J.SURENDER KUMAR,
రాష్ట్రంలో వ్యవసాయ భూ సమస్యలు శాశ్వత పరిష్కారం ,రైతులకు వారి భూముల పై భరోసా కల్పించడమే భూ భారతి చట్టం ప్రధాన లక్ష్యం అని ధర్మపురి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు
రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన తెలంగాణ భూభారతి చట్టం (భూమి హక్కుల రికార్డు చట్టం)-2025 పై గొల్లపల్లి మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన చట్టం భూభారతి తో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ అన్నారు.
డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భారతి కొత్త చట్టాన్ని ప్రారంభించాడని వివరించారు

ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా దొరుకుతుందని, జూన్ 2 నుండి ఆన్లైన్ లో భూభారతి చట్టం పోర్టల్ పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. భూములకు సంబంధించిన సమస్యలపై రైతులు దరఖాస్తు చేసుకోవచ్చని, ఏదైనా సమస్య పరిష్కారానికి దరఖాస్తు చేస్తే నిర్దేశించిన సమయంలో పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు.
ధరణిలో వ్యవసాయ సబ్ డివిజన్ పై ఎలాంటి ప్రస్తావన లేదని , భూభారతి చట్టంలో సబ్ డివిజన్స్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 31న భూభారతి చట్టం లోని నిబంధనల ప్రకారం రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుందన్నారు.
రైతులు ఇకపై బ్యాంకు రుణాలకు వెళ్ళినప్పుడు భూములకు సంబంధించిన కాగితాలను సమర్పించాల్సిన అవసరం లేదని, భూభారతి పోర్టల్ లో నమోదైన రికార్డుల ఆధారంగానే బ్యాంకు రుణాలు ఇస్తారని ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ తెలిపారు.
రైతులకు మేలు జరిగేలా భూ వివాదాలు లేని చట్టంగా ప్రభుత్వం ఈ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిందన్నారు.
