👉ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి !
J.SURENDER KUMAR,
తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ అయిన హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపలి ఏరియా మొత్తాన్నీ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు, నగరవాసులకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టిన డ్రోన్ సర్వేను కోర్ అర్బన్ ఏరియా అంతటా నిర్వహించాలన్నారు.
నానక్‌రామ్‌గూడ లోని హెచ్ఎండీఏ కార్యాలయంలో గురువారం జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కోర్ అర్బన్ (Telangana Core Urbun) అభివృద్ధి అంశాలను ముఖ్యమంత్రి సమీక్షించారు. నగరంలో కొత్తగా మరో 7 ఫ్లైఓవర్లు నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు సూచనలు చేశారు.
👉 ప్రస్తుత, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు వీలుగా హైదరాబాద్ నగరంలో గృహాలు, మంచినీటి సరఫరా, విద్యుత్ సౌకర్యం, మురుగునీటి వ్యవస్థకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించాలి.
👉 Greater Hyderabad లో ట్రాఫిక్ నియంత్రణకు అవసరమైతే గూగుల్ సాంకేతిక సహకారాన్ని తీసుకుని వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలి.
👉 కోర్ అర్బన్ ప్రాంతంలో చెరువుల పునరుద్ధరణ, నాలాల విస్తరణకు ప్రణాళికలు రూపొందించాలి.
👉 ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రధానమైన మరో 7 కూడళ్లలో ఫ్లై ఓవర్ నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా భూసేకరణ, ఇతర పనులను పూర్తి చేసి, వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి.
👉 ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల సలహాదారు శ్రీనివాసరాజు , మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్ , గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఇలాంబర్తి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.