మహా కుంభమేళాలో శ్రీవారి తిరుమంజనం !

J.SURENDER KUMAR,


మహా కుంభమేళాలో ప్రయాగ్‌రాజ్‌లోని దశాశ్వమేధ ఘాట్‌లో గురువారం టీటీడీ స్నపన తిరుమంజనం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది.

తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు  వేణుగోపాల దీక్షితులు నేతృత్వంలోని అర్చకుల బృందం పవిత్ర గంగా నది ఒడ్డున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ శ్రీనివాస స్వామివారి తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనం ముద్దలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు.

భక్తులు మత పారవశ్యంతో మొత్తం ఉత్సవాలను వీక్షించారు. ఈ సందర్భంగా వేదపండితులు శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, పురుష సూక్తం, నారాయణ సూక్తంతోపాటు పంచ సూక్తాలను పఠించారు. అభిషేకం అనంతరం విగ్రహాలను తులసి మాలలతో అలంకరించారు.

తదనంతరం మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్ స్వామిని గంగా నదిలోకి తీసుకువెళ్లారు. అక్కడ శ్రీ చక్రతాళ్వార్‌కు ప్రత్యేక పూజలు, హారతి నిర్వహించి చక్రస్నాన మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌డిపిపి కార్యదర్శి శ్రీరామ్‌ రఘునాథ్‌, డివైఇఒ  గుణభూషణ్‌రెడ్డి, సూపరింటెండెంట్‌  గురురాజస్వామి, ఇతర అధికారులు పాల్గొన్నారు.