ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరి కోసం ?

👉 జగిత్యాల గడ్డ  బీఆర్ఎస్  అడ్డా ?


J. SURENDER KUMAR,


ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాన్ని గ్రామ గ్రామాన ప్రతిష్టిస్తాం అంటూ మాజీ  సీఎం కేసీఆర్ కూతురు మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జగిత్యాలలో తెలంగాణ తల్లి విగ్రహా ప్రతిష్టకు భూమి పూజ సందర్భంగా ఆమె చేసిన శపథం.

అయితే ప్రస్తుతం ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహం ఎవరికోసం ? అనే చర్చ  మొదలైంది. దీంతోపాటు ‘ జగిత్యాల గడ్డ బీ ఆర్ఎస్ అడ్డా ? అంటూ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

తెలంగాణ నూతన తల్లి విగ్రహాన్ని ఏ రూపంలోనైనా తప్పుగా చిత్రీకరించినా, అవమానించినా శిక్షార్హమైన నేరమన్న ప్రభుత్వ ఉత్తర్వులను ధిక్కరిస్తూ
ఈనెల 15 ఎమ్మెల్సీ కవిత జగిత్యాల జిల్లా కేంద్రమైన మున్సిపల్ పరిధిలో కాకుండా శివారు ధరూర్ గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే స్థలంలో ఆమె భూమి పూజ చేశారు.

తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి, సంప్రదాయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడి చేస్తోందని ఆరోపించిన ఆమె, ప్రతి గ్రామంలో అసలైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..

ప్రభుత్వం ఎన్ని జీవోలు, గెజిట్‌లు జారీ చేసినా అసలు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తమకు స్ఫూర్తినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చిందని, తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను కాపాడేందుకు తాను కట్టుబడి ఉన్నానని ఆమె పునరుద్ఘాటించారు.

తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకుంటే ?
ప్రభుత్వం అధికారికంగా ప్రతిష్టించిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మ లేకుంటే రాష్ట్రంలో బతుకమ్మ పండుగ జరగదా ? మహిళలు బతుకమ్మ ఆడరా ? బతుకమ్మ పండుగ జరుపుకోరా ?  బతుకమ్మ జాగృతి సంస్థకు పేటెంట్ టా ? అనే వివరాలు ఎమ్మెల్సీ కవిత భూమి పూజకు వచ్చిన జన సందోహానికి  వివరిస్తే మరింత బాగుండేది .

👉 వేడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు !

రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో పలు సందర్భాల్లో నాటి ఉద్యమ నాయకుడు మాజీ సీఎం కెసిఆర్ అనే మాటలు  ‘ వేడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు ‘ ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహాలు గ్రామ గ్రామాన ఏర్పాటు చేస్తాం అనే ప్రసంగం సైతం ప్రస్తుతం ఇది వేడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ కాదు. అని ఆమె అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇందుకు కారణం. ప్రభుత్వం తేది 9/12/ 2024 న జీ వో ఎం ఎస్ నెంబర్, 1946 ద్వారా తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

👉 తెలంగాణ తల్లి విగ్రహ నోటిఫికేషన్ లో..

తెలంగాణ తల్లి నోటిఫికేషన్ లో..

“తెలంగాణ తల్లి సాంప్రదాయ స్త్రీమూర్తి గా ప్రశాంత వదనంతో, బంగారు అంచు కలిగిన ఆకుపచ్చని చీరలో, సాంప్రదాయ కట్టుబొట్టుతో, మెడకు కండె, గుండు పూసల హారం, చేతికి గాజులు, కాళ్లకు కడియాలు, మెట్టెలు, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడకతో మధ్య వయస్సు స్త్రీమూర్తిలా హుందాగా ఎంతో స్ఫూర్తిదాయకంగా రూపొందించబడి, కుడిచేతితో అభయాన్నిస్తూ, ఎడమచేతిలో సాంప్రదాయ పంటలైన వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న పంటలు మన ప్రాంతీయ వ్యవసాయ సంస్కృతికి చిహ్నంగా చూపించబడ్డాయి.”

ప్రభుత్వం జారీ చేసిన జీవో.

