్రసాదాల తయారీ సరుకుల నాణ్యత ప్రమాణాల తనిఖీలకు శ్రీకారం చుట్టారు. ఇది ఆయా ప్రభుత్వాల అప్రమత్తతకు అక్కడి దేవుళ్ళు, భక్తులపై ఆ ప్రభుత్వాలకు ఉన్న చిత్తశుద్ధి కి నిదర్శనం. మరి తెలంగాణలో అలాంటి తనిఖీలు ఇప్పుడే కాదు, గతంలో ఎప్పుడూ లేవు ?  కనీసం సరుకుల నాణ్యతా ప్రమాణాలను గుర్తించే యంత్రాంగం, యంత్ర సామాగ్రి, ప్రయోగశాలలు ఆలయాల్లో కాదు, ఆ శాఖ కార్యాలయంలోనూ లేవు, లేవు అనేది జగమెరిగిన సత్యం. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి లడ్డు తయారీ అంశం వివాదం జాతీయ అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల్లో మారుమోగిన విషయం తెలిసిందే. అయినా ఇక్కడి ప్రభుత్వం యంత్రాంగం కానీ సంబంధిత దేవాదాయ శాఖ స్పందించిన ఆనవాళ్లు అగుపించడం లేదు.
దేవుళ్లకు నైవేద్యాలు, భక్తులకు ప్రసాదాల నా న్యత ప్రమాణాల పట్ల  ప్రభుత్వ చిత్తశుద్ధి, చేపడుతున్న చర్యలు ఏమిటి ? అనేది భక్తుల ప్రశ్నలు మాత్రమే.
భక్తుల ప్రశ్నలకు సమాధానం చెప్పే యంత్రాంగం ఆలయాల్లో అందుబాటులో ఉండదు. ఒకవేళ ఉన్న వారి మౌనమే భక్తులకు సమాధానం. 

ఇంతటి ఉపోద్ఘాతం ఎందుకంటే …

👉గత పది సంవత్సరాలుగా….


పది సంవత్సరాలుగా మన ఆలయాల్లో ( సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లో ) దేవుళ్లకు నైవేద్యాలు, ఉచిత అన్నదానం, ప్రసాదాల నాణ్యత ప్రమాణాలపై  ఏదో మొక్కుబడి ఒకటి రెండు ఆలయాల్లో తనిఖీలు మినహా బాధ్యులపై సరుకుల సప్లై దారులపై చర్యలు మాత్రం శూన్యం అని చెప్పవచ్చు.

