నీటి ప్ర‌యోజ‌నాల రక్షణ లో రాజీ పడం సీఎం రేవంత్ రెడ్డి.!

👉 కృష్ణా, గోదావ‌రి న‌ది జ‌లాల‌కు సంబంధించి !


J.SURENDER KUMAR,


కృష్ణా, గోదావ‌రి న‌ది జ‌లాల‌కు సంబంధించి తెలంగాణ ప్ర‌యోజ‌నాలు కాపాడాల‌ని కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్ కి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాలు కాపాడుకునే విష‌యంలో తాము ఏమాత్రం రాజీప‌డ‌బోమ‌ని స్పష్టం చేశారు.
ప్రధానంగా కృష్ణా న‌ది జ‌లాల్లో తెలంగాణ‌కు న్యాయ‌బ‌ద్ధ‌మైన వాటా కేటాయించాల‌ని, గోదావ‌రికి సంబంధించి నికర జలాల వాటాలు తేల్చిన తర్వాతే ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులపై నిర్ణయం తీసుకోవాలని కోరారు.

👉 నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తో కలిసి ముఖ్యమంత్రి ఢిల్లీలో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తో సోమవారం భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో సమావేశంలో ముఖ్యమంత్రి ప్రస్తావించిన అంశాలివే..

👉 “కృష్ణా ప‌రివాహ‌క ప్రాంతం తెలంగాణ‌లో ఎక్కువ‌గా ఉన్న‌ప్ప‌టికీ కృష్ణా న‌ది యాజ‌మాన్య బోర్డు (KRMB) ప‌క్ష‌పాతంగా వ్యవహరించి ఆంధ్ర‌ప్రదేశ్‌కు 66 శాతం, తెలంగాణ‌కు 34 శాతం నీటి కేటాయింపులు చేసింది. కృష్ణా న‌ది ప‌రివాహ‌కంలో సుమారు 70 శాతం తెలంగాణ‌లో ఉంటే కేవ‌లం 30 శాతం మాత్ర‌మే ఏపీలో ఉంది. కాబట్టి న్యాయంగా కృష్ణా జ‌లాల్లో 70 శాతం వాటా తెలంగాణకే కేటాయించాలి.

👉 కృష్ణా జలాల విషయంలో తెలంగాణ తీవ్రంగా నష్టపోతోంది. ఈ ఏడాది సైతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ త‌మ‌కు కేటాయించిన మొత్తానికి మించి నీరు త‌ర‌లించుకు పోయింది. ఇక ముందు త‌మ వాటాకు మించి కృష్ణా న‌ది నీటిని ఏపీ త‌ర‌లించుకొని పోకుండా చూడాలి. అందుకోసం కృష్ణా న‌దిపై ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటి విడుద‌ల‌కు సంబంధించి వెంట‌నే టెలీమెట్రీ యంత్రాలు ఏర్పాటు చేయాలి. అవ‌స‌ర‌మైతే టెలీమెట్రీ యంత్రాలకు అయ్యే ఖర్చు భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

👉 పాల‌మూరు-రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి 2022లోనే డీపీఆర్ స‌మ‌ర్పించినా అనుమ‌తుల్లో ఆల‌స్యం చేస్తున్నారు. కానీ ఇదే స‌మ‌యంలో న్యాయ‌స్థానాల ప‌రిధిలోని అప్ప‌ర్ భ‌ద్ర‌కు మాత్రం అనుమ‌తులు ఇచ్చారు. అలాగే సీతారామ ఎత్తిపోత‌ల‌, స‌మ్మ‌క్క సాగ‌ర్ బ్యారేజీల‌కు కూడా అనుమ‌తులు ఇవ్వ‌లేదు. ఈ మూడు ప్రాజెక్టుల‌కు కేంద్ర జ‌ల సంఘం (CWC), సాంకేతిక స‌లహా మండ‌లి (TAC) నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తులు వెంటనే ఇప్పించాలి.


👉 ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఏపీ ప్ర‌భుత్వం గోదావ‌రి-బ‌న‌క‌చ‌ర్ల అనుసంధాన ప‌థ‌కానికి రూప‌క‌ల్పన చేసింది. ఈ ప‌థ‌కానికి కేంద్ర జ‌ల సంఘం, గోదావ‌రి న‌ది యాజ‌మాన్య బోర్డు (GRMB), కేఆర్ఎంబీల‌ నుంచి ఎటువంటి అనుమ‌తులు పొందలేదు. దీనిని నిలిపేవేయాలి.


