J.SURENDER KUMAR,
జమ్ము కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పర్యాటకుల ఆత్మలకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, ఉగ్రవాదుల అణిచివేత కోసం భారత ప్రభుత్వం ఇలాంటి చర్యలు తీసుకున్న సంపూర్ణ మద్దతు ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం నిర్వహించిన సంఘీభావ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఉగ్రదాడిలో చనిపోయినవారికి ఆత్మశాంతి చేకూరాలని ప్రార్థిస్తూ నివాళులు అర్పించారు.

హైదరాబాద్ పీవీ మార్గ్ (నెక్లెస్ రోడ్డు) లోని పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరా గాంధీ విగ్రహం వరకు సాగిన కొవ్వొత్తుల ర్యాలీలో ముఖ్యమంత్రి తో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రివర్గ సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, భారత్ సమ్మిట్ లో పాల్గొనడానికి వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సంఘీభావ ర్యాలీని ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పహల్‌గామ్‌లో అమాయకుల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనకు బాధ్యులైనవారిపై కఠినంగా చర్యలు తీసుకునే విషయంలో యావత్ దేశం కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.

“ఈ భావోద్వేగ సమయంలో 140 కోట్ల మంది భారత ప్రజలంతా ఒక్కటిగా నిలబడాలి. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఇది రాజకీయాలకు అతీతంగా ఐకమత్యం చాటుకోవాల్సిన సందర్భం. దాడికి బాధ్యులైన వారిని ఉపేక్షించకూడదు. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ విషయంలో భారత ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాము.

1967లో చైనాపై, 1971లో పాకిస్తాన్‌పై నాటి ప్రధాని ఇందిరా గాంధీ నాయకత్వంలో మన దేశం చూపిన తెగువను గుర్తు చేస్తున్నాను. ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉగ్రవాదులకు గట్టిగా బుద్ధి చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి విజ్ఞప్తి చేస్తున్నాను. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను భారత్‌లో కలపే విశయంలోనూ ప్రధానమంత్రికి మద్దతు ఇస్తాం. అలాగే, ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తామని భరోసా ఇస్తున్నాం” అని ముఖ్యమంత్రి అన్నారు.