👉సరుకుల కొనుగోలుకు కోట్లాది రూపాయలు…

రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలలో ప్రతి సంవత్సరం ఆయా దేవుళ్ళ నైవేద్యాలు , భక్తులకు ప్రసాదాలు, ఉచిత అన్నదానం కోసం, ప్రసాదాలకు విక్రయాల కోసం, సరుకుల కొనుగోలుకు  కోట్లాది రూపాయలు వ్యాపారులకు చెల్లిస్తూ,  నెయ్యి, పల్లి నూనె, పాత సన్న బియ్యం, పంచదార, కాజు, కిస్మిస్, కుంకుమపువ్వు, ఖర్జూరం బెల్లం చింతపండు, ( పోపు సామాగ్రితో సహా) వందలాది కోట్ల రూపాయలు చెల్లించి కొనుగోలు చేస్తారు. దీనికితోడు ఆయా దేవుళ్ళకు నిత్య పూజాది కార్యక్రమాలకు పసుపు, కుంకుమ గంధం, హారతి కర్పూరం, పూలమాలలు, ఆలయాల నిర్వహణ కోసం చీపురు కట్టలు, శానిటేషన్ సరుకులు, విద్యుత్ సామాగ్రి, తదితర కొనుగోలు చేస్తుంటారు. ఈ కొనుగోళ్ళ దేవాదాయ శాఖ జారీచేసిన సర్కులర్ లోని నిబంధనలు  ప్రకారం ఆన్లైన్ టెండర్ ద్వారా
ప్రకటనలో బ్రాండెడ్ కంపెనీల సరుకులు మాత్రమే సప్లై చేయాలని, ఆయా సరుకుల బ్రాండ్ లు టెండర్ లో పేర్కొంటూ ప్రకటిస్తారు. టెండర్ కైవసం చేసుకున్నవారు అవే సరుకులను సప్లై చేయాల్సి ఉంటుంది.
టెండర్ దక్కించు వారితో ఆలయ అధికారులు  సంవత్సర కాలానికి సరుకుల కొనుగోలు కు ఒప్పందం చేసుకుంటారు. ఈ మేరకు దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారమే కొనుగోళ్ల వ్యవహారంలా భక్తులకు, ప్రభుత్వ యంత్రాంగానికి అగుపిస్తుంది మినహా ఆచరణలో ఉండదు.
ప్రముఖ ఆలయాలలో సైతం సరుకుల నాణ్యత ప్రమాణాలను గుర్తించే ప్రయోగశాలలో లేవు, యంత్రాంగం లేదు, అనేది దేవాదాయ శాఖకు కూడా తెలుసు.  దీంతో  దేవుళ్ల నాసిరకం సరుకులతో నైవేద్యాలు ఆరగించాల్సిన దుస్థితి, భక్తులకు నాణ్యత ప్రమాణాలు లేని ఉచిత అన్న , ప్రసాదాలు,  లడ్డు, పులిహోర ఆరగించే దుస్థితి నిత్యకృత్యం.

👉నాసిరకం సరుకుల సరఫరా ఇలా …..

ఆయా ఆలయాల అధికారులు నెల రోజులకు సరిపడే సరుకుల వివరాలు పేర్కొంటూ టెండర్ పొందిన సరఫరాదారుడికి మెయిల్, లేదా వాట్సప్ లో సరుకుల వివరాలు క్వాంటిటీ, లిస్టు పంపిస్తారు . హైదరాబాదు నుండి ఆలయ గోదాములలోకి చేరిన సరుకుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించే వారు ఏ ఆలయంలో లేరు, ఉండరు.
కేవలం దిట్టం ( సరుకుల నిలువ గోదాం నిర్వహణ బాధ్యతలను)  నిర్వహించే ఉద్యోగి,. కార్యనిర్వహణాధికారికి, సప్లై చేసేవారికి. మాత్రమే సరుకుల క్వాలిటీ, క్వాంటిటీ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

👉ఇక్కడే నాసిరకం సరుకుల పంపిణీ కి అవకాశం....

