ఫిబ్రవరి 4 “సామాజిక న్యాయ దినోత్సవం” సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


బడుగు బలహీన వర్గాలు, దళితులు, మైనారిటీ వర్గాల్లో దశాబ్దాల కాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు తెలంగాణ మంత్రివర్గం, శాసనసభ శాశ్వత పరిష్కారం చూపించడంలో ప్రాముఖ్యత కలిగిన ఫిబ్రవరి 4 వ తేదీని గుర్తు చేసుకోవడానికి ప్రతి ఏటా ఆరోజున “సామాజిక న్యాయ దినోత్సవం” గా జరుపుకోవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నిర్ణయించారు.

👉 సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024), షెడ్యుల్డ్ కులాల ప్రత్యేక వర్గాల ఉప వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు.

👉 తెలంగాణ చరిత్రలో ఫిబ్రవరి 4 వ తేదీకి అత్యంత ప్రాధాన్యత ఉంది. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని 4 ఫిబ్రవరి 2024 రోజున మంత్రివర్గంలో ఆమోదించుకున్న తర్వాత, సర్వే నివేదికను ఫిబ్రవరి 4 వ తేదీన తిరిగి మంత్రివర్గం ఆమోదించుకోవడం, అలాగే ఇదే రోజున ఎస్సీ ఉపకులాల్లో కీలకమైన ఏ, బీ, సీ కేటగిరీలుగా వర్గీకరణ చేసుకున్న నేపథ్యంలో ఫిబ్రవరి 4 వ తేదీకి ఉన్న ప్రాధాన్యతను గుర్తుచేసుకోవడానికి సామాజిక న్యాయ దినంగా నిర్వహించుకోవాలని చెప్పారు.

👉 బడుగు బలహీన, దళిత, మైనారిటీ వర్గాలకు దశాబ్దాల కాలం అపరిష్కృతంగా ఉన్న సమస్యకు మంత్రిమండలితో పాటు శాసనసభ శాశ్వత పరిష్కారం చూపించిన శుభదినం అయినందున ఫిబ్రవరి 4 న సామాజిక న్యాయ దినంగా పాటిస్తూ అందరం అందులో పాల్గొనాలి.

👉 ఈ రెండు అంశాలు కార్యాచరణలోకి రావడంలో మంత్రివర్గ సహచరులు, మంత్రివర్గ ఉపసంఘం, ఉన్నతాధికారులు ఎంతో శ్రమించి కట్టుదిట్టమైన ప్రణాళికతో వాటికి ఒక చట్టబద్ధత కల్పించే కార్యక్రమాన్ని తీసుకొచ్చినందుకు వారందరికీ అభినందనలు. సభలో ఈ అంశాలపై స్పీకర్ గారితో పాటు చర్చలో పాల్గొన్న మంత్రివర్గ సహచరులతో పాటు ప్రతిపక్ష, అధికార సభ్యులకు ధన్వవాదాలు. సభ్యులందరూ విజ్ఞతను ప్రదర్శించి ఈ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపించారు.

👉 ఎస్సీ ఉప కులాల వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం జీవోలు ఇవ్వడమే కాకుండా దీనికి చట్టంగా రూపకల్పన చేయాలనుకుంటున్నాం. భవిష్యత్తులో ఎవరూ దీన్ని మళ్లీ ప్రశ్నించకుండా అమలు చేసే క్రమంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే చట్టబద్ధత కల్పించాలి. తొందరలోనే జీవోల రూపంలో చట్టం రూపంలో తీసుకొచ్చి ఇది సంపూర్ణంగా అమలు చేసి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించాలని అనుకుంటున్నాం.

👉 ఈ సమస్య పరిష్కారానికి జరిగిన పోరాటంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నా. వారి త్యాగం వృధా పోదు. వారు ఏ లక్ష్యం కోసమైతే కొట్లాడారో అది నెరవేర్చే విధానాన్ని అమలు చేస్తున్నాం.

👉 ఈ ప్రభుత్వం కచ్చితంగా ప్రజల అభిప్రాయాలకు తొలి ప్రాధాన్యత ఇస్తుంది. రాష్ట్రంలో అమలు చేయడమే కాకుండా దేశంలో జనాభా లెక్కలు సమయంలో అందులో కుల గణన అంశాన్ని చేర్చాలని కేంద్ర ప్రభుత్వంపైన ఒత్తిడి తెస్తాం.

👉 ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా నిలుస్తుంది. బలహీన వర్గాలకు సంబంధించిన కులగణన విషయంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో మాల మాదిగ ఉపకులాల వర్గీకరణ అమలు చేయడానికి అవసరమైన సహకారాన్ని అందిస్తాం.