షాద్ నగర్ ఎమ్మెల్యేపై కఠిన చర్యలు తీసుకోవాలి!

👉 ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఇతర కులాలకు వర్తింపజేయాలి !

👉 పోలాడి రామారావు డిమాండ్ !


J.SURENDER KUMAR,


వెలమ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ షాద్ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ చేసిన అమర్యాదకర వ్యాఖ్యలను రైతు, ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా ఖండించారు.


ఈ వ్యాఖ్యలు ఆయన స్థాయికి తగిన విధంగా లేవని , బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరైందికాదన్నారు. తమ పార్టీ శాసనసభ్యుని అనుచిత వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి స్పందించాల్సిన అవసరం ఉందన్నారు.


శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రామారావు మాట్లాడుతూ ఎమ్మెల్యే శంకర్ చేసిన వ్యాఖ్యలు ఓసీల మనోభావాల దెబ్బతీశాయని, ఆయన వ్యాఖ్యలపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశామని తెలిపారు. కులం పేరుతో దూషిస్తే ఎస్సీ, ఎస్టీ వర్గీయులకు వర్తింపజేసే అట్రాసిటీ చట్టాన్ని, ఇతర అన్ని కులాలకు వర్తింపజేసి సామాజిక సమన్యాయం పాటించాలని పోలాడి రామారావు డిమాండ్ చేశారు.


ఈ సమావేశంలో నాయకులు కొత్తకొండ రవీందర్రావు, పెండ్యాల రాంరెడ్డి, తీగల లక్ష్మణరావు, అండెం రమణారెడ్డి, జిల్లాల అంజయ్య, శ్రీరాంభట్ల దీపక్ బాబు, జనగామ చంద్రశేఖర రావు, తదితరులు పాల్గొన్నారు.