ఉదాహరణకు, టెండర్ లో, గోల్డ్ డ్రాప్ ఆయిల్ సప్లై ఉంటుంది. దాని స్థానంలో, పామాయిల్ లేదా మామూలు నూనె, ఖజు J.H బ్రాండ్ , రెండు పీసులు కలిపి ఉన్న కాజుకు బదులు, కాజు పలుకులు,. యాలకులు, ఆకుపచ్చ నెంబర్ వన్ కు బదులు సెకండ్ క్వాలిటీ, పసుపు, స్వస్తిక్ బ్రాండ్ కు బదులు సెకండ్ క్వాలిటీ. తదితర నాసిరకం) సరుకులు సప్లై దారుడు చేస్తారు. స్వామివారికి నైవేద్యం, భక్తులకు ప్రసాదాల, ఉచిత అన్నదానం కోసం. ఈ సరుకులనే ఉద్యోగులు కానీ వంట వారు కానీ విధిలేక వినియోగిస్తారు, వారు నాణ్యత ప్రమాణాలపై ఆలయ అధికారులను ప్రశ్నించే సాహసం చేయరు. సప్లై దారుడికి టెండర్ లో ఒప్పందం జరిగిన  బ్రాండెడ్ సరుకుల  ధరలు చెల్లిస్తూ, కొనుగోలు చేస్తున్నట్టు ఆలయ రికార్డులలో నమోదు చేస్తారు. కొందరు ఆలయ  అధికారులు, సప్లైదారు నుంచి నెల నెల లక్షలాది రూపాయలు కమిషన్ తీసుకుంటారు అనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉండగా ”ధిట్టం” ( సరుకుల నిలువ గోదాం) పర్యవేక్షించే ఆలయ ఉద్యోగి ప్రతి నెల ఆలయ అధికారికి, తప్పనిసరిగా ( కనిష్టంగా లక్ష రూపాయలు వరకు)  ఇంత మొత్తం చెల్లించాల్సిందే, అధికారికి  అంత మొత్తం చెల్లించిన వారికే అక్కడ డ్యూటీలు కేటాయిస్తారు అనే విషయం ఆలయ ఉద్యోగులకు తెలిసిన పచ్చి నిజం.  సరుకులు కొనుగోలు, వినియోగం వివరాలు ప్రతిరోజు రిజిస్టర్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.15 రోజులకు ఓసారి ఆలయ అధికారి రిజిస్టర్ తనిఖీ చేసి  సంతకాలు పెట్టాల్సి ఉంటుంది.


👉ప్రసాదాల తయారీ ఇలా ఉండాలి…..


దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు లడ్డు, పులిహోర ప్రసాదాల తయారీలో నాణ్యత ప్రమాణాల గల సరుకుల వినియోగించాల్సిన వివరాలు ఇలా ఉండాలి !


👉 లడ్డు తయారీలో..


10 కిలోల శనగ పిండితో లడ్డు తయారీలో వాడాల్సిన సరుకులు …
10 కిలోల శనగపిండి, 20 కిలోల పంచదార, 1/2 కిలో మిస్రీ
1/2 కిలో కిస్మిస్, ముప్పావు కిలో ఖాజు, ఆరున్నర కిలోల నెయ్యి, 75 గ్రాముల యాలకులు, 15 గ్రాములు జాజికాయ, 10 గ్రాముల పచ్చ కర్పూరం. వినియోగించాల్సి ఉంటుంది.


👉 పులిహోర లో…..


10, కిలోల పులిహోర తయారీకి..
10 కిలోల బిపిటి పాత బియ్యం, అర్ధ కిలో శనగపప్పు, అర్ధ కిలో మినప్పప్పు, అర్ధ కిలో పల్లీలు, 0.50 గ్రాముల పసుపు, కిలోన్నర నూనె, కిలోన్నర చింతపండు, 200 గ్రాముల ఎండుమిర్చి, కిలో ఉప్పు, 100 గ్రాముల జిలకర, 200 గ్రాముల ఆవాలు, 0.5 గ్రాముల మెంతులు, 10 గ్రాముల మిరియాలు, 0.04 గ్రాముల ఇంగువ, వినియోగించాల్సి ఉంటుంది.
ఫుడ్ ఇన్స్పెక్టర్ , లేదా కల్తీ నిరోధక శాఖ అధికారులు గాని తనిఖీ లు చేపట్టిన సందర్భంలోనే ఇందులో వినియోగించిన సరుకులు నాణ్యత ప్రమాణాల వివరాలు వెలుగు చూసే అవకాశం ఉంటుంది. అలాంటి తనిఖీలు జరిగిన సమయం సందర్భాలు లేవు, ఆలయ రికార్డులలో నమోదు చేసి ఉండి ఉంటారు కావచ్చు కానీ  భౌతికంగా తనిఖీలు చేపట్టారు అనే చెప్పాల్సి ఉంటుంది.


👉 తనిఖీ అధికారి పై రాజకీయ ఒత్తిడి.. .


