సొమ్ములు ధర్మపురి సొసైటీ రైతుల వి – సోకులు ఎవరివి ?

👉ధర్మపురి సొసైటీ భూమి  కౌలు సొమ్ము ఎవరి జేబులో కి ?


👉 సొసైటీ కి చెందాల్సిన 0-13 గుంటల భూమి ఏమైంది ?


J.SURENDER KUMAR,


రైతుల మూలధన పెట్టుబడి, తీసుకున్న రుణాలపై వడ్డీ సొమ్ములు, పంటల క్రయ విక్రయాలపై సొసైటీ కి వచ్చే ప్రోత్సాహక, కమిషన్ తో, ఎరువులు క్రిమిసంహారక మందుల అమ్మకాల లో వచ్చే లాభాల సొమ్ములతో కొనసాగుతున్న ధర్మపురి సింగిల్ విండో సొసైటీ లో రైతులకు చెందిన లక్షలాది రూపాయల సొమ్ములతో కొందరు పాలకవర్గ సభ్యులు, అధికారులు సోకులు చేస్తున్నారు అనే ఆరోపణలు, విమర్శలు రైతులు చేస్తున్నారు.  

సొసైటీ పేరున  ఉన్న భూమి లో  కాస్తు  చేస్తున్నవారు కౌలు సొమ్ము ఎవరికి చెల్లిస్తున్నా రో ?   సొసైటీ కి పట్టా కావాల్సిన లక్షలాది రూపాయలు విలువ గల మరో 0- 13 గుంటల భూమి ఎవరి ఆధీనంలో ఉందో ?  ఆ భూమి సొసైటీకి రిజిస్ట్రేషన్ కాకుండా  అడ్డుకుంటున్నది ఎవరో ?  0-13 భూమికి సంబంధించిన లక్షలాది రూపాయలు ఎవరు స్వాహా చేశారో ?  అనేది ధర్మపురి సింగిల్ విండోలో మిస్టరీగా మారింది.


వివరాలు ఇలా 


ధర్మపురి సింగిల్ విండో సొసైటీలో  10 గ్రామాలకు చెందిన దాదాపు మూడువేల నుంచి నాలుగు వేల మంది రైతులు సభ్యులుగా కొనసాగుతున్నారు. రైతుల వాటాదనం  దాదాపు ₹ 1 కోటి 30 లక్షల రూపాయల వరకు ఉండవచ్చు. సాలీనా దాదాపు ₹ 15 కోట్ల నుంచి ₹ 20 కోట్ల వరకు ఆర్థిక లావాదేవీలు సొసైటీలో జరుగుతున్నాయి.


👉 2020 ఫిబ్రవరిలో పాలకవర్గం ఏర్పాటు !


ధర్మపురి సింగిల్ విండో కార్యకలాపాల నిర్వహణ,  రైతులకు, రుణాలు , ఎరువులు,  క్రిమిసంహారక మందులు, ధాన్యం నిలువ గోడౌన్ల నిర్మాణం, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించడం తదితర అంశాలు పాలకవర్గ పర్యవేక్షణలో కొనసాగుతాయి.


13 మంది పాలకవర్గ డైరెక్టర్లు ( సొసైటీలో సభ్యత్వం ఉన్న రైతులతో ఎన్నుకోబడిన వారు )
వీరీలో ఏల్లాల శ్రీకాంత్ రెడ్డి, పాలకవర్గ అధ్యక్షుడిగా, బలిజపల్లి లింగన్న, ఉపాధ్యక్షుడిగా పాలకవర్గ సభ్యులచే ఎన్నికయ్యారు. ఈ పాలకవర్గం లో సొసైటీ కార్య నిర్వహణ అధికారి, కూడా పాలకవర్గ ఎక్స్ అఫీషియల్ సభ్యుడుగా కొనసాగుతారు. 2020 ఫిబ్రవరి 15 నుంచి పాలకవర్గం నేటికి వరకు కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.


👉 సొసైటీ సొమ్ములతో భూమి కొనుగోలు !

రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో 27 గుంటలుగా నమోదు !


