ఆర్థిక ప్రగతి బాటకు ఆర్య వైశ్యుల పాత్ర కీలకం సీఎం రేవంత్ రెడ్డి !

👉మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో…


J.SURENDER KUMAR,


తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా ప్రగతి బాటలో పయనించాలంటే ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో ఉంటుందని, అందుకోసం ప్రతి ఒక్కరూ ముందు భాగాన ఉండి పనిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.


ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఆర్యవైశ్య ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ లో ఏదైనా మంచి ప్రదేశాన్ని గుర్తిస్తే అక్కడ రోశయ్య గారి విగ్రహ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. నాలుగో వర్ధంతిలోపు విగ్రహ ఏర్పాటు జరగాలని ఆకాంక్షించారు.
50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఆర్థిక మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్ గా అనేక పదవులకు రోశయ్య వన్నె తెచ్చారని కొనియాడారు. సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రులకు కుడిభుజంగా రోశయ్య ఉండేవారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా ప్రభుత్వాన్ని కంచె వేసి కాపాడేవారన్నారు.


చట్ట సభల్లో రోశయ్య వ్యవహరించిన తీరుతెన్నులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్మరించుకుంటూ చట్ట సభల్లో ఆనాటి స్ఫూర్తి కొరవడిందని అన్నారు. రోశయ్య పాలక పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాటల చతురతతో విషయావగాహనతో మాట్లాడేవారని గుర్తుచేశారు.
రోశయ్య నుంచి నేర్చుకోవలసింది ఎంతో ఉందన్నారు. వారు ఏనాడూ పదవులు కావాలని అడగలేదని, వారిలోని ప్రతిభ, క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధత వారికి అనేక పదవులను తెచ్చిపెట్టిందని చెప్పారు.


కొణిజేటి రోశయ్య మెమోరియల్ ఫోరమ్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు.