👉 పూజలందుకొని రికార్డులు తనిఖీ చేసిన నరసింహుడు !
J.SURENDER KUMAR,

మామిడి తోరణాలు, పూలదండలతో అందంగా అలంకరించడంతో పోలీస్ స్టేషన్ కు పెళ్లి కళ వచ్చినట్టు అగుపించింది. పోలీసులు, వారి కుటుంబ సభ్యులు, సాంప్రదాయ వస్త్రధారణతో, మంగళ హారతులు చేత పట్టుకుని భక్తిశ్రద్ధలతో మంగళ వాయిద్యాలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ప్రాంగణంలోకి ఆహ్వానించారు.

పోలీస్ అధికారులు,వినయ విధేయలతో,పట్టు వస్త్రాలు ధరించి ఆలయం నుండి స్వామివారి పల్లకి సేవను భుజాలపై ఎత్తుకొని పట్టణ పురవీధుల గుండా భక్తిశ్రద్ధలతో గోవింద నామాలు స్మరిస్తూ పోలీస్ స్టేషన్ లో అందంగా పూలతో అలంకరించిన వేదిక పైకి తీసుకువెళ్లారు.

పోలీస్ కుటుంబ సభ్యులు తారతమ్యం లేకుండా సమిష్టిగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు, అర్చకులు వేదమంత్రాలతో స్వామివారికి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు . ఈ అపూర్వ, అరుదైన దృశ్యం భారతదేశంలో ఎక్కడ అగుపించదు. ఈ దృశ్యం కేవలం జగిత్యాల జిల్లా ధర్మపురి పోలీస్ స్టేషన్ లో ఆదివారం కన్నుల పండుగగా జరిగింది.

వివరాలు…
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి ఉత్సవ మూర్తులు ఊరేగింపుగా స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి రికార్డులను పరిశీలించడం అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం.

ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి రాక సందర్భంగా పోలీస్ కుటుంబ సభ్యులు ప్రాంగణం లో ముగ్గులు వేసి తమ భక్తిశ్రద్ధలను చాటుకున్నారు. పోలీసులు స్థానికులను, పరిసర నివాసవాసులను ఆహ్వానించి స్వామి , తీర్థ ప్రసాదాలు తీసుకోవాలని కోరారు.

బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాత్రి , పగలు రెప్ప వాల్చని బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు యంత్రాంగం, స్వామివారి రాక సందర్భంగా ఉత్సాహంగా పూజాది కార్యక్రమంలో పాల్గొన్నారు.