గత సంవత్సరం అక్టోబర్ లో వరంగల్ దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో నైవేద్యాలకు, ప్రసాదాలకు వినియోగించే సరుకుల నిలువలను తన సిబ్బంది, అధికారుల వెంట పెట్టుకొని మెరుపు దాడులు చేసి తనిఖీ చేశారు.   తనిఖీలలో దాదాపు నాలుగు లక్షల రూపాయలకు పైగా విలువ గల సరుకులు అధికంగా ఉన్నట్టు గుర్తించారు. (నైవేద్యాలు అన్నప్రసాదాలు, విక్రయ ప్రసాదాల వినియోగంలో నాణ్యత ప్రమాణాలు తగ్గించడంతో  సరకులు మిగిలి ఉంటాయి, వాటిని ఆలయ అధికారి,  సరుకుల గోదాం నిర్వాహకుడు . స్వాహా చేస్తుంటారు ) ఈ మేరకు తనిఖీ చేసిన అధికారి  అధిక నిలువలు, పర్యవేక్షణ, పరిపాలన, తదితర అంశాలపై తనిఖీ చేపట్టిన అధికారి ఇక్కడి ఉద్యోగులపై చర్యలకు సిద్ధం అయ్యారు. ఈ దశలో నాటి బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో కొందరు మంత్రులు ఆ అధికారి పై రాజకీయ ఒత్తిడి తెచ్చినట్టు చర్చ. ముక్కు సూటిగా, నిజాయితీ గా విధులు నిర్వహించే ఆ అధికారి తన పై మంత్రుల రాజకీయ ఒత్తిడిని  పట్టించుకోకపోవడంతో, ఆ మంత్రులు దేవాదాయ శాఖ కమిషనర్ పై  ఒత్తిడి తెచ్చినట్టు చర్చ.


6A ఆలయ తనిఖి నిబంధనలలో చిన్న లోసుగు ఆధారంగా సంజాయిషి నోటీసులతో సరిపెట్టాల్సిందిగా తనిఖీ చేసిన డిప్యూటీ కమిషనర్ ను నాటి దేవాదాయ కమిషనర్ కోరినట్టు ఆ శాఖ ఉద్యోగులె చర్చించుకోవడం భక్తజనంకు తెలిసిన నిజం


👉 కాంగ్రెస్ ప్రభుత్వంలో….


రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలోనూ బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి క్షేత్రంలో, ఇటీవల వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దేవాదాయ శాఖ విజిలెన్స్ అధికారులే తనిఖీలు చేసిన బాధ్యులపై చర్యలు మాత్రం ఆగిపించడం, వినిపించడం లేదు.


👉రాష్ట్ర ఏర్పాటైన 46 రోజులకే సర్కులర్…


దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయం నుండి రాష్ట్ర ఏర్పడిన 46 రోజులకే సరుకుల కొనుగోలు విధి విధానాలపై  2014, జులై 18 న, సర్కులర్ నెంబర్ అర్, సి.No. E 2/10825/2014. జారీ చేశారు. అందులో
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం , విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ శాఖ నివేదిక No.11(C.No.1104/ V&E/D4/10). తేదీ 30-1-2013 నాటి నివేదిక ఆధారంగా, దేవాదాయ శాఖ లేఖ సంఖ్య  ఆర్.సి.No, A4/37487/2013, తేదీ 31-12-2 013న జారీ చేసిన నియమ నిబంధనలో మేరకు సరుకులు కొనుగోలు చేయాలని ఆలయాల కార్య నిర్వహణాధికారు లకు ఆదేశాలు జారీ చేశారు.


👉వ్యాపారులకు షాక్ ఇస్తున్న నిబంధనలు..


