👉 ధర్మపురికి మంజూరైన నవోదయ మార్చడం ఎందుకో ?
👉 ఎంపీ ఎన్నికల్లో ధర్మపురి సెగ్మెంట్ లో బిజెపికే మెజార్టీ ఓట్లు !
👉 నాడు నవోదయ మంజూరు తో బిజెపి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం !
J.SURENDER KUMAR,
ధర్మపురి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ క్యాడర్ లో కలవరం మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ధర్మపురి సెగ్మెంట్ కు మంజూరు చేసిన నవోదయ విద్యా సంస్థను మార్చాలి అంటూ నిజాంబాద్ పార్లమెంట్ సభ్యుడు అరవింద్ సీఎం కార్యాలయానికి లేఖ రాయడంతో ఆయన ఆంతర్యం ఏమిటో అంతుపట్టక ధర్మపురి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ క్యాడర్ లో అయోమయం నెలకొంది. నవోదయ విద్యాసంస్థ మార్పు అంశం పట్ల నియోజకవర్గంలో పలువురిలో పలు రకాల చర్చకు అవకాశం ఇచ్చింది.
నిరుద్యోగ యువతీ యువకులలో, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని, బిజెపి పాలన పట్ల ఆదరణ పెరుగుతున్న తరుణంలో నవోదయ విద్యాసంస్థ మార్పు అంశం క్యాడర్ లో కలకలం సృష్టించిందని చెప్పవచ్చు.
2003. డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి. సీట్టింగ్ మంత్రి కొప్పుల ఈశ్వర్ పై ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, దాదాపు 22 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించాడు. ఈ ఎన్నికల్లో బిజెపి ఎంఎల్ఏ అభ్యర్థి కి 10 వేల లోపు ఓట్లు వచ్చాయి.
పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ ల లో ధర్మపురి , పెద్దపల్లి, రామగుండం, మంథని, చెన్నూర్, మంచిర్యాల్, బెల్లంపల్లి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మెజార్టీ ఓట్లతో ఘన విజయం సాధించారు.
2024 లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి ఎంపీ గా గడ్డం వంశీకృష్ణ, కాంగ్రెస్ అభ్యర్థిగా 4,75,587 ఓట్లు తో విజయం సాధించాడు. బిజెపి అభ్యర్థి గోమాసా శ్రీనివాస్ కు 3,44,223 ఓట్లతో ద్వితీయ స్థానంలో, టిఆర్ఎస్ అభ్యర్థి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ కు 1,93,356 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు.
ప్రత్యేకంగా ఒక్క ధర్మపురి అసెంబ్లీ పరిధిలో బిజెపి ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ కు 22 వేల కు పైగా ఓట్ల మెజార్టీ సాధించి మొదటి స్థానంలో, ఎంపీగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఓట్ల సాధనలో రెండో స్థానంలో నిలిచాడు. నియోజకవర్గంలో బిజెపి క్యాడర్ బలపడుతూ, ఎమ్మెల్సీ, మున్సిపల్ , స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ సత్తా ను చూపించాలని క్యాడర్ ఆశిస్తున్న తరుణంలో నవోదయ విద్యాసంస్థ మార్పు అంశం బిజెపి పాలిట శాపంగా మారనున్నదనే చర్చ మొదలైంది.
👉 రాష్ట్ర జాతీయ నాయకులకు పుట్టినిల్లు ధర్మపురి !
బిజెపి జాతీయ, రాష్ట్ర నాయకత్వంతో రాజకీయ సంబంధాలు కలిగి ఉన్న కీలక నాయకులకు ధర్మపురి కి చెందిన వారే కావడం ప్రస్తావహనారం !
👉 గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ నాయకుడు, మురళీధర్ రావు కు గత దశాబ్ద కాలంగా ధర్మపురి సెగ్మెంట్తో వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ గోశాల నిర్మాణం కోసం నేను సైతం కొనుగోలు చేశారు.
