ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించాలి !

👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !


J.SURENDER KUMAR,

ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థినీ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించే దిశగా కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలంలోని కన్హా గ్రామంలోని కన్హా శాంతివనాన్ని ఆదివారం సందర్శించిన ముఖ్యమంత్రి అక్కడ చిన్నారులు, విద్యార్థులకు నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ కు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.


కళ్లకు గంతలు కట్టుకుని రంగులను గుర్తించడం, పదాలను చదవడం వంటి స్కిల్స్ ను ప్రదర్శించిన అక్కడి విద్యార్థులను ముఖ్యమంత్రి అభినందించారు.
కన్హా శాంతి వనం నిర్వాహకులు, శ్రీ రామ్ చంద్ర మిషన్‌ అధ్యక్షులు, హర్ట్ ఫుల్ నెస్ గ్లోబల్ గైడ్, ఆధ్యాత్మికవేత్త కమలేష్ పటేల్ ( దాజీ ) స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి స్వాగతం పలికి వనమంతా తిప్పి చూపించారు.

కన్హా శాంతివనం ఆవరణలోని ట్రీ కన్జర్వేషన్ సెంటర్ లో వివిధ రకాల వంగడాల అభివృద్ధి, మొక్కల పెంపకానికి సంబంధించిన విధానాలను శాంతి వనం నిర్వాహకులు సీఎం కు వివరించారు. శాంతి వనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రెయిన్ ఫారెస్ట్ ను, మెడిటేషన్ సెంటర్ హల్ ను సందర్శించిన సీఎం అక్కడ ఒక మొక్కను నాటారు.


ఈ కార్యక్రమంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు శ్రీనివాసరాజు , ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్ , కాలే యాదయ్య , ఉన్నతాధికారులు పాల్గొన్నారు
.