మా ప్రభుత్వానికి రైతులే అంబాసిడర్లు సీఎం రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,


ప్రజా ప్రభుత్వానికి ఇకనుంచి రైతులే బ్రాండ్ అంబాసిడర్లు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు పారనప్పటికీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంతగా 66 లక్షల ఎకరాల్లో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వడ్లు పండించి రికార్డు సృష్టించినం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 25 లక్షల మంది రైతు కుటుంబాలకు 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలోనే ఏదైనా రాష్ట్రం ఉందంటే అది తెలంగాణ ప్రజా ప్రభుత్వం మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు.


👉 ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలలో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో మూడు రోజులపాటు జరిగిన రైతు పండుగ ముగింపు కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.


👉ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  మంత్రివర్గ సహచరులు, సలహాదారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది.


👉 దాదాపు ₹18 వేల కోట్ల రూపాయలతో 22 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటికే రుణమాఫీ చేయగా, తాజాగా ఈ వేదిక నుంచి మరో 3,13,897 మంది రైతు కుటుంబాలకు రుణ మాఫీ చేస్తూ అందుకు అవసరమైన ₹ 2747.67 కోట్ల రూపాయలను ముఖ్యమంత్రి  విడుదల చేశారు.


👉తాజాగా విడుదల చేసిన నిధులతో రాష్ట్రంలో మొత్తంగా 25 లక్షల మంది రైతులకు ₹ 21 వేల కోట్ల రూపాయల మేరకు రుణమాఫీ జరిగింది. ఈ నిధులను విడుదల చేయడంతో పాటు జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం వర్చువల్ గా ప్రారంభించారు.


👉అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా మహిళా సమాఖ్య కోసం ₹ 255 కోట్ల రూపాయలను విడుదల చేశారు.


👉 ఈ సందర్భంగా ముఖ్యమంత్రి  మాట్లాడుతూ…
రైతే రాజు అని ప్రభుత్వం రైతన్నలకు రుణమాఫీ చేయడంతో పాటు వరి వేస్తే ఉరి వేసుకున్నట్టే అన్న పరిస్థితుల నుంచి రికార్డు స్థాయిలో ఉత్పత్తి సాధించడమే కాకుండా ప్రభుత్వం ₹  500 రూపాయల బోనస్ ఇచ్చిన సందర్భంలో  రైతు పండుగ చేసుకుంటున్నం.


👉గ్రీన్ చానెల్లో నిధులు విడుదల చేయించి ఉమ్మడి పాలమూరు జిల్లాలో 20 లక్షల ఎకరాలకు నీళ్లు పారించే బాధ్యత తీసుకుంటం.


👉కొడంగల్ రుణం తీర్చుకోవాలని 1300 భూ సేకరణ చేసి పరిశ్రమలు స్థాపించి 25 వేల మంది మహిళలకు, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్న ప్రయత్నం చేస్తుంటే కొందరు అడ్డుపడుతున్నరు. అమాయకులను రెచ్చగొడుతున్నరు.

👉భూమి అందరికీ ఆత్మగౌరవం. అభివృద్ధి జరగాలంటే భూ సేకరణ తప్పడం లేదు. అవసరమైతే భూ సేకరణకు రెట్టింపు పరిహారం చెల్లించడమే కాకుండా నష్టపోయిన కుటుంబాల పిల్లలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.


👉ఇక్కడ పుట్టిన వాడిని… గిట్టేది కూడా ఈ గడ్డమీదే. ముఖ్యమంత్రిగా ఉండి ఈ జిల్లాకు నీళ్లు ఇవ్వకపోతే, నిధులు ఇవ్వకపోతే, అభివృద్ధి చేయకపోతే చరిత్ర క్షమించదు. జిల్లా వాసిగా నా బాధ్యత నాకు తెలుసు.


👉భారీ స్థాయిలో జరిగిన ఈ రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ , దుద్దిళ్ల శ్రీధర్ బాబు , సీతక్క , జూపల్లి కృష్ణారావు , కోమటిరెడ్డి వెంకటరెడ్డి , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , పొన్నం ప్రభాకర్ , సలహాదార్లు, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.