భగవంతుడికి మాకు వేద పండితులు అర్చకులె వారధి లాంటి వారు !

👉 నరసింహుడి కళ్యాణ వేదిక పై మీ నిర్ణయమే శిరోధార్యం !
👉 ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ !


J.SURENDER KUMAR,


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేదిక ఏర్పాటు అంశంలో వేద పండితుల, ఆలయ అర్చకుల నిర్ణయమే నాకు శిరోధార్యం, మాకు భగవంతుడికి మీరు వారధి లాంటివారు అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.


ఈ నెల 10 వ తేదీ నుండి ప్రారంభం కానున్న ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ధర్మపురి పట్టణ కేంద్రంలోని స్థానిక బ్రాహ్మణ సంఘంలో అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులతో గురువారం ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ, కళ్యాణ ఏర్పాట్లు, తదితర అంశాలపై చర్చించారు.

స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించే వేదిక ఏర్పాటు అంశంపై పలువురు వేద పండితులు, అర్చకులు , నిర్మొహమాటంగా వివరించారు.


👉చివరగా ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ..


ప్రభుత్వపరంగా నేను కీలక ప్రోటోకాల్ హోదాలో ఉన్న దేవుడి సన్నిధిలో సామాన్య భక్తుడిని నన్ను అలానే గుర్తించాలని పలు సందర్భాల్లో అధికారులను కోరినట్టు వివరించారు.
స్వామి వారి బ్రహ్మోత్సవల్లో ఎక్కడ ఎటువంటి ఇబ్బందులూ కలగకుండా అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం తరఫున ఎటువంటి సహాయ సహకారాలు అవసరం ఉన్న అందిస్తామని, మొదటి సారిగా స్వామి వారి కళ్యాణాన్ని దేవాలయంలో కాకుండా బయట నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించి భూమి శుద్ధి మరియు ఇతర కార్యక్రమాలు ఏవి ఉన్న ఆలయ అర్చకులు, వేద పండితులు, బ్రాహ్మణోత్తముల సలహాలు సూచనల మేరకు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. ప్రభుత్వం నుండి రావాల్సిన అన్ని రకాల పరిపాలన అనుమతులు రావడం జరిగిందన్నారు.


👉 అదే స్థలంలో శాశ్వత కళ్యాణమండపం నిర్మాణం జరుగుతుంది !

శ్రీ మఠం స్వామికి చెందిన నాలుగు ఎకరాల స్థలంలో వేలాది మంది భక్తుల సౌకర్యార్థం ఈనెల 11 న నిర్వహించనున్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి నూతన కళ్యాణ వేదిక స్థలం శాశ్వత స్వామి వారి కళ్యాణ మండప నిర్మాణం ప్రభుత్వపరంగా చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
సనాతన సాంప్రదాయ, ఆచార, వాస్తు, ఆగమశాస్త్ర నిబంధనలు, మీ సలహాలు, సూచనల మేరకు ఆ స్థలం భవిష్యత్తులోనూ కలుషితం కాకుండా ACDP నిధులతో చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడమే కాక ప్రభుత్వపరంగా కోట్లాది రూపాయల నిధులతో కళ్యాణమండపం నిర్మిస్తానని హామీ ఇచ్చారు.

👉 శ్రీ మఠం పీఠాధిపతి స్వామివారు స్థలం ఆలయానికి అప్పగించడానికి సమ్మతించారు. పరమ పూజ శ్రీశ్రీ శ్రీ మఠం పీఠాధిపతి స్వామీజీ ఇట్టి స్థలాన్ని ఆలయానికి అప్పగించడానికి అభ్యంతరం లేదని భూ మార్పిడి విధానం ఒప్పందం మేరకు ప్రభుత్వం స్వామి వారితో చర్చిస్తుందన్నారు.

👉 గోశాల ఏర్పాటు, భక్తులకు నిత్యాన్నదానం, తులసి పూల మొక్కల పెంపకం తదితరవాటికి భూసేకరణ చేపట్టడంతో పాటు గోశాల కు వ్యక్తిగతంగా నా సొంత డబ్బులతో ఏర్పాటు కు కృషి చేస్తానన్నారు.

👉 సాయిరాం బియ్యం పెట్టండి !

బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తజనంకు నాణ్యమైన సాయిరాం బియ్యంతో పాటు రుచికరమైన భోజనాలు అందించాలని, రైస్ మిల్ యజమానులకు, వర్తక వ్యాపారులకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. మీరు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్న ఉచిత అన్నదానం నా భూతో నా భవిష్యత్ తరాలలో ఉండాలన్నారు. తాను ఎల్లవేళలా రైస్ మిల్ వ్యాపారులకు అండగా ఉంటానని, ఈ సందర్భంగా తన వంతుగా అన్నదానానికి కొంత నగదు ఆర్థిక సహాయం ఎమ్మెల్యే అందించారు .

ధర్మపురి ఆలయంలో ఉత్సవాల నిర్వహణలో సనాతన ఆచార సాంప్రదాయాల ప్రకారం, అర్చకులు వేద పండితుల సలహాలు సూచనలు, తూ చ తప్పకుండా పాటించాలని ఆలయ అధికారులను ఆదేశించారు.

👉 మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు !

వేద పండితులకు సంస్కృత సాంప్రదాయాలు కళలకు కళాకారులకు నిలయమైన ధర్మపురి క్షేత్రంలోని మూతపడిన తెలుగు సంస్కృత ఆంధ్ర కళాశాల తిరిగి పునః ప్రారంభం కావడానికి సహకరించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి శ్రీధర్ బాబుకు, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి, ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.