డిజిటల్ ఆర్థిక సమగ్రతే లక్ష్యంగా గ్రామ్‌పే ఉండాలి మంత్రి శ్రీధర్ బాబు !

J.SURENDER KUMAR,

డిజిటల్ ఆర్థిక సమగ్రతను మరింత విస్తరించే లక్ష్యంగా గ్రామ్‌పే సేవల ఫలాలు గ్రామీణ లకు అందాలని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.

గ్రామ్‌పే ను మంత్రి శ్రీధర్ బాబు బుధవారం హైదరాబాదులో ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపులకు సంబంధించి గ్రామీణ భారతదేశంలోని లక్షలాది మందికి ఆర్థిక సాధికారత కల్పించేందుకు అనువుగా వియోనా ఫిన్‌టెక్ సంస్థ దీనిని అభివృద్ధి చేసింది.

👉 ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ….

డిజిటల్ ఆర్థిక వ్యవస్థను విస్తరించేందుకు సాంకేతికత కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ‘గ్రామ్‌పే భారతదేశ డిజిటల్, ఆర్థిక సమగ్రత లక్ష్యానికి దారితీసే విప్లవాత్మక ఆవిష్కరణ. డిజిటల్ చెల్లింపులు, గ్రామీణ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ద్వారా, గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలు చేరువ కావడం మాత్రమే కాకుండా, అవి వారికి హక్కుగా మారతాయి’ అని మంత్రి అన్నారు.

👉 వియోనా ఫిన్‌టెక్ సంస్థ చైర్మన్ రవీంద్రనాథ్ యర్లగడ్డ, మాట్లాడుతూ..

గ్రామీణ ప్రాంతాల్లో 65%కు పైగా జనాభా నివసిస్తున్న నేపథ్యంలో, ఆర్థిక సేవలు, డిజిటల్ వాణిజ్యం ఇంకా సరైన స్థాయిలో అందుబాటులోకి రాలేదు. గ్రామ్‌పే ఈ సమస్యను పరిష్కరించేందుకు రక్షితమైన, వేగవంతమైన, బ్యాంకింగ్ ప్రమాణాలకు అనుగుణమైన డిజిటల్ చెల్లింపులను అందిస్తోంది.

చిన్న వ్యాపారులు, రైతులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తులకు డిజిటల్ వాణిజ్యంలో పాల్గొనేలా చేయడం, నగదు పై ఆధారాన్ని తగ్గించడం, ఆర్థిక భద్రత పెంచడం ఈ ప్లాట్‌ఫామ్ లక్ష్యంగా పెట్టుకుంది.

గ్రామ్‌పే వ్యవస్థలో గ్రామ స్థాయి వ్యాపారులు కీలక పాత్ర పోషిస్తారు. వీరు తమ గ్రామాల్లో స్థానిక వ్యాపారులను డిజిటల్ చెల్లింపులకు అనుసంధానించడంతో పాటు, ప్రజలకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కల్పిస్తారు. QR కోడ్లు, యూపీఐ చెల్లింపులు, మొబైల్-ఆధారిత ఆర్థిక పరిష్కారాలను అందించడంలో వీరు సహకరించనున్నారు. రైతులు, చిన్న వ్యాపారులు, కళాకారులు తమ ఉత్పత్తులను విస్తృత మార్కెట్‌కు తీసుకెళ్లే అవకాశం ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పొందనున్నారు.

గ్రామీణ మరియు పట్టణ భారతదేశాల మధ్య ఉన్న ఆర్థిక అంతరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నదని పేర్కొన్నారు. “వియోనా ఫిన్‌టెక్‌లో, మేము ఆర్థిక అంతరాన్ని తొలగించేందుకు నూతన పరిష్కారాలను అందిస్తున్నాం. గ్రామ్‌పే ఒక సాధారణ చెల్లింపు ప్లాట్‌ఫామ్ మాత్రమే కాదు – ఇది నిజమైన ఆర్థిక సమగ్రత వైపు సాగుతున్న ఉద్యమం. డిజిటల్ లావాదేవీలను అందరికీ అందుబాటులోకి తేవడం మాకు గౌరవంగా భావిస్తున్నాం,” అని ఆయన అన్నారు.