J.SURENDER KUMAR,
బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించడానికి రాజకీయాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా పోరాడాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. అందుకు నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. ఈ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించే వరకు విశ్రమించేది లేదని శాసనసభ వేదికగా స్పష్టం చేశారు.
👉 బలహీన వర్గాలకు విద్య, ఉద్యోగ, అలాగే రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి సంబంధించి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శాసనసభలో ప్రతిపాదించిన రెండు వేర్వేరు బిల్లుపై ముఖ్యమంత్రి మాట్లాడారు.
👉 ఈ విషయంలో రాజకీయ పార్టీల నాయకులందరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుద్దామని చెప్పారు. అందుకు ప్రధాన ప్రతిక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుతో పాటు అందరం కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వం వద్దకు వెళదామని అన్నారు.
👉 ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ప్రధాని మోదీ గారిని కలవడానికి ప్రయత్నిద్దామని చెబుతూ, అందుకు సంబంధించి వారి అపాయింట్ మెంట్ కోరుతూ లేఖ రాయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ని ఆదేశించారు. ప్రధానమంత్రి తో పాటు లోక్ సభ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని కలిసి అన్ని విషయాలు వివరించి పార్లమెంట్ లో ఈ అంశాన్ని చర్చించడంతో పాటు సహకరించాలని కోరుదామని అన్నారు.

👉 శాసనసభలో ప్రవేశపెట్టిన రెండు బిల్లుకు మద్దతుగా రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా జెండాలు, ఎజెండాలకు అతీతంగా బలహీన వర్గాలకు అండగా ఏకాభిప్రాయంతో నిలబడ్డాయని ఒక సందేశాన్ని పంపించడంలో సహకరించినందుకు ముఖ్యమంత్రి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.
👉 శాస్త్రీయ పద్ధతిలో బీసీల గణాంకాలు తేల్చకుండా రిజర్వేషన్లు 50 శాతానికి మించొద్దని సుప్రీంకోర్టు చెబుతున్నందున, దేశంలోనే మొట్టమొదటి సారిగా తెలంగాణలో పారదర్శకంగా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కులగణన సర్వేను చేసి లెక్కలు తేల్చిందని వివరించారు.
👉 బీసీ కులగణన విషయంలో 4 ఫిబ్రవరి 2024 మంత్రిమండలి తీర్మానంతో ప్రారంభించి సరిగ్గా ఏడాది పూర్తయ్యేలోగా తిరిగి 4 ఫిబ్రవరి 2025 న శాసనసభలో తీర్మానం ఆమోదించే వరకు జరిగిన ప్రక్రియను ముఖ్యమంత్రి వివరించారు. అందుకు గుర్తుగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 4 న సోషల్ జస్టిస్ డేగా నిర్వహించుకోవాలని శాసనసభ ఆమోదించిన విషయాన్ని గుర్తుచేశారు.
👉 “ప్రభుత్వం నిర్వహించిన సర్వే తేల్చిన లెక్క నూటికి నూరు శాతం కరెక్ట్. ఈ సర్వే ప్రకారం బలహీనవర్గాలు 56 శాతం ఉన్నట్టు తేలింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గతంలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాం. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టడం ద్వారా చట్టబద్ధత కల్పిస్తున్నాం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకునే వరకు విశ్రమించేది లేదు” అని అన్నారు.