👉 గోదావ‌రి న‌దిలో తెలంగాణ‌కు సంబంధించి నిక‌ర జ‌లాల వాటాలను తేల్చాలి. గోదావ‌రిపై తెలంగాణ‌ తలపెట్టిన సీతారామ ఎత్తిపోత‌ల‌, స‌మ్మ‌క్క సాగ‌ర్ సహా చేప‌డుతున్న ప్రాజెక్టుల‌కు వెంట‌నే అనుమ‌తులు ఇవ్వాలి.


👉 గోదావరిపై తెలంగాణ ప్రాజెక్టులకు అనుమతులు వెంటనే మంజూరు చేయకపోతే ఆయ‌క‌ట్టు స్థిరీక‌ర‌ణ పేరుతో రాష్ట్రం న‌ష్టపోయే పరిస్థితి ఉంది. గతంలో కృష్ణా డెల్టా ఆయ‌క‌ట్టును చూపి కృష్ణా జలాల్లో తెలంగాణ‌కు న‌ష్టం చేశారు.


👉 ఇరు రాష్ట్రాల ముఖ్య‌మంత్రులు స‌భ్యులుగా ఉన్న‌ అపెక్స్ కౌనిల్స్‌లోనూ ఏపీ గోదావ‌రి – బన‌క‌చ‌ర్ల ప్రాజెక్టుపై ఎటువంటి చ‌ర్చ జ‌ర‌గ‌లేదు.


👉 పాల‌మూరు- రంగారెడ్డి, సీతారామ ఎత్తిపోత‌ల‌, మోడి కుంట వాగు, చ‌నాఖా కొర‌టా బ్యారేజీ (డిస్ట్రిబ్యూష‌న్ సిస్ట‌మ్‌), చిన్న కాళేశ్వ‌రం (ముక్తేశ్వ‌ర‌) ఎత్తిపోత‌ల ప‌థ‌కాల‌కు స‌త్వ‌ర సాగు నీటి ప్ర‌యోజ‌న ప‌థ‌కం (ఏఐబీపీ).. పీఎంఆర్‌పీ 2024 కింద త‌గిన ఆర్థిక స‌హాయం అందజేయాలి.


👉 సాగు నీటి ప్రాజెక్టుల‌కు ఆర్థిక స‌హాయం అంద‌జేసేందుకు మౌలిక వ‌స‌తుల అభివృద్ధి కింద 50 సంవ‌త్స‌రాలు పాటు వ‌డ్డీలేని రుణాలు తెలంగాణ‌కు ఇవ్వాలి.


👉 ప్రాణ‌హిత‌-చేవెళ్ల ప్రాజెక్టుకు సంబంధించి తుమ్మిడిహెట్టి వ‌ద్ద ప్రాజెక్టు నిర్మాణం చేప‌ట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముంపున‌కు సంబంధించి మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి కేంద్రమే అనుమ‌తులు ఇప్పించాలి” అని ముఖ్యమంత్రి కేంద్ర జల్‌శక్తి మంత్రికి వివరించారు.


👉 సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ నీటి ప్ర‌యోజ‌నాలు కాపాడుకునే విష‌యంలో తాము ఏమాత్రం రాజీప‌డ‌బోమ‌ని కేంద్రానికి స్పష్టం చేసినట్టు పునరుద్ఘాటించారు.


👉 ఈ స‌మావేశంలో నల్గొండ ఎంపీ కుందూరు రఘువీర్ , రాష్ట్ర నీటి పారుద‌ల శాఖ కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జా , సీఎం కార్య‌ద‌ర్శి మాణిక్ రాజ్‌ , ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శి ప్ర‌శాంత్ జీవ‌న్ పాటిల్ , రాష్ట్ర నీటి పారుదల శాఖ ఈఎన్సీ (ఓ అండ్ ఎం) విజ‌య్ భాస్క‌ర్ రెడ్డి , తెలంగాణ భ‌వ‌న్ రెసిడెంట్ క‌మిష‌న‌ర్ గౌర‌వ్ ఉప్ప‌ల్ త‌దిత‌రులు పాల్గొన్నారు.