“తెలంగాణ తల్లి” మన జాతి అస్తిత్వ, ఆత్మగౌరవ ప్రతీక. కాబట్టి, తెలంగాణ తల్లి చిత్రాన్ని, రూపాన్ని వక్రీకరించడం గాని, వేరేవిధంగా చూపించడం గాని నిషేధించడమైనది. తెలంగాణ తల్లి చిత్ర రూపురేఖలను బహిరంగ ప్రదేశాలలో గాని, ఇతర ప్రదేశాలలో గాని, ఆన్ లైన్లో గాని, సామాజిక మాధ్యమాలలో గాని, మాటలు, లేక చేతలతో అగౌరవపరచడం, ధ్వంసం చేయడం, కాల్చడం, అవహేళన చేయడం, అవమానించడం లేదా కించపరచడం నేరంగా పరిగణించబడుతుంది. అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారి పేరున విడుదలైన గెజిట్ లో  పేర్కొన్నారు.

👉 చట్టానికి ఎమ్మెల్సీ కవిత అతీతురాల ?

👉 కేసులు నమోదు అయితే ఎవరి పైనా ?

ప్రభుత్వ జీవో, నోటిఫికేషన్ ధిక్కరిస్తూ ఎమ్మెల్సీ కవిత  ప్రసంగించినా ?  విగ్రహ ప్రతిష్టకు భూమి పూజ చేసినా ?  నేర తీవ్రత అంతగా ఉండకపోవచ్చు.

ఒకవేళ ఆమె కోరిన విధంగా గ్రామాల్లో విగ్రహం ఏర్పాటు చేసి ప్రతిష్టించినా ?
ప్రభుత్వం నమోదు చేసే కేసులు విగ్రహాన్ని తయారుచేసిన కళాకారుడి పై, విగ్రహ ప్రతిష్టకు పనిచేసిన గ్రామీణ కూలీలపై, తాపీ మేస్త్రిల పై, ఆ విగ్రహ ఏర్పాటుకు అనుమతి జారీ చేసిన పంచాయితీ, మున్సిపల్ అధికారుల పై ప్రభుత్వ యంత్రాంగం నమోదు చేయాల్సిందే, చేయక తప్పదు మరి.

ఎమ్మెల్సీ కవిత ప్రసంగం ద్వారా రెచ్చగొట్టి గ్రామ గ్రామాన ప్రజలపై కేసులో నమోదు చేయించి రాజకీయ పబ్బం  కోసమే  ఉద్యమ తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు ఎపిసోడ్ అనేది జగమెరిగిన సత్యం.

👉 జగిత్యాల గడ్డ టిఆర్ఎస్ అడ్డానా ?

జగిత్యాల అంటే,  జగిత్యాల జైత్రయాత్ర  గూర్చి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఈ జైత్రయాత్ర తోనే  బడుగు, బలహీన వర్గాల ప్రజలకు, అన్యాయాలను దోపిడీలను  ప్రశ్నించే ధైర్యాన్ని ఇచ్చింది అనేది జగమెరిగిన సత్యం. అయితే జగిత్యాల గడ్డ ఏ రాజకీయ పార్టీల  అడ్డా కాదు, ఇక్కడ ప్రజల ఆత్మగౌర పోరాటాల పురిటి గడ్డ అనేది మాత్రం చరిత్ర పుటలలో చిరస్థాయిగా నిలిచిన నిజమైన శాసనం అనేది నిజం.


దీనికి తోడు  స్వరాష్ట్రంలో జరిగిన 2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో  కెసిఆర్ బొమ్మతో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన ప్రస్తుత ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,  కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సంజయ్ కుమార్,  దాదాపు 60 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కొన్ని నెలల వ్యవధిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ( జగిత్యాల అసెంబ్లీ సెగ్మెంట్ నిజాంబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది ) నిజామాబాద్ సీట్టింగ్ పార్లమెంట్ టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన ప్రస్తుత ఎమ్మెల్సీ, కల్వకుంట్ల కవిత ఓటమి చెందడంతో పాటు జగిత్యాల్ సెగ్మెంట్లో ఆమెకు వచ్చిన ఓట్లు ఎన్నో ఆమెకు గుర్తు ఉండే ఉంటుంది.
మరి ‘ జగిత్యాల గడ్డ బీఆర్ఎస్ అడ్డానా ?  చైతన్య వంతులైన ఓటర్ల అడ్డానా ? అనేది ప్రస్తావించాల్సిన అవసరం లేదు.


గ్రామ గ్రామాన ఉద్యమ తెలంగాణ తల్లి ప్రతిష్టాపన కార్యక్రమల తో  గ్రామీణ కూలీలను, యువకులను కేసులో  ఇరికిస్తారో ?  తెలంగాణ తల్లి విధివిధానాలపై ప్రభుత్వం విడుదల చేసిన జీవో, నోటిఫికేషన్ రద్దు కోసం బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత న్యాయపోరాటం చేస్తారో ? వేచి చూద్దాం.