👉 555 గ్రాముల బంగారు బిస్కెట్లు,!
👉 100 గ్రాముల బంగారు నగలు, !
👉 157 గ్రాముల వెండి వస్తువులు,!
👉 విలువ ₹46 లక్షలు!
J.SURENDER KUMAR,
తిరుమల శ్రీవారి ఆలయం పరకామణిలో భక్తుల కానుకలను లెక్కించి నిల్వ చేసే ఓ కాంట్రాక్టు ఉద్యోగి చోరికి పాల్పడిన సంఘటనలో మంగళవారం అరెస్టు చేశారు .
దాదాపు ₹.46 లక్షల విలువైన బంగారం, వెండి వస్తువులను చోరీకి పాల్పడ్డాడు. నిందితుడు వీరేశెట్టి పెంచలయ్య పలుమార్లు దొంగతనాలకు పాల్పడినట్లు ఒప్పుకున్నట్లు సమాచారం.
తిరుపతిలోని కొర్లగుంట మారుతీనగర్‌కు చెందిన పెంచలయ్య అగ్రిగోస్ కంపెనీ ద్వారా రెండేళ్లుగా పరకామణిలో ఉద్యోగం చేస్తున్నాడు. పరకామణి నిల్వ గదిలో నిల్వ చేసిన బంగారం మరియు ఇతర విలువైన వస్తువులను స్మగ్లింగ్ చేయడం ప్రారంభించాడు. 100 గ్రాముల బంగారు బిస్కెట్లను ట్రాలీ పైపులో దాచి చోరీకి యత్నించగా చివరికి పట్టుబడ్డాడు.

పోలీస్ అధికారుల కథనం మేరకు గత శనివారం, పెంచలయ్య 100 గ్రాముల బంగారు బిస్కెట్లను దొంగిలించి, ట్రాలీలోని పైపులలో దాచడానికి ప్రయత్నించి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నగదు, విలువైన వస్తువులను రవాణా చేసే పనిలో ఉన్న పెంచలయ్య.. పరకామణి భవనంలోని మొదటి అంతస్తు నుంచి పై అంతస్తు వరకు ట్రాలీలో సరుకులు తరలిస్తుండగా బంగారు వస్తువులు ఉన్న ట్రే దొరికింది. విజిలెన్స్ సిబ్బంది తనిఖీల్లో దాచిన బంగారు బిస్కెట్లను గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా దొంగతనం జరిగినట్లు నిర్ధారించి, పెంచలయ్యను తిరుమల పోలీసులకు అప్పగించారు.
విజిలెన్స్ సిబ్బంది ఫిర్యాదు మేరకు తిరుమల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో పెంచలయ్య ఇంతకు ముందు దొంగతనాలను చేసినట్టు ఒప్పుకున్నట్టు సమాచారం.
555 గ్రాముల బంగారు బిస్కెట్లు, 100 గ్రాముల బంగారు నగలు, 157 గ్రాముల వెండి వస్తువులు, మొత్తం విలువ ₹.46 లక్షలు ఉంటుందని అధికారులు గుర్తించారు.