👉రాష్ట్ర బిజెపి పార్టీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్, ధర్మపురి వాసి 2013 లో బిహెచ్ఎల్ తన మేనేజర్ ఉద్యోగానికి రాజీనామా చేసి మోడీ, అమిత్ షా, మిషన్ లో సోషల్ మీడియా ఐటి టీమ్ లీడర్ గా చేరాడు. మోడీ ప్రధానిగా తొలిసారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అమర్నాథ్ కు ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ప్రత్యేక ఆహ్వానం పంపించారు.. ప్రస్తుతం బిజెపి జాతీయ సమీక్ష సమావేశాలలో అమర్నాథ్ పాల్గొంటాడు.

👉డి. రామ సుధాకర్ రావు, బిజెపి పార్టీ రాష్ట్ర. స్థాయి నాయకుడు, 2018, 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, ఆదిలాబాద్ సెగ్మెంట్ బిజెపి ఇన్చార్జ్.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ అరవింద్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన కోరుట్ల అసెంబ్లీ కి రామ సుధాకర్ రావు ఇంచార్జ్.
👉కరీంనగర్ ఎంపీ కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కి ధర్మపురి సెగ్మెంట్ లో బంధుత్వం ఉంది. నామినేషన్ సందర్భంగా ముహూర్తాలు పెట్టేది , మహాశక్తి ఆలయంలో అర్చకులు వేద పండితులు కొరిడే శ్రీనివాస్, శ్రీధర్ ధర్మపురి వాసులు.
దీనికి తోడు ధర్మపురి నియోజకవర్గానికి నవోదయ విద్యాసంస్థ మంజూరు చేసింది మా బిజెపి ప్రభుత్వం అంటూ పట్టణ బిజెపి క్యాడర్ సోషల్ మీడియాలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు , బండి సంజయ్ నిజామాబాద్ ఎంపీ అరవింద్ ఇంచార్జ్ కన్నం అంజయ్య ఫోటోలతో ప్రచారం చేశారు. నవోదయ విద్యాసంస్థ తరలింపు యత్నం అంశంలో యువతకు ఏలా వివరించాలో అర్థం కాక క్యాడర్ అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు.

నవోదయ అంశంలో ఈ ప్రాంత నాయకులు ఎంపీ అరవింద్ తో సంప్రదింపులు జరిపి తిరిగి ధర్మపరికే కేటాయింప చేస్తారో ? లేదో ? భవిష్యత్తులో తెలుస్తుంది.
👉 ఉత్తర ప్రత్యుత్తరాలు బహిరంగమే !
ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామంలో నవోదయ విద్యా సంస్థ ఏర్పాటు కు జగిత్యాల జిల్లా కలెక్టర్ తేదీ 24-07-2024, లేఖ సంఖ్య E1/532, ద్వారా ప్రిన్సిపాల్ సెక్రటరీ విద్యాశాఖకు రాసిన లేఖ లో ఈ జిల్లాలో నవోదయ విద్యాసంస్థ ప్రస్తుతం లేదని త్వరగా ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

👉 తెలంగాణ ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రటరీ లేఖ సంఖ్య 767/Prog.11/A2/2021 – తేదీ 22/08/2024 ద్వారా నవోదయ విద్యాసంస్థ కమిషనర్ ఉత్తరప్రదేశ్ కు లేఖ రాశారు.
👉 జగిత్యాల జిల్లా కలెక్టర్ లేఖ సంఖ్య E1/532/2022, తేదీ 24-01- 2025 రానున్న విద్య సంవత్సరం లో నవోదయ పాఠశాల నిర్వహణకు నూతనంగా నిర్మితమైన గిరిజన రెసిడెన్షియల్ భవనము తాత్కాలికంగా వినియోగించుకొనుటకు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కు లేఖ రాశారు. భవనం నక్ష ను సైతం జతపరిచారు.
