గల్ఫ్ కార్మికుల పునరావాసం కోసం నిజామాబాద్ జిల్లా ఎంపిక !

👉 గల్ఫ్ దేశాల నుంచి  వచ్చినవారికి పునరావాసం, పునరేకీకరణకు కృషి !

👉  ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధలు !


J.SURENDER KUMAR,


తెలంగాణ లో నీటిపారుదల సౌకర్యం తక్కువగా ఉన్న ప్రాంతాలలో వాతావరణ మార్పుల (క్లయిమేట్ చేంజ్) పరిస్థితులను తట్టుకునే విధంగా వలసదారులు, దుర్భలమైన (హాని పొందడానికి అవకాశము వున్న) కుటుంబాల స్థితిస్థాపకత (రెజిలియెన్స్) ను మెరుగుపరచడం కోసం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్ధలు రెండు జిల్లాలను ఎంపిక చేశాయి. గల్ఫ్ వలసల నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాను, అంతర్గత వలసల నేపథ్యంలో నారాయణపేట జిల్లాను ఎంపిక చేశారు.


నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సిరికొండ మండలం మల్లారం, న్యావనంది, దర్పల్లి మండలం దుబ్బాక, హొన్నాజీపేట గ్రామాలను ఈ ప్రాజెక్టు కోసం ఎంపిక చేశారు. అనిశ్చిత వర్షపాతం, వరదలు, కరువులు తదితర వాతావరణ కారణాల వలన ప్రజలు తరచుగా వలస వెళ్లాల్సి వస్తున్న విషయంపై ఈ ప్రాజెక్టు దృష్టి సారిస్తుంది.

👉ప్రాజెక్ట్ లక్ష్యాలు:


1. వాతావరణాన్ని తట్టుకునే వ్యవసాయంపై స్థానిక సామర్థ్యాలను నిర్మించడం, దానికోసం పెట్టుబడి పెట్టడం
2. వలస మద్దతు సేవలను బలోపేతం చేయడం
3. తిరిగి వచ్చిన వారిని సమీకరించడం, పునరేకీకరణ చేయడం వారు పంపిన డబ్బును సక్రమంగా వినియోగించే విధంగా (ఛానెలింగ్) చేయడం
4. స్థిరమైన జీవనోపాధికి గ్రామీణ యువతకు తోడ్పాటు అందించడం
5. లింగ సమానత్వం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం

👉 లబ్ధిదారులు:

1. మహిళలు రైతులుగా, వలస కుటుంబాల సభ్యులుగా లబ్ది పొందడం
2. యువజన సంఘాలు
3. చిన్న, సన్నకారు రైతులు
4. రైతు ఉత్పత్తిదారుల సంస్థలు
5. స్వయం సహాయక బృందాలు
6. తిరిగి వచ్చిన వలసదారు


ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగాలైన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఓఏ), ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) లు మైగ్రేషన్ మల్టీ-పార్ట్‌నర్ ట్రస్ట్ ఫండ్ (ఎంఎంపిటిఎఫ్) మద్దతుతో రెండు సంవత్సరాల కార్యక్రమం (ప్రాజెక్టు) ను అమలు చేయాలని సంకల్పించడం పట్ల టీపీసీసీ ఎన్నారై సెల్ కన్వీనర్ మంద భీంరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.