👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణలో చేపడుతున్న పలు అభివృద్ధి పనులకు అటవీ, పర్యావరణ శాఖ వెంటనే అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ కు విజ్ఞప్తి చేశారు.
ఢిల్లీలోని ఇందిర పర్యావరణ్ భవన్‌లో ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ని గురువారం కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను నివేదించారు.
👉కేంద్ర అటవీ శాఖ అనుమతులు రాకపోవడంతో తెలంగాణ వ్యాప్తంగా 161 ప్రాజెక్టులు నిలిచిపోయాయని వివరించారు. 38 ప్రాజెక్టులకు వన్యప్రాణి సంరక్షణ చట్టాల పరమైన అనుమతులు పెండింగ్‌లో ఉన్నాయని, తక్షణం అనుమతులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కోరారు.
👉 ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి తెలియజేశారు. అనుమతులు రాకపోవడంతో జాతీయ రహదారులు, ఏజెన్సీ ప్రాంతాల్లో టవర్ల నిర్మాణం, పీఎంజీఎస్‌వై, పొరుగు రాష్ట్రాలను అనుసంధానించే రహదారుల నిర్మాణ పనులు నిలిచిపోయాయని తెలిపారు.

👉 గౌరవెల్లి ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతుల మంజూరు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి విజ్ఞప్తులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
👉 ముఖ్యమంత్రి వెంట మంత్రులు కొండా సురేఖ , పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎంపీ పోరిక బలరాం నాయక్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
👉పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిని !

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ని మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలపై వారితో చర్చించారు.
ముఖ్యమంత్రి వెంట రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి , పొన్నం ప్రభాకర్ , పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎంపీలు పోరిక బలరాం నాయక్ , రఘువీర్ రెడ్డితో పాటు పలువురు అధికారులు ఉన్నారు.
👉జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమం !

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన స్వర్గీయ సూదిని జైపాల్ రెడ్డి జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలోని అధికార నివాసంలో ఆ మహానేత చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.
తెలంగాణ పల్లె నుంచి ఢిల్లీ దాకా సాగిన జైపాల్ రెడ్డి రాజకీయ ప్రస్థానంలో నైతిక విలువలకు కట్టుబడ్డారని గుర్తు చేసుకున్నారు.
ముఖ్యమంత్రి తో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్ , ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ , ఎమ్మెల్యేలు గడ్డం వినోద్, రామ్మోహన్ రెడ్డి , పలువురు నాయకులు జైపాల్ రెడ్డికి నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.