👉తెల్లవారుజామున తలుపు తట్టి లేపుతున్నాడు !
J.SURENDER KUMAR,
తెల్లవారుజామున పదవ తరగతి విద్యార్థి ఇంటికి జిల్లా కలెక్టర్ వెళ్లి ఇంటి తలుపులు తట్టి లేపి పరీక్షలు దగ్గర పడుతున్నాయి చదువుకోమని సున్నితంగా ప్రేమగా విద్యార్థికి చెప్పాడు.
కలెక్టర్ స్వయంగా తన ఇంటికి వచ్చి తలుపులు తట్టి నిద్రలేపి చదువుకోమని చెప్పడంతో ఆ విద్యార్థి తోపాటు తల్లి షాక్ కు గురి అయ్యారు .
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ తనతో పాటు జిల్లా అధికారులు.. ప్రభుత్వ హాస్టల్లో నిద్రించేందుకు హాస్టల్ నిద్ర కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. తాజాగా కలెక్టర్ హనుమంతరావు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పదవ తరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం వినూత్న కార్యక్రమాన్ని చేపట్టాలని భావించారు.
హాస్టల్ నిద్ర కార్యక్రమంలో భాగంగా రాత్రి సంస్థాన్ నారాయణపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ లో ఆయన నిద్రించారు. తెల్లవారు జామున ఐదున్నర గంటలకు ఎలాంటి సమాచారం లేకుండా కలెక్టర్ హనుమంతరావు మండలంలోని శేరి గూడెంలో పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఇంటి తలుపును తట్టి నిద్ర లేపారు. ఇంటి తలుపులు తీసిన విద్యార్థితో.. భరత్ చంద్ర చారి అంటూ తాను జిల్లా కలెక్టర్ నని హనుమంతరావు పరిచయం చేసుకున్నాడు.
దీంతో ఆ విద్యార్థి కలెక్టర్ ను చూసి అవాక్కయ్యాడు. భరత్ చంద్ర చారికి తండ్రి లేకపోవడంతో తల్లి కష్టపడి చదివిస్తోంది.
కుటుంబ ఆర్థిక స్థితిగతులు, పదవ తరగతి పరీక్షల కోసం ఎలా చదువుతున్నావని కలెక్టర్ అడిగి తెలుసు కున్నారు. పదవ తరగతి అనేది విద్యార్థికి మైలు రాయి లాంటిదని, కష్టపడి చదువుకోవాలని విద్యార్థికి కలెక్టర్ సూచించారు. పదవ తరగతి పరీక్షలు పూర్తయ్యే వరకు ప్రతినెల ప్రోత్సాహకంగా డబ్బులను ఇస్తానని హామీ ఇచ్చారు.
ఫిబ్రవరి నెలకు సంబంధించి ఐదువేల రూపాయలను విద్యార్థి భరత్ చంద్ర చారికి అందించాడు. చదువుకునేందుకు స్టడీచైర్ తో పాటు రైటింగ్ ప్యాడ్ ను కలెక్టర్ అందించాడు.
👉కలెక్టర్ కు కృతజ్ఞతలు !
మా ఇంటికి కలెక్టర్ రాకతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని భరత్ చంద్ర చెబుతున్నాడు. బాగా చదివి అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని తెలిపాడు. మా ఇంటి తలుపు తట్టి తన కొడుకును ప్రోత్సహించడం పట్ల జిల్లా కలెక్టర్ కు విద్యార్థి తల్లి విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు.