బెట్టింగ్ యాప్‌ల ను ఉక్కు పాదంతో అణిచివేస్తాం సీఎం రేవంత్ రెడ్డి !


👉 శాసనసభలో సీఎం ప్రకటన..


J.SURENDER KUMAR,


ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రత్యక్షంగా నిర్వహించినా, పరోక్షంగా ప్రోత్సహించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటూ ఉక్కు పాదంతో అణచివేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇలాంటి వాటిని నిరోధించడానికి, నిషేధించడానికి పూర్తి స్థాయి అధికారాలతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు.

👉 శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా సభ్యుల నుంచి వచ్చిన ప్రస్తావనపై ముఖ్యమంత్రి  జోక్యం చేసుకుని, ఆన్‌లైన్ బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్‌, ఆన్‌లైన్ రమ్మీ వంటి వాటి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు.

👉 “కేవలం ప్రచారం కల్పించే వారిని విచారించడం ద్వారా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఈ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల వల్ల ఎంతో మంది బలవుతున్నారు. కేవలం రాష్ట్రంలో చర్యలు తీసుకున్నంత మాత్రాన సమస్యకు శాశ్వత పరిష్కారం లభించదు. ఇతర రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి.

👉  వీటిని నిషేధిస్తూ 2017 లో చట్టం చేసినప్పటికీ పకడ్బందీగా అమలు చేయడంలో కొంత నిర్లక్ష్యం జరిగింది. ఈ మధ్య కాలంలో చాలా వేగంగా దుర్వినియోగం జరుగుతోంది. రాష్ట్ర స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు వివిధ రకాల సంస్థలు, వ్యక్తులు, వివిధ దేశాలకు చెందిన నేరగాళ్లు ఇందులో పాల్గొంటున్నారు.

👉  ఆన్‌లైన్ బెట్టింగ్‌ నిర్వాహకులకు చట్టంలో కఠినమైన శిక్షలు కూడా లేవు. శిక్షను పెంచుతూ చట్టంలో అవసరమైన మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్, ఆన్ లైన్ రమ్మీ మాత్రమే కాదు. గంజాయి, కొకైన్, కోడి  పందేలు ఇతర వ్యసనాలకు కూడా తెలంగాణలో తావులేదు అని అన్నారు.

👉  తెలంగాణను ఒక ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకు పోతున్నాం. ధరల నియంత్రణలో, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో తెలంగాణ ముందున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తామెక్కడా డాంబికాలకు గొప్పలకు పోకుండా వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టే విధంగా రూపొందించాం. చేసేదే చెప్పాం. చెప్పిందే చేస్తామన్న విధానంలో బడ్జెట్‌ను నియంత్రించాం  అన్నారు.

👉  గచ్చిబౌలిలోని భూమి సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోనిది కాదు. యూనివర్సిటీకి ఎలాంటి సంబంధం లేదు. గతంలో ఐఎంజీ భారత్ అనే ఒక బోగస్ కంపెనీకి కేటాయించిన భూమిని 2006 లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసింది. దాదాపు 25 సంవత్సరాల పాటు న్యాయస్థానాల్లో కేసు పెండింగ్‌లో ఉంది. గత ప్రభుత్వంలో ఆ భూమిని వెనక్కి తిరిగి తీసుకోవాలన్న ప్రయత్నాలు చేయలేదు.

👉  తాను అధికారం చేపట్టిన తర్వాత సుప్రీంకోర్టులో పోరాడి ఆ కేసు గెలిచి భూమిని వెనక్కి తీసుకున్నాం. అభివృద్ధిలో భాగంగా ఆ భూమిని టీజీఐఐసీకి కేటాయించాం. అక్కడ ఐటీ కంపెనీలు, ఇతర పరిశ్రమలు రావడానికి ఒక స్పష్టమైన ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి ప్రణాళిక తయారు చేయమన్నాం. రకరకాల ప్రచారాలు చేస్తున్నట్టు అది రిజర్వు ఫారెస్ట్ కాదు.

👉  కాలుష్య కారక ఫార్మా పరిశ్రమలను కాదని, నెట్ జీరో సిటీ చేయాలన్న ఒక మంచి సంకల్పంతో 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమల ఏర్పాటు, ఇతరత్రా భూసేకరణకు సంబంధించి భూమి కోల్పోతున్న వారి బాధను దృష్టిలో ఉంచుకొని వారికి ఏ రకంగా నష్టపరిహారం చెల్లిద్దామన్న విషయంలో సూచనలు ఇవ్వాలి.

👉  భూములను కోల్పోతున్న వారిని ఆదుకునే బాధ్యత ప్రభుత్వానిది. అలాంటి కుటుంబాలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిద్దాం” అని ముఖ్యమంత్రి  వివరించారు.