👉కరీంనగర్ లో భారీ ర్యాలీ… కలెక్టరేట్ ఎదుట నిరసన !
👉బంగ్లా హిందువులకు రక్షణ కల్పించాలి !
👉నిరసన కార్యక్రమం సందర్భంగా పీఠాధిపతులు, హిందూ ఐక్య వేదిక నేతల వ్యాఖ్యలు !
J.SURENDER KUMAR,
బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న నిరంతర దాడులను నిరసిస్తూ కరీంనగర్ హిందూ ఐక్యవేదిక బుధవారం రోజున భారీ నిరసన , ఆందోళన కార్యక్రమం చేపట్టింది. వేలాదిగా తరలివచ్చిన హిందూ జన సమూహంతో కరీంనగర్లోని గోపికృష్ణ ఫంక్షన్ హాల్ నుండి ప్రారంభించిన నిరసన ర్యాలీ పట్టణంలోని పలు ప్రాంతాల మీదుగా కలెక్టరేట్ వరకు కొనసాగింది.
ర్యాలీ సందర్భంగా బంగ్లాదేశ్ హిందువులను కాపాడండి, రక్షించండని ప్లకార్డులను ప్రదర్శిస్తూ, నినాదాలు చేశారు. నిరసన కార్యక్రమం సందర్భంగా కలెక్టరేట్ వద్ద పీఠాధిపతులు, హిందూ ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులు ఏం పాపం చేశారని దాడులు చేస్తున్నారని ప్రశ్నించారు. బంగ్లాదేశ్ లో ప్రజాస్వామ్యం లేదని, హిందువులకు రక్షణ కల్పించమని అడిగినందుకు ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణ దాస్ ను జైల్లో వేశారని, ఆయనకు అండగా నిలిచిన వారిపై దాడులు చేస్తు మారణ హోమం సృష్టిస్తున్నారని తెలిపారు.

ముఖ్యంగా బంగ్లాదేశ్ లో ఇస్లామిక్ తీవ్రవాదుల దాడులు రోజు,రోజుకీఅధికమయ్యాయన్నారు. హిందువులు, ఇతర మతపరమైన మైనార్టీలపై నిరంతరం దాడులు ,హత్యలు, దోపిడీలు, మహిళలపై అమానవీయ వేధింపులు పెరిగిపోతున్నాయని, ఇది తీవ్రమైన ఆందోళనకరమైన విషయమని, దీన్ని హిందూ ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ముఖ్యంగా బంగ్లాదేశ్ హిందువులు స్వీయ రక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో తమ గళాన్ని ఎత్తినప్పుడు , వారి గళాన్ని అణచివేయడానికి బంగ్లాదేశ్ ప్రభుత్వం దుర్మార్గ ప్రయత్నాలు చేస్తుందని మండిపడ్డారు.
ముఖ్యంగా ఈ మధ్యకాలంలో బంగ్లాదేశ్ లో వరదలోస్తే ఎవరి మతం ఏంటనేది చూడకుండా అన్నం పెట్టిన ఇస్కాన్ పై బంగ్లాదేశ్ నియంత ప్రభుత్వం అణిచివేత ధోరణి అవలంబిస్తుందన్నారు.
అందులో భాగంగానే ఇస్కాన్ స్వామీజీ చిన్మయి కృష్ణ దాస్ ను జైల్లో వేసి ఇబ్బంది పెడుతుందన్నారు. స్వామీజీకి అండగా నిలిచిన వారిపై ఉక్కు పాదం మోపుతుందన్నారు. ఇలాంటి చర్యలు సరికావని బంగ్లాదేశ్ ఇప్పటికైనా హిందూ మైనార్టీల పైన జరుగుతున్న దాడులను నివారించడానికి అన్ని విధాలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బంగ్లాదేశ్ హిందువులకు విశ్వ మానవాళి అండగా నిలబడి సంఘీభావాన్ని వ్యక్తపరచడం అత్యవసరమన్నారు. బంగ్లాదేశ్ మైనారిటీ హిందువుల రక్షణ కోసం, అక్కడి ప్రజలకు అండగా నిలవడానికి, నైతిక మద్దతు అందించడానికి హిందూ ఐక్యవేదిక నిరంతర ప్రయత్నం చేస్తుందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ద్వారా భారత రాష్ట్రపతికి వినతి పత్రం సమర్పించారు.

ఇట్టి కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక కరీంనగర్ జిల్లా కన్వీనర్ అనుమండ్ల రాజిరెడ్డి, కో కన్వీనర్లు డా . రమణాచారి, ఊట్కూరి రాధాకృష్ణారెడ్డి, రామ్ కిరణ్, పి .కిషన్, కిరణ్ సింగ్, ఆది శ్రీనివాసరావు, పీఠాధిపతులు శ్రీశ్రీ సనక సనంద స్వామీజీ, పురాణం మహేశ్వర శర్మ తదితరులు పాల్గొన్నారు.