👉 జగిత్యాల కలెక్టర్ సత్య ప్రసాద్ !
J.SURENDER KUMAR,
భూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం ద్వారా సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం లభిస్తుందని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు.
గురువారం మల్యాల మండలంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన భూ భారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తో కలిసి పాల్గొన్నారు.
భూ భారతి చట్టం లోని వివిధ అంశాలను కలెక్టర్ రైతులకు, ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
👉 ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ.
తెల్ల కాగితాల పై కొనుగోలు చేసిన సాధా బైనామా భూముల పట్టాలు అందించాలని గత ప్రభుత్వం తీసుకున్న దరఖాస్తుల పరిష్కారం పై ధరణిలో అవకాశం లేనందున హై కోర్టు స్టే విధించిందని, పెండింగ్ సాధా బైనామా పరిష్కారం కోసం భూ భారతి చట్టం సెక్షన్ 6 క్రింద ఆర్డిఓ లకు బాధ్యతలు అందించిందని అన్నారు.
చిన్న సన్న కారు రైతులు 2014 కంటే ముందు కొనుగోలు చేసిన గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు మాత్రమే సాధా బైనామా పట్టా లభిస్తుందని అన్నారు. గడిచిన 12 ఏళ్ళలో సాధా బైనామా భూముల అనుభవంలో ఉన్న వారికి మాత్రమే దరఖాస్తులు పరిష్కారం అవుతాయని అన్నారు.
భూ భారతి చట్టం ద్వారా పక్కగా భూ సరిహద్దులు నిర్ణయిస్తారని, రైతులకు, భూ హక్కుదారులకు ఉచిత న్యాయ సాయం అందుబాటులో ఉంటుందని అన్నారు. భూ భారతి చట్టం ప్రకారం అధికారులు అందించిన ఆర్డర్ల పై సంతృప్తి చెందకుంటే బాధితులు అప్పిల్ చేసుకునే అవకాశం ఉందని అన్నారు.
వారసత్వం లేదా వీలునామా ద్వారా భూమిపై హక్కుల సంక్రమిస్తే తహసిల్దార్ విచారణ జరిపి రికార్డుల్లో మ్యూటేషన్ చేస్తారని, నిర్ణీత గడువు 30 రోజుల లోగా మ్యూటేషన్ పూర్తి చేయకుంటే ఆటోమేటిక్ గా మ్యూటేషన్ జరుగుతుందన్నారు.
భూముల రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపించి మ్యాప్ తయారు చేయాల్సి ఉంటుందన్నారు.
భూముల విస్తీర్ణం మార్పులు చేర్పులకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో మనిషికి ఆధార్ కార్డు ఉన్నట్లు భూమికి భూ దార్ కార్డు అందించడం జరుగుతుందని అన్నారు.
👉 కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ,..

గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి వ్యవస్థ వల్ల ఇబ్బంది పడని రైతు ఎవరూ లేరని అన్నారు. 15 నెలల నుంచి క్షుణ్ణంగా అధ్యయనం చేసి పేద ప్రజలకు న్యాయం జరిగేలా భూ భారతి చట్టం ప్రవేశ పెట్టారని అన్నారు.భూ భారతి చట్టం ప్రవేశం పెట్టడమే కాకుండా అధికారులను గ్రామాలకు పంపి భూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం లో రైతులు పండించిన సన్న ధాన్యం కు నేడు యాసంగి సీజన్ లో కూడా ప్రభుత్వం క్వింటాల్ వడ్లకు ₹ 500 రూపాయల బోనస్ అందిస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజన్ అధికారి
పి మధుసూదన్ మల్యాల తహసిల్దార్ మునీందర్ ఎంపీడీవో ఏ ఎం సి మార్కెట్ చైర్మన్, రైతులు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
