J.SURENDER KUMAR,
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలలో పని చేస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ఇకపై నెల నెలా చెల్లించాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
👉 రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో 92,351 మంది ఉద్యోగులు పని చేస్తుండగా, వారికి ప్రతి నెలా ₹ 116 కోట్లు జీతాలు చెల్లించాల్సి ఉంది. వారందరికీ ప్రతి నెలా గ్రీన్ చానెల్ ద్వారా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
👉 పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పనులపై ముఖ్యమంత్రి మంత్రులు, ఉన్నతాధికారుల గురువారం సమావేశంలో సమీక్షించారు.
👉 మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం బిల్లులను తొందరగా చెల్లించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో దాదాపు 1.26 లక్షల ఉపాధి పనులు జరిగాయని, వీటికి సంబంధించిన మొత్తం బిల్లులను చెల్లించాలని చెప్పారు.
👉 కేంద్రం నుంచి పంచాయతీలకు విడుదలయ్యే నిధులు ఎప్పటికప్పుడు గ్రామాల అభివృద్ధికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉపాధి హామీ, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకాల ద్వారా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోపు రాబట్టుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.
👉 ఈ సమావేశంలో మంత్రులు ధనసరి సీతక్క గారు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు కే.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి కె.జానారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.