నైపుణ్య శిక్షణలో బహ్రెయిన్ కు సహకరిస్తాం మంత్రి శ్రీధర్ బాబు !

👉 భారత్ లో ఆదేశ రాయబారి కి మంత్రి హామీ !


J.SURENDER KUMAR,


స్కిల్స్ యూనివర్సిటీ, అంకుర సంస్థల ఆవిష్కరణ కేంద్రంగా ఉన్న టి హబ్, టి వర్క్స్ లాంటి సంస్థలను బహ్రెయిన్ లో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వపరంగా సంపూర్ణ సహకారం అందిస్తామని రాష్ట్ర ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భారత్ లో ఆదేశ రాయబారికి హామీ ఇచ్చారు


👉 మంగళవారం సచివాలయంలో తనను కలిసిన బహ్రెయిన్ రాయబారి అబ్దుల్ రహమాన్ అల్ గావుద్, బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు చేసిన వినతికి శ్రీధర్ బాబు స్పందించారు.


👉 ఈ సందర్భంగా తనను బహ్రెయిన్ పర్యటనకు రావాల్సిందిగా రాయబారి కోరడం పట్ల శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం సహకరిస్తే ఆ రెండు సంస్థలలాంటివి తమ దేశంలో కూడా ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు బహ్రెయిన్ ప్రతినిధి బృందం మంత్రిని కోరింది.


👉 తాము ఏర్పాటు చేసిన స్కిల్స్ యూనివర్సిటీని పరిశ్రమలే నిర్వహించి తమకు అవసరమైన నైపుణ్యంలో యువతకు శిక్షణ ఇస్తాయని శ్రీధర్ బాబు వారికి తెలిపారు.


👉 విద్యా సంస్థలకు, పరిశ్రమలకు మధ్య స్కిల్స్ యూనివర్సిటీ వారధిగా పనిచేస్తుందని శ్రీధర్ బాబు వెల్లడించారు.


👉 రాష్ట్రంలో ఏటా 2 లక్షల మందికి పైగా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు, లక్ష మంది వరకు సాధారణ గ్రాడ్యుయేట్లు చదువులు పూర్తి చేసుకుంటున్నారు. వీరందరు తమకు ఇష్టమైన రంగంలో శిక్షణ పొంది ఉపాధి అవకాశాలు పొందేలా స్కిల్స్ యూనివర్సిటీ సహకరిస్తుంది.


👉 ఈ తరహా ప్రయోగం దేశంలో మరే రాష్ట్రంలో జరగలేదు. సిఎం రేవంత్ రెడ్డి చొరవతో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేసాం. సింగపూర్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటిఇ) తో విద్యార్థుల మార్పిడి, బోధనాంశాలను ఇక్కడ ప్రవేశపెట్టడంపై ఒప్పందాలు చేసుకున్నాం’. స్కిల్స్ వర్సిటీలో 33 రంగాలకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.


👉 విద్య, ఆరోగ్య రంగాలపై తెలంగాణా ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేస్తోందని ఆయన తెలిపారు. బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ రంగాల్లో ఉన్న అవకాశాలపై పెట్టుబడులతో ముందుకు రావాలని ఆహ్వానించారు. ఫుడ్ ప్రాసెసింగ్ లో కూడా అపార అవకాశాలు ఉన్నాయని తెలిపారు.


👉 హైదరాబాద్ నైపుణ్యం ఉన్న ప్రతిభావంతుల కేంద్రమని శ్రీధర్ బాబు వివరించారు. ఇక్కడ మౌలిక సదుపాయాలకు కొదవలేదని ఆయన అన్నారు.‘ ప్రపంచ దేశాలకు సరఫరా అవుతున్న వ్యాక్సిన్లలో 40 శాతం హైదరాబాద్ లో తయారవుతున్నాయి.


👉 దేశంలో 33 శాతం జనరిక్ ఔషధాలు ఇక్కడే ఉత్పత్తి అవుతున్నాయి. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో ప్రయివేట్ రంగానికి అవకాశం కల్పించడం, ఇక్కడ రక్షణ రంగ పరిశోధన సంస్థలు ఉండటం కూడా కలిసి వచ్చిందని వెల్లడించారు.


👉 కృత్రిమ మేథలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో ఉంచేందుకు ప్రత్యేకంగా 200 ఎకరాల్లో ఏఐ సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టి హబ్, టి వర్క్స్ సిఇఓలు, స్కిల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తో వర్చువల్ కాన్ఫరెన్స్ కు ఏర్పాటు చేయిస్తానని బహ్రెయిన్ ప్రతినిధులకు హామీ ఇచ్చారు.


👉 సమావేశంలో బహ్రెయిన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షుడు మహ్మద్ అల్ కూహెజి, టిజిఐఐసి సిఇఓ మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.