👉 నవోదయ విద్యా సంస్థ భవన నిర్మాణమునకు ధర్మపురి మండలం నేరెళ్ల గ్రామ శివారులో జాతీయ రహదారి 63 ఆనుకొని ప్రభుత్వం ఉచితంగా సర్వేనెంబర్ 252 లో 30 ( ముప్పది ) ఎకరాల భూమి కేటాయించినట్టు. ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు.
గత కొన్ని నెలలుగా ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి జరిగిన అధికారిక ప్రత్యుత్తరాలు బహిరంగంగా జరిగినవే.

👉 ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ఆవేదన !

తన ఎస్సీ నియోజకవర్గమైన ధర్మపురి ని. ఎడ్యుకేషన్ హబ్ గా తీర్చిదిద్దడం కోసం. ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కొన్ని సంవత్సరాల పాటు మూతపడిన తెలుగు కళాశాలను ప్రారంభించారు. బీ ఆర్ఎస్ ప్రభుత్వంలో లెక్చరర్లకు జీతాలు చెల్లించలేక మూసివేసిన ఆరు దశాబ్దాల చరిత్ర గల ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ సంస్కృతాంధ్ర కళాశాలను ప్రభుత్వం ద్వారా లక్షలాది రూపాయల నిధులు మంజూరు చేయించి. బోధన సిబ్బందిని నియమించి గత విద్యా సంవత్సరం నుంచి కళాశాలను పున ప్రారంభించారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నవోదయ విద్యాసంస్థ ఏర్పాటు సమయంలో నిజాంబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ , ఈ సంస్థను ఇతర ప్రాంతానికి మార్చవలసిందిగా సీఎం కార్యాలయానికి లేఖ ఇవ్వడం పట్ల సోమవారం మీడియా సమావేశంలో లక్ష్మణ్ కుమార్ 80% గ్రామీణ నియోజకవర్గమైన గ్రామీణ విద్యార్థులకు నవోదయను తరలించి అన్యాయం చేయవద్దని ఎంపీ ని ఆవేదనతో వేడుకున్నారు. .
👉మంగళవారం ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి ఎంపీ అరవింద్, కేంద్రమంత్రి ధర్మేందర్ ప్రధాన్ ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తో కలసి తరలింపు ఆలోచన విరమించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
👉 జగిత్యాల జిల్లాలో 74% గ్రామీణ జనాభా !
జగిత్యాల జిల్లాలో 3 రెవెన్యూ డివిజన్, కేంద్రాలు, 20 రెవెన్యూ మండలాలు, ఐదు మున్సిపాలిటీలు ఉన్నాయి.
👉 2011 జనాభా లెక్కల ప్రకారం 2024 నాటి కి జిల్లాలో 11 లక్షలకు పైగా ( పదకొండు లక్షలకు పైగా ) జనాభా ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో 74% గ్రామీణ జనాభా కాగా, అక్షరాస్యులు సంఖ్య 60% మంది. పట్టణ ప్రాంత జనాభా 26% కాగా 74% గ్రామీణ జనాభా లో మొత్తం ఎస్సీ, ఎస్టీ జనాభా 25% , 2 లక్షలకు పైగా ఉన్నారు .
👉 5-9 సంవత్సరాల వయసు వాళ్ళు 5.50,%.
👉10-14 సంవత్సరాల వయసు వాళ్ళు 5.75%
👉15,- 19 సంవత్సరాల వయస్సు వారు 5.30% వారు ఉన్నట్టు ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
జిల్లాలో నక్సల్స్ ప్రభావిత గ్రామాలు అనేకం ఉన్నాయి. జీవనోపాధికి గల్ఫ్ దేశాలకు వెళ్లే కార్మికుల సంఖ్య వ్యవసాయ కూలీలు, రైతులు అధికం ఈ ప్రాంత విద్యార్థులు, నవోదయ ప్రవేశ పరీక్షలలో ఉత్తీర్ణులై సీటు సాధించిన. కరీంనగర్, మంచిర్యాల్, నిజాంబాద్ జిల్లాలో ఉన్న నవోదయ లో విద్యాభ్యాసం చేయడానికి ఆర్థికపరమైన ఇబ్బందులు అనేకం.
