👉 పీఓలు, ఏపీఓల శిక్షణ తరగతులలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
నిజామాబాద్, కరీంనగర్, మెదక్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో కూడిన ఉపాధ్యాయ, పట్టభద్రుల శాసన మండలి ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ పై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ నోడల్ అధికారులకు సూచించారు.
👉 ఎలాంటి సందేహాలు ఉన్నా, శిక్షణ తరగతుల్లో మాస్టర్ ట్రైనర్లను అడిగి నివృత్తి చేసుకోవాలని హితవు పలికారు. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రిసైడింగ్ అధికారులు, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఓపీఓలకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో శనివారం మొదటి విడుత శిక్షణ తరగతులను నిర్వహించారు.
👉 ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం మార్గదర్శకాలు, నిబంధనలకు సంబంధించిన ప్రతి ఒక్క అంశాన్ని తెలుసుకోవాలని సూచించారు. ప్రధానంగా అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పోలిస్తే, శాసన మండలి ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొంత భిన్నంగా ఉంటుందని తెలిపారు.
👉 బ్యాలెట్ పద్ధతిన జరిగే ఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో ఓటింగ్ నిర్వహణకు కొంత ఎక్కువ వ్యవధి పట్టే అవకాశాలు ఉన్నందున ఓపిగ్గా, సంయమనంతో వ్యవహరిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.

👉 27వ తేదీన ఉదయం 8.00 గంటల నుంచి సాయంత్రం 4.00 గంటల వరకు పోలింగ్ సమయం ఉంటుందని గడువులోపు పోలింగ్ కేంద్రం పరిధిలో క్యూ లైన్ లో ఉన్న వారికి టోకెన్ నెంబర్లు అందించి ఓటింగ్ చేయించాలని ఆదేశించారు.
👉 ఈ నెల 26వ తేదీన ఉదయం 8.00 గంటలకు ప్రిసైడింగ్ అధికారులు తమ బృందంతో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు చేరుకోవాలని సూచించారు.
👉 పోలింగ్ సామగ్రి, బ్యాలెట్ బాక్సులను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని, చెక్ లిస్ట్కు అనుగుణంగా మెటీరియల్ అంతా ఉందా ? లేదా సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.
👉 అధికార యంత్రాంగం సమకూర్చిన వాహనంలోనే పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
👉 ఏ చిన్న తప్పిదానికి కూడా తావు లేకుండా పూర్తి పారదర్శకంగా, స్వేచ్చాయుత వాతావరణంలో పోలింగ్ జరిగేలా సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని హితవు పలికారు.
👉 నిర్లక్ష్యానికి తావిస్తూ, తప్పిదాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
👉 డిస్ట్రిబ్యూషన్ రోజు బ్యాలెట్ బాక్సులు తీసుకొని, పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కరీంనగర్ లోని రిసెప్షన్ సెంటర్ లో అప్పగించాల్సిన బాధ్యత ప్రిసైడింగ్ అధికారులదేనని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులను పీఓలు తమ పర్యవేక్షణలో ఉంచాలని జాగ్రత్తలు సూచించారు.
👉 ఓటర్లు, అభ్యర్థుల ఏజెంట్లు వివిధ అంశాలపై సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత పీఓలదేనని స్పష్టం చేశారు.
👉 పోలింగ్ అనంతరం పక్కాగా రికార్డు బుక్కులలో వివరాలను పొందుపరుస్తూ నివేదిక తయారు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా పీఓలు, ఏపీఓలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిర్వర్తించాల్సిన బాధ్యతలపై మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి ఎస్ లత, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.