J.SURENDER KUMAR,
వైద్యో నారాయణ హరి అనే మాట అనాదిగా అనేక
సందర్భాల్లో సమాజం తమ నోట పలుకుతున్న మాట.
వైద్యుడిని శ్రీ నారాయణుడుగా ,
(భగవంతుడి స్వరూపంగా ) వైద్యుడిని,
వైద్య వృత్తిని గౌరవిస్తారు. ఇలాంటి పవిత్ర వృత్తిని,
ఆసరా చేసుకుని కొందరు పెట్టుబడిదారులు,
జగిత్యాల జిల్లా కేంద్రంతో పాటు
పట్టణ ప్రాంతాల్లో వ్యాపారంగా
మార్చారు, మారుస్తున్నారు.
పట్టణంలో వెలుస్తున్న కొన్ని ఆసుపత్రుల పేరు తో ఉన్న బోర్డుల పై ( ఉదాహరణకు గుండె, నరాల, కిడ్నీ పిల్లల లాంటి జబ్బులకు) ప్రత్యేక వైద్య నిపుణుడి సేవలు 24/7 అందుబాటులో ఉంటాయని ఆ బోర్డుల పై దర్శనమిస్తుంటాయి.
👉నెలల వ్యవధిలోనే….
కొన్ని నెలల వ్యవధి లోనే కొన్ని ఆసుపత్రులు, అదే ఆసుపత్రి భవనం, అదే బోర్డుపై, మరో వైద్యుడి పేరు, మరో వ్యాధులు నిర్ధారణలో నిపుణుడు, అనే వివరాలు రోగులకు దర్శనమిస్తుంటాయి. ( ఉదాహరణకు గతంలో ఆస్పత్రి బోర్డుపై ఉన్న వ్యాధులకు బదులు డయాబెటిస్, ఎముకలు, ఛాతి, ) తదితర వివరాలు దర్శనమిస్తుంటాయి.
👉కాంట్రాక్టు పద్ధతిలో…
ప్రైవేట్ విద్యాసంస్థలలో, నిరుద్యోగ యువతను ఉపాధ్యాయులుగా, నెలసరి వేతనం పై, కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకునే తరహాలో ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు చెందిన కొందరు వైద్యులను కొన్ని సందర్భాలలో ల్యాబ్ , డయాగ్నస్టిక్ సెంటర్ నిర్వాహకులను కూడా వైద్య వ్యాపారం చేసే పెట్టుబడిదారులు తమ తమ ఆసుపత్రిలో నియమించుకుంటారు. ల్యాబ్ , మందుల దుకాణాలు యజమానులవే. కొన్ని ఆసుపత్రులలో ఆదాయ రాబడిలో పర్సంటేజ్ పద్ధతి ఒప్పందం మేరకు వారితో ఆసుపత్రులలో వైద్యం చేయిస్తున్నారు అనే విమర్శలు ఉన్నాయి.
👉మానవ సంబంధాలు ఎక్కడ ?
కాంట్రాక్ట్ పద్ధతిలోనో, నెల నెలా జీతంతోనో, ఆస్పత్రికి ఆదాయ రాబడి లో పర్సెంటేజ్ పద్ధతిలోనో పనిచేసే వైద్యులకు రోగుల పట్ల మానవ సంబంధాలు ఏమేరకు ఉంటాయో ఊహించవచ్చు. వైద్యంను వ్యాపారంగా ఎంచుకొని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్వహిస్తున్న వారికి మానవ సంబంధాల కంటే, ఆర్థిక సంబంధాలే ప్రాధాన్యత కావడంతో రోగులు, వారి కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఫీజులు చెల్లించలేక అప్పుల ఊబిలో దిగబడుతున్నారు అనేది జగమెరిగిన సత్యం.
👉టీఎస్ సీఏ..లో రిజిస్టర్ చేశారా ?
తెలంగాణ స్టేట్ క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్లు & రెగ్యులేషన్) రూల్స్, 2011 గా ఆమోదించిన చట్టం ప్రకారం, అన్ని రకాల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు వీరి ఆస్పత్రులలో ఉన్నాయో ? లేదో ? సంబంధిత డిస్ట్రిక్ట్ రిజిస్టరింగ్ అథారిటీ రికార్డులు పరిశీలిస్తే ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు వైద్యుడి పేరు తోనా ? యాజమాన్యం పేరుతో నమోదు అయి ఉందా ? లేదా ? అనే అంశం వెలుగు చూసే అవకాశం ఉందనేది చర్చ.
👉ప్రచార తీరు ఇలా..
దీనికి తోడు కొందరు ఆస్పత్రుల నిర్వాహకులు, గ్రామాల్లో ప్రథమ చికిత్స సేవలు అందించే తమకు అనుకూలమైన వారితో ఢిల్లీ, ముంబాయి, మద్రాస్, హైదరాబాద్, తదితర మెట్రోపాలిటన్ పట్టణాల్లోని ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రులలో కన్సల్టెంట్ గా పనిచేసిన వైద్యుడు తమ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నట్టు, విస్తృత స్థాయి ప్రచారం చేయిస్తారు. గ్రామాల నుండి వారు తమ ఆసుపత్రికి తీసుకువచ్చే రోగుల సంఖ్య, వారు ఆసుపత్రులకు చెల్లించిన ఫీజుల పై పర్సంటేజ్ చెల్లిస్తూ తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తున్నారు అనే విమర్శలు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత శాఖ అధికారులు విచారణ జరిపితే వాస్తవాలు వెలుగు చూసే అవకాశం ఉందనే చర్చ జరుగుతున్నది.