👉 మెరిట్ ఆధారంగానే సీట్ల కేటాయింపు!
ఈ విద్యాసంస్థలో 80% గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సీట్లను కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల కాలం క్రితం రిజర్వ్ చేసింది. పట్టణ ప్రాంతా విద్యార్థులకు 20 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి తరగతికి 40 విద్యార్థులు రెండు సెక్షన్ లో ఉంటాయి. ఇందులో ఇంటర్మీడియట్ విద్య వరకు భోజనం వసతి, పాఠ్య పుస్తకాలు ప్రభుత్వమే ఉచితంగా అందిస్తుంది. ప్రిన్సిపాల్
బోధన బోధనేతర ఇతర ఉద్యోగుల నియామకాలు, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే జరుగుతాయి. విద్యార్థుల ప్రవేశ పరీక్ష నిర్వహణ ఎంపిక వారిదే. జిల్లా కలెక్టర్ నవోదయ విద్యా కేంద్రానికి చైర్మన్ గా కొనసాగుతారు. ఈ సంస్థలో ఉద్యోగులు నియామకాలు, విద్యార్థుల ప్రవేశాలలో ఎంపీ, ఎమ్మెల్యే, మంత్రుల రాజకీయ పైరవీలు జోక్యం ఉండవు. అయితే విద్యాసంస్థ మార్పుకు ఎంపీ అరవింద్ సీఎం కార్యాలయానికి లేఖ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో ? అంతు పట్టని మిస్టరీ.
👉 డైనమిక్ ఎంపీగా గుర్తింపు!
ఎంపీ ధర్మపురి అరవింద్ కు రాష్ట్రంలో, కేంద్రంలో డైనమిక్ యువ ఎంపీగా గుర్తింపు ఉంది. సిట్టింగ్ ఎంపి ,సీఎం కూతురు కల్వకుంట్ల కవిత పై భారీ ఓట్ల మెజార్టీతో గెలిచిన గుర్తింపుతో పాటు, 2024 లోను ఎంపీగా విజయం సాధించిన డైనమిక్ పార్లమెంటేరియన్ గా గుర్తింపు ఉంది. పసుపు బోర్డు సాధించడంతోపాటు రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టు చర్చ.
ఇంతటి పరిపక్వత గల యువ ఎంపీ అరవింద్ ఎస్సీ రిజర్వుడ్ ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం కు కేంద్రం కేటాయించిన నవోదయ విద్యా సంస్థ ఇతర ప్రాంతానికి తరలించడానికి లేఖ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటో ? అంతు పట్టని మిస్టరీ నెలకొంది.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఏ పథకమైన ఆయా అధికార పార్టీ ఎంపీలకే వాటిపై నిర్ణయ అధికారం, స్వేచ్ఛ ఉంటాయి. ఇందులో ఎంపీల అధికారాన్ని, స్వేచ్ఛను ప్రశ్నించే అధికారం సహజంగా ఎవరికి ఉండదు, అనేది జగమెరిగిన సత్యం.
అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, గత పార్లమెంట్ ఎన్నికల్లో ధర్మపురి అసెంబ్లీ సెగ్మెంట్ లో బిజెపి అభ్యర్థికి మెజార్టీ ఓట్లు పోల్ కావడం, 2028 లో జరగనున్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన రాజకీయ నేపథ్యంలో ఎంపీ ధర్మపురి అరవింద్, నవోదయ విద్యా సంస్థ తిరిగి ధర్మపురి కి కేటాయించాలి అని లేఖ రాస్తాడో ? స్థానిక బిజెపి క్యాడర్ జోక్యం చేసుకొని విద్యా సంస్థ ఇక్కడే కొనసాగేలా చర్యలు చేపడతారో.? వేచి చూడాల్సిందే !