వరంగల్ లో అర్హులైన జర్నలిస్టుకు ఇండ్ల స్థలాలు!

👉దీపావళి నాటికి సానుకూల నిర్ణయం!


👉ప్రెస్ అకాడమీ చైర్మన్ సమక్షంలో ఎమ్మెల్యేలు, జర్నలిస్టు సంఘాలు, సొసైటీల సమావేశం!


J.SURENDER KUMAR,


జర్నలిస్టులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఇండ్ల స్థలాల సమస్య కొలిక్కి వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై సానుకూలంగా స్పందించడంతో బుధవారం హైదరాబాద్ లోని బీఆర్ కే భవన్ లోని మీడియా అకాడమీ కార్యాలయంలో చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో సమావేశం జరిగింది.


ఈ సమావేశంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ పరిధిలో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సీఎం, రెవెన్యూ శాఖమంత్రి సానుకూలమైన స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని అన్నారు.

గతంలో సొసైటీలకు కేటాయించిన స్థలాలతో పాటు మరికొంత స్థలాన్ని సేకరించి అర్హులైన జర్నలిస్టులకు అందరికీ నివేశన స్థలాలు ఇప్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. సొసైటీల బాధ్యులు, యూనియన్ ల నాయకులు కలిసి కట్టుగా అర్హులైన జర్నలిస్టుల జాబితాను రూపొందించి అందజేయాలని సూచించారు.

జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు చూపుతున్న చొరవ అభినందనీయమని అన్నారు. అన్నీ కలిసి వస్తే దీపావళి పండుగ నాటికి జర్నలిస్టుల ఇండ్ల స్థలాలపై సానుకూల నిర్ణయం వెలువడగలదని, వివిధ యూనియన్ ల నాయకులు, సొసైటీల బాధ్యులు, సిక్స్ మెన్ కమిటీ సమన్వయంతో పని చేసి ప్రభుత్వానికి సహకరించాలని సూచించారు.

అలాగే జర్నలిస్టుల ఇండ్ల స్థలాల కోసం అదనపు భూమి కోసం ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖమంత్రి దృష్టికి తీసుకెళ్లి భూమిని కేటాయించేందుకు కృషి చేస్తామని చెప్పడం అభినందనీయమని అన్నారు.


ఈ సమావేశంలో వివిధ యూనియన్ ల, హౌసింగ్ సొసైటీల, సిక్స్ మెన్ కమిటీ బాధ్యులు వల్లాల వెంకట రమణ, సీహెచ్ సుధాకర్, బీఆర్ లెనిన్, పిన్నా శివకుమార్, బొక్క దయాసాగర్, గడ్డం రాజిరెడ్డి, తోట సుధాకర్, మస్కపురి సుధాకర్, బొల్లారపు సదయ్య, కక్కెర్ల అనిల్ కుమార్, ఎం. రాజేంద్ర ప్రసాద్, సోమ నర్సయ్య, పి. వేణు మాదవ్, పివి. మదన్ మోహన్, దుర్గా ప్రసాద్, కొండం రవీందర్ రెడ్డి, ఎస్. భాస్కర్ రావు, ఎం. రవీందర్ రావు, వసంత్, వహీద్ గుల్షన్ తదితరులు పాల్గొన్నారు.