ప్రముఖ పట్టణాలలో, జిల్లా కేంద్రాల్లో, కిరాణం హోల్ సేల్ వ్యాపారస్తులకు టెండర్ లోని నిబంధనలు షాక్ ఇస్తున్నాయి. ఆ నిబంధనలు హైదరాబాదులోని రెండు, మూడు వ్యాపార సంస్థలకు ఉన్నట్టుగా, గత పది  సంవత్సరాలుగా వారే టెండర్ లో పాల్గొంటూ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలకు సరుకులు సప్లై చేస్తున్నారు అనేది జగమెరిగిన సత్యం.
ఆలయాల అవసరాల మేరకు సరుకుల కొనుగోలులో  దాదాపు 100 సరుకుల వివరాలు  పేర్కొంటారు.
టెండర్ సొంతం చేసుకున్న సప్లై దారుడు వ్యాపార సంస్థ పేరు, ఒప్పందం కుదిరిన సరుకుల ధరలు, సరుకుల నమూనా ( శాంపిల్స్ సమాచారం సంవత్సర కాలం పాటు టెండర్ ఒప్పందం మేరకు పేర్కొన్న  నాణ్యత ప్రమాణాలు. గల  సరుకుల సప్లై చేస్తానంటూ. టెండర్ పొందిన వ్యాపారి, ఆలయంలో తనిఖీల కోసం. ఇచ్చే నిలువ ప్యాకెట్లు) వివరాలు  ఆలయాల పాలకవర్గానికి గాని, అర్చకులకు, (పాలకవర్గం లేని చోటు) ఉద్యోగులకు వాటి సమాచార  తెలియకుండానే  ఆలయ అధికారుల సరుకుల కొనుగోలు తతంగం కొనసాగిస్తారు. గత పది సంవత్సరాలుగా రాష్ట్రంలోని ఆలయాలకు సరుకుల సప్లై చేసే టెండర్ ను ఓకే వ్యాపార సంస్థ నిర్వహిస్తుందని, ఆన్లైన్లో మరో మూడు బినామీ సంస్థలతో టెండర్ వేయించి తక్కువ ధరను కోట్  చేసి ఒకే సంస్థ సొంతం చేసుకుంటున్నదనే  ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వం రికార్డులు పరిశీలిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయి.


👉 దేవాదాయ శాఖలో రాజ్యమేలుతున్న మౌనం….


రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో దేవాదాయ శాఖలో భారీగా బదిలీలకు  శ్రీకారం అంటూ ప్రచారం మాధ్యమాల్లో విస్తృతస్థాయిలో ప్రచారం జరిగింది. ప్రముఖ ఆలయాలలో కొందరు అధికారులు, ఉద్యోగులు బదిలీలు మినహా 6A ఆలయ ఉద్యోగుల బదిలీలకు నేటికీ శ్రీకారం చుట్టూ లేదు. బదిలీల అంశంలో అధికారులలో మౌనమే రాజ్యం పేలుతున్నదని చెప్పవచ్చు.


👉 ఇదే ప్రభుత్వంలో…..


దాదాపు రెండు దశాబ్దాల కాలంకు పైగా పెండింగ్ లో ఉన్న దాదాపు 30 వేల మంది ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నెలరోజుల వ్యవధిలోనే ఎలాంటి వివాదాలకు తావు లేకుండా  చేపట్టిన ఘనత  సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానిదే.   ఉపాధ్యాయలు,  వారి  సంఘాల, నాయకులు ముక్తకంఠంతో సీఎం ను వేలాదిమంది ఉపాధ్యాయులు ఎల్బీ స్టేడియంలో అభినందించిన తీరు తెలిసిందే.


ప్రభుత్వ స్పందించి సరుకుల నాణ్యత ప్రమాణాలు పరిశీలించేందుకు ఓ ప్రత్యేక విభాగం నియమిస్తుందో ? లేదో ? మన దేవుళ్లకు, నాసిరకం నైవేద్యాలు, భక్తులకు ప్రసాదాల, నుంచి విముక్తి కల్పిస్తూ, ఆలయాల ఆదాయానికి  రక్షణ కల్పిస్తారో ?  లేదో ? వేచి చూడాల్సిందే