ధర్మపురి మండలం నాగారంలో సర్వేనెంబర్ 84ఈ లో 0-27 గుంటల భూమి ని జూలై 6, 2020 సొసైటీ కొనుగోలు చేసింది. డాక్యుమెంట్ నెంబర్ 4052/2020. రిజిస్టర్ డాక్యుమెంట్ లో పేర్కొన్న భూమి హద్దులలో భూమికి తూర్పున  పడమరలో ఇతర పట్టేదారులు ఉత్తరం దక్షిణం దిశలలో రాళ్ల గుట్టలో ఉన్నాయి అని రికార్డులలో పేర్కొన్నారు. ఈ సర్వేనెంబర్ భూ విస్తీర్ణం మొత్తం 2-31( రెండు ఎకరాల 31 గుంటలు ) గా నమోదు అయి ఉంది.
సొసైటీ అభివృద్ధి కోసం కొనుగోలు చేసిన 0-27 గుంటల భూమికి సొసైటీ ఖాతా నుంచి ₹ 5,10,662/ ( ఐదు లక్షల పదివేల ఆరు వందల అరవై రెండు రూపాయలు ) డ్రా చేసి చెల్లించినట్టు రికార్డులలో నమోదు చేశారు.


👉 రికార్డులలో ఎకరం  మోకాపై 0-27 గుంటలే !


సొసైటీ కోసం ఎకరం భూమి కొనుగోలు చేయడానికి తీర్మానం చేసి, 0-27 గుంటలు మాత్రమే సొసైటీ పేరును పట్టా చేయించుకుంది.


👉 0-13 గుంటల భూమి ఎక్కడ ?


గత నాలుగు సంవత్సరాలుగా సొసైటీకి చెందాల్సిన 0-13 గుంటల భూమిని ఎందుకు సొసైటీ పేరున రిజిస్ట్రేషన్ చేయించడం లేదో ? 0-13 గుంటల భూమి సొమ్ముతో ఎవరు సోకులు చేస్తున్నారో ?  ఆ భూమిని ఎవరు అనుభవిస్తున్నారో ?  అనే అంశం పై  సొసైటీ పాలకవర్గ బాధ్యులు, అధికారులు భవిష్యత్తులో రైతులకు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందనే చర్చ రైతాంగంలో జరుగుతున్నది.


👉 కౌలు, రైతు బంధు సొమ్ములు ఎవరి జేబులో కి ?

సొసైటీ కొనుగోలు చేసిన భూమిలో వరి సాగు దృశ్యం(ఫైల్ ఫోటో)


సొసైటీ పేరుతో ఉన్న భూమిలో వరి సాగు చేస్తున్నారు. వేలాది రూపాయల కౌలు సొమ్ములు ఎవరి జేబుల్లోకి పోతున్నాయో అంతు బట్టని మిస్టరీగా మిగిలింది. దీనికి తోడు సొసైటీ పేరున రిజిస్టర్ అయిన  సర్వేనెంబర్ 84ఈ, భూమికి ప్రభుత్వం 2018 నుంచి 2020 డిసెంబర్ నాటి వరకు రైతు బంధు డబ్బులు జమ చేసినట్టు   ప్రభుత్వ రికార్డులలో స్పష్టంగా ఉంది.

అయితే 2020 జులై 6న ధర్మపురి సొసైటీ పేరును పట్టా అయినా ఈ భూమికి సంబంధించిన రైతు బంధు డబ్బులు డిసెంబర్ మాసం లోఎవరి ఖాతాలో జమ అయ్యిందో.?  అనేది సొసైటీలో మరో మిస్టరీ. సొసైటీకి చెందిన సర్వేనెంబర్ 84ఈ లో 0-27  గుంటల భూమిని 20-02-2021 న ధర్మపురి తహసిల్దార్ కార్యాలయంలో నాలా గా ( నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ గా ) మార్పిడి చేశారు.


👉 ఆడిటర్లు అభ్యంతరం చెప్పిన…

నాగారంలో కొనుగోలు చేసిన భూమి అంశంలో ఆడిటర్లు అభ్యంతరపు నోటీసు (ఫైల్ కాఫీ)


శాఖ పరమైన ప్రభుత్వ ఆడిటర్లు ధర్మపురి సొసైటీ నాగారంలో కొనుగోలు చేసిన భూమిపై అనేకసార్లు  అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ  పాలకవర్గాన్ని, అధికారులను వివరణ కోరుతూ నోటీసులు పంపిన, బాధ్యులు  స్పందించకపోవడంతో సొసైటీ తీరుపై ప్రభుత్వానికి ఆడిటర్లు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.


ప్రభుత్వ యంత్రాంగం స్పందించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్  అధికారులతో విచారణ చేపట్టితే
రైతుల సొమ్మును అడ్డగోలుగా, అందినంత, దోచుకుంటూ సోకులు చేస్తున్న వారి అవినీతి బాగోతాలు వెలుగు చూస్తాయని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  విచారణ చేపట్టి  రైతుల సొమ్ము రికవరీ చేస్తారో ?  లేదో ?  అని రైతులు, ప్రజలు చూస్తున్నారు.