శ్రీవారి దర్శనం కోసం లక్ష ఇరువదివేల టోకెన్లు !

👉 జనవరి 10,11, 12  తేదీలో కోసం !

👉 జనవరి 9 ఉదయం 5 గంటలకు టోకెన్ జారీ!

👉 టోకెన్లు లేని భక్తులకు ఈ 10 రోజుల పాటు శ్రీవారి దర్శనం ఉండదు!

J.SURENDER KUMAR,

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి తిరుపతి, తిరుమల సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లను జనవరి 10 నుంచి 19 వరకు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో  శ్యామలరావు వెల్లడించారు.

👉 జనవరి 10, 11, 12 తేదీల్లో మొదటి మూడు రోజులకు జనవరి 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి 1.20 లక్షల టోకెన్లు, మిగిలిన రోజులకు ముందు రోజు టోకెన్లు జారీ చేస్తామని ఇఓ తెలిపారు.

👉 తిరుపతిలో కౌంటర్లు ఏర్పాటు చేస్తున్న రామచంద్ర పుష్కరిణి, భూదేవి కాంప్లెక్స్, జీవకోన హైస్కూల్, ఇందిరా మున్సిపల్ గ్రౌండ్స్, శ్రీనివాసం, విష్ణునివాసం, బైరాగిపట్టెడలోని రామానాయుడు పాఠశాల, ఎంఆర్ పల్లి పాఠశాలలను అడిషనల్ ఈవో  వెంకయ్య చౌదరితో కలిసి ఆయన పరిశీలించారు. తిరుమల స్థానికుల కోసం తిరుమలలోని బాలాజీ నగర్‌ లోని హాలు 8లో 87 కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నారు.

👉 తిరుపతిలో కేంద్రాలు, తిరుమలలో 4 కౌంటర్లు కలిపి మొత్తం 91 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

👉 భక్తులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందాలని, ఈసారి టోకెన్లు పొందిన భక్తులకు వారి ఫోటో గుర్తింపుతో కూడిన స్లిప్‌లను అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ 10 రోజుల పాటు టోకెన్లు లేని భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించబోమని తెలిపారు.

👉 కౌంటర్లు వచ్చే ప్రాంతాల్లో ప్రత్యేక క్యూ లైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నామని, వేచి ఉండే భక్తులకు తాగునీరు, మరుగుదొడ్లు తదితర సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.

👉 సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు త్వరితగతిన, ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం కోసం మాత్రమే తమకు కేటాయించిన సమయానికి తిరుమలకు రావాలని కోరారు. అనంతరం టీటీడీ పరిపాలనా భవనంలో అధికారులతో సమావేశం నిర్వహించారు.

👉 టీటీడీ జేఈవో శ్రీమతి. గౌతమి, జిల్లా కలెక్టర్. వెంకటేశ్వర్లు, జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సీవీఎస్‌వో  శ్రీధర్‌లు కూడా తనిఖీల్లో పాల్గొన్నారు.

👉 టీటీడీ అధికారులతో పాటు సీఈ  సత్యనారాయణ, ఎస్ఈలు  మనోహరం,  వెంకటేశ్వర్లు, రవాణాశాఖ జీఎం  శేషారెడ్డి, ఇతర జిల్లా, పోలీసు అధికారులు పాల్గొన్నారు.