👉 అయ్యప్ప శరణు ఘోషలతో ప్రతిధ్వనించిన శబరిమలై కొండ !
J.SURENDER KUMAR,
మండల రోజులపాటు కఠోరదీక్ష నియమాలు పాటించి న అయ్యప్ప స్వాములు మంగళవారం సాయంత్రం శబరిమల లో మకర జ్యోతి దర్శించుకుని తన్మయత్నం చెందారు. స్వామియే శరణమయ్యప్ప, శరణు ఘోషలతో శబరిమలై కొండలు ప్రతి ధ్వనించాయి. సాయంత్రం 6:43 – 6-45 గంటలకు మకరజ్యోతి అగుపించడంతో భక్తులు పరవశించిపోయారు.
పందల ఆభరణాలతో వచ్చిన ఊరేగింపును శబరిమల కార్యనిర్వహణాధికారి బి. మురారిబాబు ఘనంగా స్వాగతించి ఆలయం వైపుకు తీసుకెళ్లారు.
ఊరేగింపును తిలకించేందుకు కేరళ దేవస్వం మంత్రి వీఎన్ వాసవన్, తమిళనాడు దేవస్వం మంత్రి పీకే శేఖర్ బాబు, ట్రావెన్‌కోర్ దేవస్వామ్ బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ తదితరులు హాజరయ్యారు.

తిరువాభరణాన్ని ప్రధాన అర్చకులు కందరారు రాజీవరు, అరుణ్‌కుమార్ నంబూతిరి ఆలయ గర్భగుడి వద్దకు ఊరేగింపు గా తీసుకెళ్లారు.. తదనంతర క్రతువులలో మహా దీపారాధన పొన్నంబల మేడు లో మకర జ్యోతి దర్శనమిచ్చాయి.
👉 రికార్డ్ స్థాయిలో భక్తుల రాక !

ఈ ఏడాది మకరవిళక్కు సీజన్‌లో శబరిమల పుణ్యక్షేత్రానికి రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. తీర్థయాత్ర ప్రారంభమైన నవంబర్ 15, 2024 నుండి, జనవరి 5, 2025 వరకు, మొత్తం 39,02,610 మంది భక్తులు ఆలయాన్ని సందర్శించారు. గత ఏడాది ఇదే కాలంలో వచ్చిన 35,12,691 మంది భక్తుల సంఖ్యతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగింది.
మకరవిళక్కు ఉత్సవాలు కొనసాగుతున్నందున భక్తుల రద్దీ పెరిగింది. మకరవిళక్కు సీజన్ అధికారికంగా ప్రారంభమైన డిసెంబర్ 30, 2024 నుండి, జనవరి 13, 2025 వరకు, దాదాపు 6,22,849 మంది భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. పండుగ చివరి రోజులలో వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.