హైదరాబాద్ ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ 15 వేల కోట్ల పెట్టుబడి !


J.SURENDER KUMAR,


మైక్రోసాఫ్ట్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వ భాగస్వామ్యంతో హైదరాబాద్ లో ఏఐ సిటీలో మైక్రోసాఫ్ట్ సరికొత్త ఏఐ సెంటర్ ను ఏర్పాటు చేస్తుంది. అలాగే, ఏఐ రంగంలో కొత్తగా .₹ 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్టు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది.

ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ గచ్చీబౌలిలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన కొత్త క్యాంపస్ భవనాన్ని గురువారం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త భవనం ప్రారంభించారు. 11 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అధునాతన ప్రమాణాలతో నిర్మించిన ఈ భవనంలో 2,500 మంది ఉద్యోగులు పనిచేయడానికి వీలుంది.


👉 హైదరాబాద్ AI City లో ఏఐ సెంటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో రాష్ట్రంలోని 1.2 లక్షల మందికి పైగా అర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌లో శిక్షణను అందించేందుకు మూడు కొత్త కార్యక్రమాలను మైక్రోసాఫ్ట్ చేపడుతుంది.

👉 అడ్వాంటేజ్ తెలంగాణ (ADVANTA(I)GE TELANGANA) కార్యక్రమం కింద రాష్ట్రంలోని 500 ప్రభుత్వ పాఠశాలల్లో AI కోర్సును పరిచయం చేసేందుకు మైక్రోసాఫ్ట్ AI ఫౌండేషన్స్ అకాడమీ ప్రారంభిస్తుంది. దీని ద్వారా దాదాపు 50 వేల మందికి విద్యార్థులకు శిక్షణనిస్తుంది.

👉 AI – ఇండస్ట్రీ ప్రో పేరుతో మరో కార్యక్రమాన్ని చేపడుతుంది. రాష్ట్రమంతటా 20,000 మంది పరిశ్రమల నిపుణులకు నైపుణ్యాలను మెరుగుపరిచే శిక్షణనిస్తుంది.

👉 AI-CoE ని ఏర్పాటు చేసి AI-గవర్న్ ఇనిషియేటివ్ పేరుతో రాష్ట్రంలోని దాదాపు 50 వేల మంది ప్రభుత్వ అధికారులకు AI, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ప్రొడక్టివిటీ వంటి కీలకమైన రంగాలలో శిక్షణ ఇస్తుంది.

👉 అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో హైపర్‌ స్కేల్ AI డేటా సెంటర్లలో తన పెట్టుబడులను రెట్టింపు చేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. రాబోయే సంవత్సరాల్లో వీటికి అదనంగా ₹ 15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది.

👉 భవిష్యత్తు అంతా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వైపు పయనిస్తున్న సందర్భంలో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కొత్త ఫెసిలిటీ సెంటర్ ఏర్పాటు చేయడం అందరికీ గర్వకారణమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అన్నారు. ఈ విస్తరణతో యువతకు మరిన్ని ఉద్యోగాలు లభించడమే కాకుండా మరింత సాధికారత కల్పిస్తుందని చెప్పారు.

👉 మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల గత జనవరిలో హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ముఖ్యమంత్రి జరిపిన చర్చల ఫలితంగా తాజా ఎంఓయూ కుదిరింది. దీని ప్రకారం ప్రభుత్వ IT మరియు క్లౌడ్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి, AI ద్వారా సేవలను విస్తృతం చేయడంలో మైక్రోసాఫ్ట్ పనిచేస్తుంది.

👉 “మైక్రోసాఫ్ట్‌కు నాయకత్వానికి అభినందనలు. హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌కు మధ్య విడదీయలేని సుదీర్ఘ అనుబంధం ఉంది. హైదరాబాద్‌లో కొత్త ఫెసిలిటీని ప్రారంభించడం మనందరికీ గర్వకారణం. హైదరాబాద్‌తో కలిసి చేస్తున్న ప్రయాణంలో ఇదొక మైలురాయిగా నిలుస్తుంది

.

👉 హైదరాబాద్ నేడు ప్రపంచంలోనే టెక్నాలజీ పవర్ హౌస్‌గా, సరికొత్త ఆవిష్కరణలకు, ప్రపంచ ప్రతిభను ఆకర్షించే నగరంగా మారింది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంతో భవిష్యత్తు మరింత ఉన్నతంగా ఉంటుంది. తెలంగాణపై నమ్మకం ఉంచిన మైక్రోసాఫ్ట్ నాయకత్వానికి ధన్యవాదాలు. మైక్రోసాఫ్ట్ నిబద్ధత తెలంగాణ రైజింగ్ విజన్‌కు తోడవుతుంది” అని ముఖ్యమంత్రి అన్నారు.

👉 ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు తో పాటు పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ , మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌ మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కుమార్ ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.