తెలంగాణ రైజింగ్‌ విజన్‌ కు మద్దతు ఇవ్వండి సీఎం రేవంత్ రెడ్డి !

J.SURENDER KUMAR,


రాబోయే 25 ఏండ్ల పాటు తెలంగాణ రైజింగ్‌ విజన్‌ను సమున్నతంగా నిలిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు మద్దతునివ్వాలని గురువారం ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి  సుబ్రహ్మణ్యం జయశంకర్ ని కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి తో ముఖ్యమంత్రి  భేటీ అయ్యారు.


👉 ఈ ఏడాది హైద‌రాబాద్‌లో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌నున్న అంత‌ర్జాతీయ కార్య‌క్ర‌మాలైన మిస్ వ‌ర‌ల్డ్‌ పోటీలు, గ్లోబ‌ల్ డీప్ టెక్ స‌ద‌స్సు, భారత్ సమ్మిట్ ఈవెంట్లు, యానిమేష‌న్ గేమింగ్‌, వీఎఫ్ఎక్స్‌తో పాటు వినోద ప‌రిశ్ర‌మ‌లో తెలంగాణ బ‌లాన్ని చాటే ఇండియా జాయ్ వంటి వేదికల వివరాలను ముఖ్యమంత్రి  కేంద్ర మంత్రి  దృష్టికి తీసుకెళ్లారు.


👉 దౌత్య సహకారంతో జరిగే ఈ గ్లోబల్ ఈవెంట్స్‌ విజయవంతం అయ్యేలా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల్లో నిర్వహించే భారత కార్యక్రమాల్లోనూ తెలంగాణ రైజింగ్‌కు తగినంత ప్రచారం, ప్రాధాన్యం కల్పించాలని విన్నవించారు.


👉 ముఖ్యమంత్రి  అభ్యర్థన పట్ల విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్  సానుకూలంగా స్పందించారు. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ప్రధానంగా ఉందని, అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న న‌గ‌రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోన్న హైద‌రాబాద్‌ నగరంలో చేప‌ట్టే కార్య‌క్ర‌మాల‌కు విదేశీ వ్యవహారాల శాఖ మద్దతు ఇస్తుందని కేంద్ర మంత్రి  తెలియజేశారు.


👉 కేంద్ర మంత్రి జైశంకర్ గారితో జరిగిన భేటీలో ముఖ్యమంత్రి గారి వెంట కేంద్ర మాజీ మంత్రి స‌ల్మాన్ ఖుర్షీద్‌ , ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్, డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి ఉన్నారు.