ఏఐ తో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ !

👉 ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు !


J.SURENDER KUMAR,


కృత్రిమ మేధస్సు (ఏఐ) సాయంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు “స్కిల్ డెవలప్‌మెంట్” లో శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ బోధనా సామర్థ్యాలను మరింత పెంపొందించుకునేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులను ప్రోత్సహిస్తామన్నారు.


👉 శనివారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ దిల్ రాజు ఆధ్వర్యంలో కోణం ఫౌండేషన్ నిర్వాహకులు సందీప్ కుమార్ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ…


👉అన్ని రంగాల్లో ఎమర్జింగ్ టెక్నాలజీస్ ను సమర్థవంతంగా వినియోగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వివరించారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా “ఏఐ సిటీ” ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక్కడే అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీని కూడా ప్రారంభించబోతుమన్నారు.


👉నల్గొండ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఏఐ సాయంతో ఉచితంగా స్కిల్ డెవలప్‌మెంట్ లో శిక్షణ ఇస్తున్న ఫౌండేషన్ సేవలను అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఈ ఫౌండేషన్ సేవలను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.


👉విదేశాల్లో ఉన్నత స్థాయిలో స్థిరపడిన సందీప్ కుమార్.. పుట్టిన ఊరిని మర్చిపోకుండా ఫౌండేషన్ తరఫున అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని ప్రశంసించారు. కార్యక్రమంలో ప్రభుత్వ ఐటీ సలహాదారు సాయికృష్ణ పాల్గొన్నారు.