జగిత్యాలలో కొందరు డాక్టర్లు ఫీజుల పేరిట రక్తం తాగుతున్నారు !


J.SURENDER KUMAR,


వైద్యులను ప్రత్యక్ష దేవుళ్ళుగా సమాజం గౌరవిస్తుంది,

అభినందిస్తుంది, ప్రాణ దాతలుగా వారిని ప్రాణప్రదంగా

ఆరాధిస్తుంది. ఇలాంటి పవిత్ర వైద్య వృత్తికి జగిత్యాల జిల్లా

కేంద్రంలో కొందరు ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు తమ వృత్తిని

అపవిత్రం చేస్తూ వృత్తికే కళంకం తెస్తూ, పవిత్ర వైద్య వృత్తిని

అపవిత్రం చేస్తున్నారు అనే ఆరోపణలు విమర్శలు

వినిపిస్తున్నాయి.


అనారోగ్యంతోనో, ప్రాణాపాయస్థితిలోనో అంతు పట్టని వ్యాధితోనో వారి ఆస్పత్రిలో చేరితే వ్యాధి నిర్ధారణ పేరిట రక్త ,మూత్ర, తదితర పరీక్షల అంటూ రోగి కుటుంబల రక్తంను ఫీజుల పేరిట తాగుతున్నారు అనే ఆరోపణలు విమర్శలు ఉన్నాయి. ఇది జగమెరిగిన సత్యం. అక్షర సత్యం, నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టు ఏదో మొక్కుబడి చర్యలు చేపడుతున్నారు అనే విమర్శలు ఉన్నాయి.

👉కొన్ని సంఘటనలు.….

అనారోగ్య బారిన పడ్డ ఒకరు జగిత్యాలలో వైద్యుడి వద్దకు వెళ్లగా రక్త పరీక్షలు , మూత్ర పరీక్షలు తదితర పరీక్షల తర్వాత రోగ నిర్ధారణ అంటూ తన ప్రిస్క్రిప్షన్ పై వాటి వివరాలు రాసి తమ అనుబంధం డయాగ్నస్ సెంటర్ కు పంపించారు. ఆ పరీక్షల ఫీజు మొత్తం ₹ 6,200/- ( తెల్ల కాగితంపై చేతి రాతతో బిల్లు వేశారు ) సాయంత్రం నాలుగు గంటలకు పరీక్షల కోసం రోగి క్యూలో నిలబడ్డాడు. అతనితోపాటు మరో ఆరుగురు సైతం క్యూలో ఉన్నారు.( గంట వ్యవధిలో పరీక్షలకు వచ్చిన ఆరుగురి వద్ద ₹37,200/- డయాగ్ని సెంటర్ నిర్వాహకులు వసూలు చేశారు)

డయాగ్నెట్ సెంటర్ రిపోర్టు పరిశీలించిన వైద్యుడు.₹ 5000/- విలువ గల తన ఆసుపత్రికి అనుబంధంగా ఉన్న మెడికల్ షాపులోనే కొనుగోలు చేయమన్నాడు.
ఇవే పరీక్షలు వారం రోజుల తరువాత ఇతర మరో డయాగ్నైజ్ సెంటర్ లో ఆ రోగి చేయించుకోగా ₹ 3,200/- చార్జి చేశారు. ఈ సంఘటన గత నెల 10 నుంచి 20 తేది లోపు జరిగింది.

👉మరో సంఘటన..

ఇది ఇలా ఉండగా రోడ్డు ప్రమాదంలో గాయపడిన దంపతులను ఎవరో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. క్షతగాత్రుల పరిస్థితి పరిశీలించి గాయాలు తీవ్రంగా ఉన్నాయి అంటూ, వైద్యం ప్యాకేజీ పేరిట ₹ 2 లక్షలు డిపాజిట్ చేయాలి, అప్పుడే వైద్యం అంటూ వైద్యుడు కరాకండిగా చెప్పాడు. దీంతో విదిలేక క్షతగాత్రుల బంధుమిత్రులు ఆ రాత్రి అంత మొత్తం డబ్బులు డిపాజిట్ చేశారు.

👉ఇదో సంఘటన…

గత 20 రోజుల క్రితం రాత్రి రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని రాత్రి ఆసుపత్రిలో చేర్చారు. డబ్బులు డిపాజిట్ చేస్తే వైద్యం అంటూ ఆ వైద్యుడు ప్రాథమిక చికిత్స చేశాడు. ఇద్దరు క్షతగాత్రులలో ఓ యువకుడి బంధువులు మరుసటి రోజు డబ్బులు డిపాజిట్ చేసి వైద్యం చేయించుకున్నారు. మరో యువకుడిది కడు పేదరికం, కుటుంబ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉంది. గాయపడిన యువకుడి మిత్రులు కొందరు విరాళాలు పోగుచేసి కొంత ఆ మొత్తం డబ్బులు యువకుడి కుటుంబ సభ్యులకు అందించారు. అయినా ఆ ఆస్పత్రి నిర్వాహకులు వైద్యం చేయడానికి ససేమిరా అన్నాడు.


