శబరిమల ఆలయం డిసెంబర్ 30 న తెరుచుకుంటుంది !

👉అంగరంగ వైభవంగా ముగిసిన మండల పూజ !

👉గురువారం రాత్రి 11 గంటలకు ఆలయం మూసివేత !

J.SURENDER KUMAR,

శబరిమల స్వామి అయ్యప్ప ఆలయ వార్షిక మొదటి దశ కీలకమైన మండల పూజ గురువారం జరిగింది. గురువారం రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసివేశారు.  డిసెంబర్ 30 సాయంత్రం 5 గంటలకు తెరువనున్నారు.

ఆలయ ప్రధాన పూజారి  (తంత్రి ) కందరారు రాజీవరు ఆధ్వర్యంలో మధ్యాహ్నం నుంచి 12.30 గంటల మధ్య పూజలు నిర్వహించారు.  మండల పూజ, నెయ్యభిషేకం తర్వాత ఆలయం మూసివేశారు. డిసెంబర్ 23 నాటికి మొత్తం 30,87,049 మంది యాత్రికులు అయ్యప్ప ఆలయాన్ని సందర్శించారు. గతేడాదితో పోలిస్తే సుమారు 4.46 లక్షల మంది భక్తులు పెరిగారు.

👉 శబరిమల భక్తుల కోసం ఆధునిక సాంకేతిక విధానం !


కేరళలోని శబరిమల ఆలయానికి మండల – మకరవిళక్కు సీజనులో లక్షల్లో తరలివచ్చే భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు కొత్త సాంకేతికతను వాడుతున్నారు.

పథనంథిట్ట జిల్లా కలెక్టర్‌ ప్రేమ్‌ కృష్ణన్‌, నేతృత్వంలో వాట్సాప్‌ ఆధారిత ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు

ఏటా పెరుగుతున్న రద్దీతో పలు సవాళ్లు ఎదురవుతున్నాయి. భక్తుల వసతి, భద్రత, క్యూల నిర్వహణ , ఆలయ సమయాలు, ఆయా మార్గాల వివరాలు, యాత్రికుల సమూహాలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం అందుబాటులో లేక భక్తులు గందరగోళానికి గురవుతుంటారు.

వాతావరణ సమాచారం లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో, ట్రెక్కింగ్ సమయంలో భక్తులు తరచూ ప్రమాదాలకు గురవుతుంటారు. వీటికితోడు భాషాపరమైన సమస్యలు. ఆ సవాళ్లను అధిగమించేందుకు ఏఐ చాట్‌బాట్‌’ కు” స్వామి ” అని పేరు పెట్టారు.

భక్తులకు ముఖ్యమైన, కచ్చితమైన సమాచారాన్ని అందించడమే ఈ చాట్‌బాట్‌ లక్ష్యం. యూజర్‌ ఫ్రెండ్లీగా పలు భాషల్లో ఇది సేవలందిస్తుంది. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ నవంబరు 13న దీన్ని ప్రారంభించారు. భక్తులందరికీ చేరేలా మీడియా, ఎఫ్‌ఎం రేడియో, సామాజిక మాధ్యమాల్లో విస్తృత ప్రచారం చేశారు. ఐదు వారాల్లోనే 1.5 లక్షల మంది భక్తులు అనుసంధానమైనట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు, మండల పూజ సందర్భంగా శబరిమలలో స్వామి వారిని ఊరేగింపుగా తీసుకొచ్చిన ‘థంకా అంకి’ తో అలంకరించారు. ఆలయంలో దీపారాధన నిర్వహించారు. అంతకుముందు ఊరేగింపుగా తీసుకొచ్చిన థంకా అంకిని సన్నిధానం వద్ద మంత్రి వీఎన్ వాసవన్, దేవస్వోమ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్, దేవస్వోమ్ బోర్డు సభ్యులు, ఇతర అధికారులు స్వాగతం పలికారు.

ఆలయ మెట్ల వద్ద తంత్రి కందరారు రాజీవరు, మేల్శాంతి అరుణ్ కుమార్ నంబూతిరి, సహాయ అర్చకులు తంక అంకిని లాంఛనంగా స్వీకరించి ఆలయం లోపలికి తీసుకెళ్లారు. సాయంత్రం 6.30 గంటలకు మహా దీపారాధన నిర్వహించారు. థంకా అంకిని అలంకరించి, స్వామి దర్శనానికి అయ్యప్ప స్వాములు భారీ సంఖ్యలో తరలివచ్చారు.