👉 నక్సల్స్ భావ జాలంకు చెక్ !
J.SURENDER KUMAR,
కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో కొనసాగనున్న
నవోదయ విద్యా సంస్థ ధర్మపురి మండలం
నేరెళ్ల గ్రామాన్ని ఎంపిక ఉద్దేశం భవిష్యత్ లో
ఈ ప్రాంత యువత వామపక్ష తీవ్రవాద
భావజాలం వైపు ఆకర్షితులు కాకుండా
ఉండేందుకు జిల్లా అధికార యంత్రాంగం
ఆచితూచి ఎంపిక చేసినట్టు సమాచారం.
గత కొన్ని రోజులుగా నవోదయ విద్యాసంస్థ ఎంపిక స్థలం మార్చాల్సిందిగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్యమంత్రి కార్యాలయానికి లేఖ ఇచ్చాడని, స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్, మీడియా సమావేశంలో ఆరోపించడం. ఢిల్లీకి వెళ్లి ఎంపీ అరవింద్, సంబంధిత శాఖ కేంద్ర మంత్రి ధర్మేందర్ ప్రధాన్ ను కలిసి నవోదయ విద్యా సంస్థ మార్చవద్దని విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే.
అయితే నవోదయ విద్యా సంస్థ, ఏర్పాటు, తరలింపు రాజకీయ రంగు పులుముకోవడం తోపాటు, నేరెళ్ల గ్రామం పై చర్చ మొదలైంది.
👉 నేరెళ్ల గ్రామ ఎంపిక లో..
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్ల గతంలో నక్సల్స్ ప్రభావిత గ్రామం, పీపుల్స్ వార్ వ్యవస్థాపకుడు కొండపల్లి సీతారామయ్య సహచరులలో గతంలో ఒకరు ఈ గ్రామస్తుడు. 63 జాతీయ రహదారి ఆనుకొని ఉన్న ఈ గ్రామానికి పడమర, ఉత్తర, దక్షిణ దిశలలో ఎత్తైన కొండలు, రిజర్వ్ ఫారెస్ట్ కలిగి ఉంటాయి. గతంలో నక్సల్స్ అగ్రనాయకుడు గణపతి స్వగ్రామం బీర్పూర్, సారంగాపూర్, బుగ్గారం మండలలా పరిధి నేరెళ్ల గ్రామానికి సరిహద్దులు.

👉 నేరెళ్ల మందు పాతర మారణ హోమంలో.. నలుగురు కానిస్టేబుల్ బలి !
నక్సల్స్ ఆచూకీ కోసం కుబింగ్ నిర్వహిస్తున్న పోలీసుల బృందాన్ని నక్సల్స్ మందు పాతర పేల్చి హతమార్చారు. ఈ సంఘటనలో నలుగురు సాయుధ కానిస్టేబుల్ దుర్మరణం చెందింది నేరెళ్ల – బట్ట పల్లి రహదారి లోనే….
కొలువాయి గ్రామంలో నక్సల్స్ ఏర్పాటుచేసిన ప్రజా కోర్టు లో ఓ యువకుడిని కొట్టి చంపిన సంఘటనలో పోలీసులు అటవీ ప్రాంత గ్రామాల్లో 1993 అక్టోబర్ 12న కూబింగ్ చేపట్టారు. పోలీసులు కదలికలను గుర్తించిన నక్సలైట్లు మందు పాతర పేల్చడంతో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, కానిస్టేబుల్స్ రాజయ్య, ప్రకాష్, శ్రీనివాసులు శరీరాలు తునా తునకలయ్యాయి. కొందరు పోలీసులు గాయాలతో బయటపడ్డారు.
👉 మాజీ ఎస్పీ రమేష్ బాబు ఇల్లు దగ్ధం !
నక్సలైట్ల కార్యకలాపాల కట్టడిలో కీలక పాత్ర వహిస్తూ ఎస్సై నుంచి ఎస్పీ హోదా వరకు పదోన్నతులు ఉంది పదవి విరమణ చేసిన మాజీ ఎస్పీ మాదాసు రమేష్ బాబు స్వగ్రామం నేరెళ్ల. సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో రమేష్ బాబు కదలికలను రిక్కీ చేసి 1994 జూలై 14 రాత్రి ఆయన ఇంటిని నక్సలైట్ దళం చుట్టుముట్టింది. ఆ సమయంలో సీఐ రమేష్ బాబు లేకపోవడంతో నక్సలైట్లు ఇంటికి పెట్రోల్ పోసి దగ్ధం చేశారు.
👉 ఇద్దరికీ బుల్లెట్ గాయాలు ఒకరు మృతి !
రమేష్ బాబు ఇంటి దగ్ధం సమయంలో గ్రామంలో రహదారులపై నక్సలైట్లు సెంట్రీ పాయింట్ లు ఏర్పాటు చేసుకున్నారు. ఆ రాత్రి సమయంలో జగిత్యాల ఆస్పత్రి నుంచి నేరెళ్లకు చెందిన అనారోగ్య భారీన పడిన వ్యక్తిని వారి బంధువులు అద్దె జీపులో తెస్తున్నారు. పోలీస్ జీప్ గా భావించి నక్సల్స్ జీప్ పై కాల్పులు జరపడంతో జీప్ డ్రైవర్ ఎండి ఫాయిమ్, స్టీరింగ్ పైన మృతి చెందాడు. వెలుగొండ గ్రామానికి చెందిన వెంకటేశం కడుపులోకి బుల్లెట్ దూసుకు వెళ్ళింది.