👉ప్రభుత్వంలో కీలక బాధ్యత గల ప్రజా ప్రతినిధి ఆసుపత్రిలో ఉన్న యువకుడిని పరామర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. తన వంతు గా కొంత ఆర్థిక సాయం అందించాడు. యువకుడికి వైద్యం చేయమని నిర్వాహకులను కోరారు. ఆయన ముందు సరే అంటూ, కొన్ని రోజులపాటు యువకుడికి ఉపశమన వైద్యం చేస్తూ డిపాజిట్ సొమ్ము కోసం జాప్యం చేశారు. రోగి ఆర్తనాదాలు, కుటుంబ సభ్యుల రోదనలతో ఆ ప్రజా ప్రతినిధి పెద్ద మొత్తంలో డబ్బులను ఆ కుటుంబానికి అందించారు. డబ్బులు రాగానే ఆ యువకుడికి వైద్యం అందింది.


ఇది ఇలా ఉండగా గత కొన్ని నెలల క్రితం జగిత్యాల రూరల్‌ మండలం ఓ గ్రామానికి చెందిన వ్యక్తికి తీవ్ర జ్వరం వచ్చింది. జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తూ, ప్రైవేటు నర్సింగ్‌ హోం నిర్వహిస్తున్న ఓ వైద్యుడిని సంప్రదించాడు. ప్రైవేటు ఆసుపత్రిలోని ల్యాబ్‌లో ప్లేట్‌ లెట్స్‌, ఇతర పరీక్షలు చేయించారు. డెంగీ పరీక్ష చేయకుండానే ప్రిస్కిప్షన్‌లో డెంగీ పాజిటివ్‌గా తేలినట్లు నమోదు చేశారు. దీంతో అనుమానం వచ్చిన సదరు రోగి మరో ల్యాబ్‌లో పరీక్షలు చేయించుకోగా టైఫాయిడ్‌గా గుర్తించారు.

నిజానికి ఎలిసా టెస్ట్‌ మిషన్‌ ద్వారా మాత్రమే డెంగీ నిర్ధారణ చేయాల్సి ఉన్నప్పటికీ ఎక్కడా విధానం పాటించలేదు. డెంగీ అంటూ భయాందోళనకు గురిచేస్తూ వేలల్లో మందులు రాయడం, ఫీజులు గుంజడం వంటివి జరపడంతో సదరు రోగి లబోదిబోమంటున్నాడు.


గత కొన్ని నెలల క్రితం రాయికల్‌ మండలం ఓ గ్రామానికి చెందిన ఓ మహిళ ఇటీవల జగిత్యాల పట్టణంలోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో డెలివరీకి చేరింది. రక్తం తక్కువగా ఉందంటూ, బిడ్డ అడ్డం తిరిగిందంటూ, డెలివరీ కష్టంగా మారిందంటూ తదితర కారణాలతో మహిళను భయాందోళనకు గురిచేశారు.

ఎట్టకేలకు శస్త్ర చికిత్స చేయడంతో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా ల్యాబ్‌ పరీక్షలు, మందులు, మత్తు డాక్టర్‌ ఫీజు, ఇతరములు అంటూ ఆసుపత్రి నిర్వాహకులు సుమారు ₹ 35 వేల వరకు ఫీజులు గుంజారు. డిశ్చార్జ్‌ రోజున మరో ₹ 30 వేలు ఆసుపత్రి బిల్‌ చెల్లించాలంటూ చీటీ అందించారు. కేవలం డెలివరీకి అని చేరితే సుమారు ₹65 వేలకు పైగా వ్యయం కావడంతో సంబందిత నిరుపేద మహిళ కుటుంబ సభ్యులు అప్పులు తెచ్చి చెల్లించారు.


ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో సామాన్య ప్రజలను కొందరు అడ్డు అదుపు లేకుండా వేలాది రూపాయలు దోపిడీ చేస్తున్న సంఘటనలు వెలుగు చూడనివి అనేకం ఉన్నాయి .


జిల్లా కేంద్రంలో దాదాపు 50 కి పైగా 100 లోపు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 వరకు ప్రైవేటు ఆసుపత్రులు, మెడికల్‌ దుకాణాలు, పదుల సంఖ్యలో ల్యాబ్‌లున్నాయి. ఇందులో చాలా ఆసుపత్రులు నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలున్నాయి.

సంబంధిత జిల్లా శాఖ తనిఖీ అధికార యంత్రాంగం ఇలాంటి ఆసుపత్రుల నిలువు దోపిడి, నిర్వాకంపై చూసి చూడనట్టు ఏదో మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నారే తప్ప నిబంధన ఉల్లంగించిన ఆస్పత్రులపై పై కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవనే విమర్శలు యంత్రాంగంపై వినిపిస్తున్నాయి.