👉 ధర్మపురి ప్రజా పాలన ఉత్సవాలలో ట్రాంజెండర్ మాటలు…
J. SURENDER KUMAR,
దశాబ్దాలుగా మేము రోడ్లపై అడుక్కునే వాళ్ళము,
సీఎం రేవంత్ రెడ్డి విశాల హృదయంతో
మమ్మల్ని ఆ రోడ్ల కే అధికారులను చేసి
చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిపోతారు
అంటూ ఓ ట్రాంజెండర్ సీఎం రేవంత్ రెడ్డికి
బహిరంగ సభలో కృతజ్ఞతలు తెలిపింది.
ధర్మపురి నియోజకవర్గ కేంద్రంలో శనివారం జరిగిన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రజా పాలన సంవత్సర కాలంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, నిధుల మంజూరు తదితర అంశాలు వివరించారు.
ట్రాఫిక్ నియంత్రణ ఉద్యోగిగా ప్రభుత్వం ద్వారా నియామకమైన ఎండపల్లి మండలానికి చెందిన ట్రాంజెండర్ ప్రేమ తనకు ఉద్యోగం కల్పించినందుకు ఎమ్మెల్యే , కలెక్టర్ కు మిఠాయి అందించి మాట్లాడింది.
ట్రాంజెండర్ మాటలలో…
దశాబ్దాల కాలంగా సమాజం లో కొందరు మా పట్ల, మా జాతి పట్ల వివక్షత చూపడం, హేళన, అవమానాలకు గురి చేయడంతో మేము తీవ్ర మానసిక వేదనకు గురి అయ్యామన్నారు. పొట్టకూటి కోసం రోడ్లపై ఆడుకునేవాళ్లం. గత ప్రభుత్వ పెద్దలకు మాకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఎన్నిసార్లు వేడుకున్న పట్టించుకోలేదని ట్రాంజెండర్ ప్రేమ ఆవేదన వ్యక్తం చేసింది.

తాను 22 సంవత్సరాల వయసు వరకు పురుషుడిగా ఆ తరువాత మహిళగా మారి ఉపాధి లేక రోడ్లపై అడుక్కుంటూ ఉండేదాన్ని అన్నారు. వీధి లేక మా గ్రామంలో వ్యవసాయ కూలీ గా జీవనం కొనసాగించే దానిని అన్నారు. ప్రభుత్వం నన్ను పిలిచి రోడ్డు ట్రాఫిక్ నియంత్రణ ఉద్యోగం ఇచ్చారని, ప్రేమ సంతోషం వ్యక్తం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో, వైద్య ఆరోగ్యశాఖ, అటవీశాఖ తదితర ప్రభుత్వ శాఖలు మా జాతికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని మమ్మల్ని ఆహ్వానించడం తో మా జాతి యావత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రుణపడి ఉంటామన్నారు.