J.SURENDER KUMAR,
ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణ మహోత్సవం తిలకించడానికి తరలివచ్చిన వేలాదిమంది భక్తజనంతో మంగళవారం ధర్మపురి క్షేత్రం, కళ్యాణ మైదానం, పోటెత్తింది.
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం గోధూళి వేళలో శ్రీ యోగ, ఉగ్ర, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా కనుల పండువగా జరిగింది.

దాదాపు నాలుగున్నర ఎకరాల విశాలమైన శ్రీ మఠం మైదాన ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదిక పై స్వామి వారి కళ్యాణం తిలకించడానికి దాదాపు పదివేల మందికి పైగా భక్తజనం కూర్చుండి తిలకించేలా కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. కళ్యాణ మైదానం కు దాదాపు అర కిలోమీటర్ దూరం ( తెలుగు కళాశాల , గంపల వాడ ) వరకు భక్తజనం పోటెత్తారు. భక్తుల సౌకర్యార్థం ఆరు ఎల్ఇడి స్క్రీన్ ఏర్పాటు చేశారు.

బ్రాహ్మణ సంఘ భవనం వద్ద భక్తజనం కిక్కిరిసిపోవడంతో వృద్ధురాలు కింద పడింది. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
ఓల్డ్ టీటీడీ ధర్మశాలలో మంగళవారం అర్ధరాత్రి వరకు భక్తజనంకు ఉచిత అన్నదానం కొనసాగింది.

ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా పోలీస్ యంత్రాంగం ప్రణాళిక బద్ధంగా చర్యలు చేపట్టారు. మహిళల కోసం బస్ టాయిలెట్ల వాహనం అందుబాటులో ఉంచారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్, కళ్యాణం తిలకించడానికి తరలివచ్చిన భక్తుల వద్దకు వెళ్లి అభివాదం చేశారు.

విశాల మైదానంలో స్వామివారి కళ్యాణం నిర్వహించడంతో తొక్కిసలాట లేకుండా కనులారా కళ్యాణం తిలకించే భాగ్యం కలిగిందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ పర్యవేక్షణలో ఆలయ సిబ్బంది అలాంటి సమస్యలు తలెత్తకుండా కృషి చేశారు.
👉 పట్టు వస్త్రాలు సమర్పించిన ప్రభుత్వ విప్ !

స్థానిక ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ అడ్డూరి లక్ష్మణ్ కుమార్, స్వామివారికి తలంబ్రాలు, పట్టు వస్త్రాలు, మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు.

వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ బి సత్యప్రసాద్ దంపతులు, ఎస్పి అశోక్ కుమార్, ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ శ్రీధర్ కస్తూరి, ఐసిఐసిఐ బ్యాంకు సౌత్ ఇండియా రిటైర్డ్ రీజినల్ హెడ్ గుండి విష్ణు ప్రసాద్, దేవదాయ శాఖ మాజీ డిప్యూటీ కమిషనర్ దూస రాజేశ్వర్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్, తదితరులు కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

👉 డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి

స్వామివారి కళ్యాణ ప్రత్యక్ష వ్యాఖ్యానం నరసింహుడి మహత్యం, ధర్మపురి క్షేత్ర మహత్యం, గోదావరి నది ప్రత్యేకత విశిష్టత, అంశాలపై ఆయన చేసిన వ్యాఖ్యానంతో భక్తజనం తన్మయత్నం చెందారు . అర్చకులు, వేద పండితుల వేదమంత్రాలు, మంగళాష్టకాలు, ఆశీర్వచనాల వేద ఘోషతో క్షేత్రం ప్రతిధ్వనించింది.
👉 స్వామివారికి బంగారు ఆభరణం కానుక !
నిజాంబాద్ జిల్లాకు చెందిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకుడు, అగ్గుస్వామి, శ్రీ నరసింహుడికి కళ్యాణం జరుగుతుండగా బంగారు కంఠాభరణం బహుకరించారు. 40 బస్సు సర్వీసులలో భక్తులను కళ్యాణం తిలకించడానికి ఉచితంగా తీసుకువచ్చారు.
ధర్మపురి క్షేత్రం బుధవారం తెల్లవారుజాము వరకు భక్తజన సంచారంతో శివరాత్రిని తలపించింది.