👉 బిజెపి నాయకుడి పై కాల్పులు !
బిజెపి నాయకుడు నల్ల రవీందర్ ను దాదాపు 1990 – 91 సంవత్సరంలో పట్టపగలు నేరెళ్ల గ్రామంలో ఆయన ఇంట్లోకి చొరబడి నక్సలైట్లు కాల్పులు జరిపారు. బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న రవీందర్ ప్రాణ భయంతో మరో రాష్ట్రంలో తన బంధువుల వద్ద తలదాచుకుంటున్నాడు.
👉 పద్మక్క ఎన్ కౌంటర్ ఇక్కడే !
ఉత్తర తెలంగాణ స్పెషల్ జొన్ కమిటీ సభ్యురాలు, నిజామాబాద్, కరీంనగర్ జిల్లా కార్యదర్శి నాలకొండ రజిత, @ పద్మక్క ఎన్కౌంటర్ నేరెళ్ల శివారు సాంబశివుని గుట్టల్లో 2020 జులై మొదటి వారంలో జరిగింది. ఈ ఎన్కౌంటర్ లో పద్మక్క తోపాటు ప్లాటున్ కమాండర్ సాగర్, @ కనకయ్య తో పాటు మరో నలుగురు ప్లాటూన్ సభ్యులు హతమయ్యారు.
👉 జన జీవన స్రవంతిలోకి…
నేరెళ్ల గ్రామానికి చెందిన కొందరు దళ సభ్యులు సానుభూతిపరులు, మిలిటెంట్ లు చంద్రయ్య, అనిత, కొమురయ్య, రాజయ్య, వసంత ఆమె భర్త దళనాయకుడు తదితరులు. ప్రభుత్వానికి లొంగి జనజీవన స్రవంతిలో కొనసాగుతున్నారు.

👉 అజ్ఞాతవాసమా ? అరెస్టు చేశారా ?
హైదరాబాదులో విద్యాభ్యాసం చేస్తూ నేరెళ్ల గ్రామానికి చెందిన ఓ యువకుడు గత కొన్ని సంవత్సరాలు క్రితం నుంచి ఆగుపించడం లేదు.
పోలీసు నిఘా వర్గాలు మాత్రం యువకుడి కుటుంబ సభ్యుల కదలికలపై నిఘా ఉంచారు. గత రెండు సంవత్సరాల క్రితం ఆ యువకుడి ని ఖమ్మంలో అరెస్టు చేశారని, వరంగల్ జైల్లో ఉన్నాడు అనే చర్చ ఉంది. ఈ సంఘటనలు, తదితర అంశాల నేపథ్యంలో అధికార యంత్రాంగం నవోదయ విద్యాసంస్థ నేరెళ్ల గ్రామంలో ఏర్పాటు కు ఎంపిక చేసినట్టు చర్చ.
👉 మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు తీరు అభినందనీయం !
స్వర్గీయ దేవాదాయ శాఖ మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు, విద్యాసంస్థల ఏర్పాటుపై 2008 లో ఆయన తీసుకున్న నిర్ణయం తీరు పట్ల నేటికీ ఈ ప్రాంత ప్రజలు చర్చించుకుంటూ ఆయన తీరును అభినందిస్తుంటారు.
ఉమ్మడి రాష్ట్రం వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ప్రతి మండలానికి ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరు చేశారు. అప్పుడు బుగ్గారం అసెంబ్లీ నియోజకవర్గంలో సారంగాపూర్ మండలంలో, ( బీర్పూర్ గుట్ట కింది గ్రామాలు ) ఉండేవి. మండలం కేంద్రం కానీ బీర్పూర్ లో ( ప్రస్తుతం బీర్పూర్ మండల కేంద్రం ) జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని గుట్ట కింద గ్రామాల డిమాండ్. మండల కేంద్రమైన సారంగాపూర్ లోనే కాలేజ్ ఏర్పాటు చేయాలని అక్కడి గ్రామాల డిమాండ్.
ఈ నేపథ్యంలో స్వర్గీయ మాజీ మంత్రి రత్నాకర్ రావు, పరిస్థితిని అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి వివరించి రాజకీయ వివాదాలు తలెత్తకుండా సారంగాపూర్ మండలానికి రెండు కాలేజీలు మంజూరు చేయించారు. అందులో ఒకటి బీర్పూర్ లో ఏర్పాటు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకే మండలానికి రెండు జూనియర్ కళాశాలలను సాధించిన ఘనత రత్నాకర్ రావు కె దక్కింది అనే చర్చ నేటికీ జరుగుతోంది.
👉 ఎంపీ చొరువ తీసుకుంటే..
నిజామాబాద్ ఎంపీ అరవింద్ చొరవ తీసుకొని కేంద్ర ప్రభుత్వంతో చర్చించి జగిత్యాల జిల్లాకు మరో నవోదయ విద్యాసంస్థను మంజూరు చేయించగలిగితే రాజకీయ వివాదాల సమస్య భవిష్యత్తులో తలెత్తకుండా సమసిపోతుంది కాబోలు…