ఆమె మరణించినా జీవితకాలం బతికి ఉంటారు !

👉శరీర దాత వీరగోని లక్ష్మి సంస్మరణ సభలో వక్తలు !


J.SURENDER KUMAR,


బతుకు..అందరినీ బతకనివ్వు అనే సందేశాన్ని స్వర్గీయ వీరగోని లక్ష్మి సమాజానికి అందించిందని వక్తలు అభిప్రాయపడ్డారు.


మనిషి జీవితం, నడవడిక పుస్తకాలు నేర్చితే వచ్చేవి కావన్నారు. వీరగోని లక్ష్మి త్యాగం, సంఘర్షణ వెల కట్టలేనివని కొనియాడారు.


బుధవారం కరీంనగర్ భగత్ నగర్ లోని బృందావన్ గార్డెన్స్ లో జరిగిన శరీర దాత వీరగోని లక్ష్మి సంస్మరణ సభకు కవులు, రచయితలు,ఉద్యోగులు,ఉపాధ్యాయులు, రాజకీయ వేత్తలు, పట్టణ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
కొన్ని రోజుల క్రితం ఉపాధ్యాయ సంఘం నాయకులు, రిటైర్డ్ ఎంఈఓ వీరగోని పెంటయ్య సతీమణి లక్ష్మి అనారోగ్యంతో మరణించగా ఆమె ఆశయం మేరకు కుటుంబ సభ్యులు పార్థీవ దేహాన్ని చల్మెడ ఆనందరావు మెడికల్ కాలేజీకి సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అందజేశారు.


కుటుంబ సభ్యులు, సదాశయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం సంస్మరణ సభ నిర్వహించగా, ఇందులో పాల్గొన్న వ్యక్తలు మాట్లాడుతూ లక్ష్మి జీవించి ఉన్నప్పుడే కాదు, మరణించిన తరువాత కూడా సమాజానికి
సందేశం ఇస్తూ పోయిందన్నారు.

ఆమెను మానవీయ మహిళగా అభివర్ణించారు. మొద్దు బారిన హృదయాలున్న సమాజంలో
మనం జీవిస్తున్నామని, అలాంటి సమాజంలో స్వచ్ఛమైన గోదావరి ప్రవాహం వలె లక్ష్మి ముందుకు సాగిందన్నారు. ప్రపంచ స్పృహ,
లౌక్యం తెలిసిన వ్యక్తిగా ఆమెను కొనియాడారు. తాను చదువుకోకపోయినా.. సంఘర్షణలను తట్టుకొని నిలబడగలిగారని, మరణించేంతవరకు సాటివారిపై ప్రేమను కురిపిస్తూనే వచ్చారని చెప్పారు. అందుకే ఆమె చనిపోయినా, జీవితకాలం బతికి ఉండిపోతారని తెలిపారు.


ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్ నేత్ర, అవయవ, శరీర దానాలపై అవగాహన కల్పించారు.


శరీర దానం చేసిన సందర్భంగా
లక్ష్మి భర్త వీరగోని పెంటయ్య,వారి కుమారులు సురేష్ మానస, నరేష్ -కృష్ణవేణి, కూతుర్లు అల్లుండ్లు సమత-తిరుపతి సౌజన్య-శ్రీనివాస్ లకు సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షులు శ్రవణ్ కుమార్, సలహాదారులు తాడూరు కరుణాకర్, కరీంనగర్ పట్టణ కన్వీనర్ యస్.రాజకనకయ్య జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు.


ఈ కార్యక్రమంలో కరీంనగర్ మేయర్ సునీల్ రావ్, బిజెపి నేత చల్ల నారాయణరెడ్డి, కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గం ఇంచార్జ్పు రుమల్ల శ్రీనివాస్, ఉపాధ్యాయ సంఘం నాయకులు రఘు శంకర్ రెడ్డి, కోల.రాజమల్లు, నారాయణరెడ్డి, ప్రముఖ కథా రచయిత అల్లం రాజయ్య, కవి అన్నవరం దేవేందర్, పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రాజేంద్ర బాబు, రిటైర్డ్ ప్రిన్సిపల్ జి నాగేందర్, స్వర్గీయ ఆకుల భూమయ్య కుమార్తె ఆకుల కవిత, తదితరులు శరీర దాత లక్ష్మితో తమకు ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. తొలుత ఆమె చిత్రపటానికి నివాళులు అర్పించారు.