మహా కుంభమేళాలో తిరుమల శ్రీవారి ఆలయం !

J.SURENDER KUMAR,

ప్రయాగ్‌ రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శ్రీవేంకటేశ్వర ఆలయానికి భక్తులు బారులు తీరారు. మంగళవారం సాయంత్రానికి దాదాపు 7వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.


శ్రీవారి ఆలయంలో ఉదయం నిత్య కైంకర్యాల తరహాలో తిరుప్పావై సేవ, తోమలసేవ, కొలువు, సహస్ర నామార్చన నిర్వహించారు. స్వామివారికి నైవేద్యం సమర్పించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించి ప్రసాద వితరణ చేశారు.

సాయంత్రం 4 గంటలకు ప్రధాన ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వాహన మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ప్రతిరూప దేవతలకు ఊంజల్ సేవ నిర్వహించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన భక్తులు హాజరై స్వామివారి వైభవాన్ని తిలకించి పులకించిపోయారు.

👉కియోస్క్ మెషిన్

ఆలయ ప్రాంగణంలో భక్తులు కానుకలు సమర్పించేందుకు కియోస్క్ యంత్రాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు QR కోడ్‌ని స్కాన్ చేసి, ₹.1 నుండి .₹ 99,999 వరకు TTDకి విరాళంగా ఇవ్వవచ్చు.

జనవరి 18న శ్రీవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి  శ్రీరామ్ రఘునాథ్, ఎస్టేట్ అధికారి  గుణ భూషణ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.